రంపచోడవరం: రాజవొమ్మంగి సీడీపీఓ మరణానికి కారకులను వెంటనే అరెస్ట్ చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం రంపచోడవరం ఐటీడీఏ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్, జిల్లా అధ్యక్షులు వాణిశ్రీ, అంగన్‌వాడీల యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మల మాట్లాడుతూ కొత్తగా పదోన్నతితో రాజవొమ్మంగి సీడీపీఓగా వచ్చిన సుజాత చాలా మృదు స్వభావని, పని పట్ల అంకితభావం గల వ్యక్తి అన్నారు. రాజవొమ్మంగి ఐసీడీఎస్ పరిధిలోని అంగన్‌వాడీ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారని అన్నారు. సూపర్‌వైజర్ బదిలీ విషయంలో సూపర్‌వైజర్ అసోసియేషన్ నాయకులు శ్రీకాంత్‌రాజు చేసిన వేధింపులు, బెదిరింపు కాల్స్ వల్లే సీడీపీఓ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఫిర్యాదులు ఇచ్చారని, కానీ నేటికి శ్రీకాంత్‌రాజును పోలీసులు అరెస్టు చేయకపోవడం సరికాదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై కలెక్టర్ దినేష్ కుమార్ స్పందిస్తూ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఆ నివేదక ఆధారంగా కారకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు రాజేశ్వరి, జిల్లా నాయకురాళ్లు రామలక్ష్మి, రాణి, వెంకటలక్ష్మి, కుమారి, ప్రసన్న, సీత, సునీత, కనకలక్ష్మి, ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.


