రత్నగిరిపై ప్రతిధ్వనించిన వేదఘోష | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై ప్రతిధ్వనించిన వేదఘోష

Apr 30 2026 7:37 AM | Updated on Apr 30 2026 7:37 AM

అన్నవరం: రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో బుధవారం వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి వేదికపై ప్రతిష్ఠించి, సర్వాంగ సుందరంగా అలంకరించి, పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన వేద పండితులు సాయంత్రం 6 గంటలకు స్వామివారి ముందు తమ నాలుగు వేదాలు పఠించి, తమ విద్వత్తును ప్రదర్శించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం వేద పండితులు వేదాశీస్సులందజేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన చెందిన ప్రవా రామకృష్ణ సోమయాజి, రామ్‌లాల్‌శర్మలతో పాటు 180 మంది వేద పండితులను, దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, శివ తదితరులను, ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, విశ్రాంత ప్రధానార్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ, నాగాభట్ల సత్యనారాయణ, విశ్రాంత వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, మంగళంపల్లి కృష్ణభగవాన్‌జీలను దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజులాదేవి, ఏఈఓ కృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఘనపాఠులకు రూ.4 వేలు, క్రమపాఠులు, విశ్రాంత అర్చకులు, వ్రత పురోహితులకు రూ.3 వేల చొప్పున పారితోషికాన్ని వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పొన్నచెట్టు వాహనంపై ఘనంగా ఊరేగింపు

కల్యాణోత్సవాల్లో భాగంగా సత్యదేవుడు, అమ్మవారిని పొన్నచెట్టు వాహనం మీద ఘనంగా ఊరేగించారు. రాత్రి 8.30 గంటలకు స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరి తొలి పావంచా వద్దకు తీసుకువచ్చి, పొన్నచెట్టు వాహనంపై వేంచేయించి, పండితులు పూజలు చేయించారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ దర్శించి, పూజలు చేశారు. అనంతరం, రత్నగిరి తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్‌ సెంటర్‌ వరకు.. అక్కడి నుంచి తిరిగి తొలి పావంచా వరకు ఊరేగింపు సాగింది. పలువురు కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజులాదేవి, వేద పండితులు, అర్చకులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement