● పిక్కల కోనుగోలుకు లైసెన్సులు తప్పనిసరి
● సిండికేట్‌గా మారిన వ్యాపారులపై చర్యలు
● కలెక్టర్ దినేష్‌కుమార్
రంపచోడవరం: జిల్లాలో జీడిమామిడి రైతులు దళారుల మోసాలకు గురికాకుండా గిట్టుధర లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ కె.దినేష్‌కుమార్ తెలిపారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో బుధవారం హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీడిపిక్కల కొనుగోలుదారులు తప్పనిసరిగా ఐటీడీఏ ద్వారా లైసెన్సులు తీసుకోవాలని, కొనుగోలు కేంద్రాలు వద్ద ప్రతీ రోజు ధరలను బోర్డుపై ప్రదర్శించాలన్నారు. తూకాలలో మోసపోకుండా డిజిటల్ కాటాలు ఏర్పాటు చేయాలని, సిండికేట్‌గా ఏర్పడి ధర తగ్గించేవారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గతంలో జీడి పిక్కలను ఎలా కొనుగోలు చేసేవారన్న విషయాన్ని వెలుగు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జీడి పిక్కల నాణ్యతపైనా ఆయన చర్చించారు. అలాగే తూకాల్లోనూ లీగల్ మెట్రలాజీ సర్టిఫికెట్లను పరిశీలించాలని తహసీల్దార్ సీహెచ్ బాలాజీని కలెక్టర్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని జీడి మామిడి పిక్కల ఫ్యాక్టరీల యాజమాన్యాలతో ధరల విషయమై చర్చించామని సుమారు ఐదు వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలుకు ఇక్కడకు వారు రానున్నట్టు ఆయన తెలిపారు. పందిరిమామిడి దగ్గరలో జీడి పిక్కల గొడౌన్‌ను ఏర్పాటు చేయనున్నామని, రైతులు సైతం వాటిని పర్యవేక్షించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి, గంగవరం మండలాల రైతులు ఆ గొడౌన్‌లో సరకు భద్రపరుచుకుని, వాటిని కొనుగోలు చేసిన సంస్థలే డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. జిల్లాలో ఎన్ని వీడివీకేలు ఉన్నాయి, ఎన్ని జీడి పిక్కల ప్రాసెసింగ్ చేస్తున్నాయో ఆరా తీశారు. కాగా జీడి పిక్కలకు మద్దతు ధర కల్పించాలని ఎంపీపీ బంధం శ్రీదేవి, స్వామి దొర కలెక్టర్‌ను కోరారు. ముందుగా పెద్దగద్దాడ గ్రామంలోని జీడి మామిడి తోటలను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో డీహెచ్‌ఓ దేవదానం, డీఆర్‌డీఏ పీడీ దాసరి రత్నాకరరావు, ఏడీఏ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.


