జీడి పిక్కలను ప్రభుత్వమే కొనాలి | - | Sakshi
Sakshi News home page

జీడి పిక్కలను ప్రభుత్వమే కొనాలి

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

వై.రామవరం: ఏజన్సీలో జీడిపిక్కలను గిరిజన రైతుల వద్ద ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెదుళ్ల లచ్చిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా బుధవారం వై.రామవరం మండలం సింహాద్రిపాలెం గ్రామంలో గిరిజన జీడి మామిడి రైతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏజన్సీలో కొందరు దళారులు జీడిపిక్కల కంపెనీ యాజమాన్యాలతో కుమ్మకై ్క జీడి పిక్కలకు వైరస్‌ వచ్చిందని వంకలు పెడుతూ గిట్టుబాటు ధర కల్పించకుండా మోసగిస్తున్నారని ఆరోపించారు. ఒక సింహాద్రిపాలెం గ్రామంలోనే రైతుల వద్ద సుమారు 4 వందల బస్తాలు జీడిపిక్క నిల్వలు ఉండిపోయాయన్నారు. గతంలో కేజీ రూ.150కు కొనుగోలు చేసి, ప్రస్తుతం రూ.వందకు కూడా కొనుగోలుకు ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ దళారులంతా సిండికేట్‌గా ఏర్పడి గిరి రైతులను మోసగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసినట్లే, జీడిపిక్కలు కూడా కొనుగోలు చేసి ఇక్కడి రైతులను ఆదుకోవాలని కోరారు. అలాగే తమ సంఘం రైతులకు అండగా ఉండి పోరాడుతుందని భరోస ఇచ్చారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్‌ను కలసి విన్నవించనున్నట్లు లచ్చిరెడ్డి తెలిపారు. గిరిజన రైతులను మోసగిస్తున్న దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి మడిగొంట వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు పుడిగి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్‌లు వేట్ల జోగిరెడ్డి, వేట్ల సన్యాసిరెడ్డి జీడిమామిడి రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

గిరిజనులు సేకరించిన జీడిపిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సిండికేటుగా మారి రైతులను మోసం చేస్తున్న దళారులపై అధికారులు చర్యలు తీసుకోవాలి.

దళారుల ఆగడాలతో

పేరుకుపోతున్న నిల్వలు

వైరస్‌ వచ్చిందని దుష్ప్రచారం చేస్తూ గిట్టుబాటు ధరకు ఎసరు

ఆదివాసీ గిరిజన చైతన్య వేదిక

జిల్లా అధ్యక్షుడు లచ్చిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement