గంజాయి మొక్కలు
● ఆగని గంజాయి రవాణా
● పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నా
మళ్లీ మామూలే
● ఏజెన్సీలో మకాం వేస్తున్న
ఇతర రాష్ట్రాల ముఠాలు
రంపచోడవరం: గంజాయి రవాణా గుట్టుగా సాగిపోతోంది.. ఆగకుండా సరిహద్దులు దాటుతోంది.. అటవీ ప్రాంతం అక్రమార్కులకు వరంలా మారింది.. ఇది వారికి రూ. కోట్లు తెచ్చిపెడుతోంది.. పోలీసుల తనిఖీలు జరుగుతున్నా, మళ్లీ మామూలే అన్నట్లు జరిగిపోతోంది.. ఏజెన్సీలో ఇతర రాష్ట్రాల ముఠాలు మకాం వేసి మరీ పంట పండించే దగ్గర నుంచి, సరకు తరలించడం వరకూ యథేచ్ఛగా జరిగిపోతూనే ఉంది. అయినా వేళ్లూనుకుపోయిన వ్యవస్థను పెకిలించడం పోలీసు వ్యవస్థకు సవాలుగా మారుతోంది. ఒడిశా ప్రాంతంలో పండించిన గంజాయిని ఆంధ్రా సరిహద్దులు దాటించి స్మగ్లర్లు రూ.కోట్లు సంపాదిస్తున్నారు. గంజాయి ముఠాలు ఏజెన్సీలో మకాం వేసి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు గంజాయిని తరలిస్తున్నారు. ఈ రవాణాపై పోలీసులు నిఘా పెట్టి స్మగ్లర్లను పట్టుకుంటున్నా మళ్లీ మామూలుగానే సాగిపోతోంది. తాజాగా గంజాయి స్మగ్లర్లు కారులో గంజాయితో గుర్తేడు వైపు నుంచి రావడంతో పోలీసులకు ముందుగా సమాచారం అందింది. పోలీస్ స్టేషన్ వద్ద కారును ఆపే ప్రయత్నం చేయడంతో, వారు ఆగకుండా రంపచోడవరం వైపు వెళ్లి, తిరిగి మారేడుమిల్లి స్టేషన్ వైపు వేగంగా వస్తూ ఆవును, ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఇలా గంజాయి స్మగ్లర్లు దేనికై నా తెగిస్తున్నారు. చివరికి కారులో గంజాయితో పాటు కేరళకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. అలాగే గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు.
ఇతర రాష్ట్రాల వారే నిందితులు
తాజాగా దొరికిన గంజాయి కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, ముంబయికి చెందిన నిందితులే పట్టుబడ్డారు. గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాల తనిఖీలో మహారాష్ట్రకు చెందిన ఖంబం శేరంజిన్ పిట్చేశ్రావు, అనిష్ అహ్మద్ రియాజ్, సుచిత్ర జాదవ్, ముంబాయికి చెందిన మహిళా, నితిన్ హనుమంత మునతిలు పట్టుబడ్డారు. కాకినాడ జిల్లాకు చెందిన కోలా ప్రభు కూడా వారితో ఉన్నాడు. ఈ కేసులో రెండు కార్లలో 120 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ రూ. 60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. రెండు రోజుల కిందట గుర్తేడు వైపు నుంచి వాహనంలో వస్తూ పట్టుబడిన నిందితులు కేరళకు చెందిన వారే. గతంలో కూడా చైన్నె, బెంగళూరుకు చెందిన వారు కూడా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు.
రెండు నెలలు ముందే వచ్చి..
గంజాయి పండించే ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలకు రెండు నెలల ముందే ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు చేరుకుంటున్నారు. ఒడిశా గిరిజనులతో మమేకమై వారితో గంజాయి సాగు చేయించేందుకు సిద్ధం చేస్తారు. ఏటా అక్టోబర్ పంట వేస్తారు. మూడు నెలల్లో గంజాయిని కటింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు. అంటే జనవరి ఆఖరి నాటికి గంజాయి రవాణాను ప్రారంభిస్తారు. మూడు నెలల కాలానికి గంజాయి సాగు కోసం అవసరమైన ఎరువులను వ్యాపారులే సరఫరా చేస్తారు. విత్తనాల సేకరణ ఒడిశా గిరిజనులే చూసుకుంటారు. చిత్రకొండ, పప్పులూరు, కుర్మానూరు, జోడం, గుర్రాల ఊరు, సరిగట్టు సీలేరు సరిహద్దులోని ఒడిశా గ్రామాల్లో గంజాయి సాగు జోరుగా సాగుతోంది. గంజాయి సాగులో తమిళనాడు, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఎక్కువగా ఉంటారు. గంజాయిలో శీలావతి మొదటి రకం గంజాయిని పండించిన చోటే కిలో రూ. 5 వేలకు విక్రయిస్తారు. రెండో రకం కిల్లీ కిలో రూ. 2 వేలు, గుండ రెండు రకాల్లో మిగిలిన గుండ రూ. 2 వేలు పలుకుతుంది. రవాణా సమయంలో గంజాయి పాడవకుండా ప్లాస్టిక్ కవర్లలో నింపి వాటికి చుట్టూ ప్లాస్టర్ వేస్తారు.
వారి రూటు.. సపరేటు
గంజాయి రవాణాపై స్మగ్లర్లు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. గతంలో గంగవరం మీదుగా మల్లిసాల అటవీ ప్రాంతానికి చేర్చి అక్కడి నుంచి హైవేకు వాహనాన్ని తీసుకువెళ్లేవారు. హైవేకు వచ్చిన వాహనం గమ్యస్థానం చేరడం చాలా సులువు. ఎక్కడ తనిఖీలు లేకపోవడంతో స్మగ్లర్ల పని సులభంగా అవుతుంది. ఒడిశా ప్రాంతంలో పండించిన గంజాయిని సీలేరు నది దాటించి కాలినడకన పాతకోట మీదుగా వై.రామవరం సరిహద్దు గ్రామాల నుంచి గంగవరం మీదుగా మైదాన ప్రాంతాలకు తరలిస్తారు. అలాగే టవర్ లైన్ ద్వారా మారేడుమిల్లి ఘాట్ రోడ్డుకు చేర్చి అక్కడి నుంచి అనుకూలంగా ఉంటే అటుగా భద్రాచలం మీదుగా తెలంగాణ హైదరాబాద్‌కు చేరుతుంది. తర్వాత కేరళ, బెంగళూరు, ముంబయి వంటి నగరాలకు తరలిస్తారు. అక్కడకు చేరిన గంజాయికి రూ.కోట్లలో ధర పలుకుతుంది. గంజాయి రవాణాలో గిరిజనులు, మధ్యవర్తులు, పైలెట్‌లే కీలకంగా వ్యవహరిస్తారు. వ్యాపారులు రాజమహేంద్రవరం వంటి నగరాల్లో మకాం వేసి పర్యవేక్షణ చేస్తారు. గంజాయి రవాణా చేస్తూ ఎంతోమంది గిరిజనులు పట్టుబడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పనికి వెళ్లి ఇలా వారు పట్టుబడుతుంటే, వ్యాపారులు చల్లగా జారుకుంటున్నారు.
అంతా తెలిసినా..
గంజాయిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అవుతోంది. అసలు పంట వేయకుండా ఆపగలిగితే రవాణాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒడిశా– ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతున్నా, అడ్డుకోవడంలో ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ముందుగా సాగును అరికట్టాల్సి ఉందని అంతా సూచిస్తున్నారు.


