● కోనసీమ రైతు పరిరక్షణ సమితి
● కలెక్టరేట్ వద్ద పారబోస్తామని హెచ్చరిక
అమలాపురం రూరల్: జిల్లాలో రబీలో రైతులు పడించిన బొండాలు రకం వరి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియలో నిర్లక్ష్యం చేస్తే రైతులు పడించిన ధాన్యాన్ని ట్రాక్టర్లలో తీసుకువచ్చి కలెక్టరేట్ వద్ద పడేసి నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద వారు నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం, ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు అధ్వర్యంలో రైతు ప్రతినిధులు జేసీ నిడియాదేవిని కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో ఉన్న మండపేట రైస్ మిల్లుల్లో గతంలో ధాన్యం కోనుగోలు జరిగేదని, జిల్లా విభజనతో మండపేట తూర్పుగోదావరి జిల్లాలో కలవడం వల్ల సమస్య వస్తోందన్నారు. రైతు నాయకులు చిక్కం పెద్దబ్బులు, జిన్నూరి వెంకటేశ్వరరావు, ఆకుల లక్ష్మణరావు, ఆకుల శేషనాయుడు, టీవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


