రంపచోడవరం: మారేడుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 18న బీభత్సం చేసిన గంజాయి తరలింపు నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ టీజీఎన్ ప్రసాద్, ఎస్సై కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు వారిని మారేడుమిల్లి శివారు జీఎం వలస జంక్షన్‌లో సోమవారం పట్టుకున్నామన్నారు. ఇందులో అప్సల్ ఆర్‌ఏ (కర్ణాటక), నఫ్రాజ్ (కేరళ), ఫైజాన్ రజాక్ సికే (కర్ణాటక) ఉన్నారన్నారు. వీరు ధారకొండ ప్రాంతం నుంచి 152 కిలోల గంజాయిని కారులో మారేడుమిల్లి మీదుగా బెంగళూరు తరలిస్తున్నారు. మార్గం మధ్యలో ఫారెస్ట్ చెక్‌పోస్టును చూసి పోలీసులు తనిఖీ చేస్తారనే భయంతో వెనకు తిప్పి మారేడుమిల్లి సెంటర్‌లో ఆర్టీసీ బస్సును ఢీకొని కారును వదిలి ఆ ముగ్గురూ పరారయ్యారు. ఈ మేరకు వారిని పట్టుకున్నట్లు సీఐ, ఎస్సై వివరించారు.
అదృశ్యమై.. ఆపై శవమై
రాజవొమ్మంగి: అదృశ్యమైన ఓ వృద్ధురాలు ఆపై శవమై కనిపించడం ఆ గ్రామంలో కలకలం రేపింది. రాజవొమ్మంగి మండలం దూసరపాము గ్రామానికి చెందిన మరిసే దేవుడమ్మ (65) ఇంటి నుంచి వెళ్లి సుమారు ఐదు రోజులు అవుతోంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా, సూరంపాలెం సెల్ టవర్ వద్ద దేవుడమ్మ మృతిచెంది పడి ఉన్నట్లు గుర్తించారు. ఆమె భర్త గతంలోనే మరణించగా, ఇటీవల కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ మనోవేదనతో దేవుడమ్మ ఇల్లు వదిలి ఎక్కడెక్కడో తిరుగుతూ, చివరికి విగత జీవిగా కనిపించడంతో దూసరపాములో విషాదం అలముకుంది. వీఆర్వో భూలక్ష్మి పంచనామా నిర్వహించి దేవుడమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిండి లేక, దాహార్తి, వడగాడ్పుల వల్ల ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయమే మేలు
రాజవొమ్మంగి: ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయమే మేలని ప్రకృతి వ్యవసాయ జిల్లా డీపీఎం రాబిన్ సుదర్శన్ అన్నారు. సోమవారం రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడులో మాస్టర్ ట్రైనర్ అప్పలరాజు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. మండల వ్యవసాయాధికారి చక్రధర్, ఉపాధి ఏపీఓ శ్రీనివాసరావు, శిక్షకులు పాల్గొన్నారు.


