రంపచోడవరం: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం సమావేశ భవనంలో పీజీఆర్‌ఎస్ నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొఖ్వాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడం అధికారుల ప్రధాన బాధ్యత అని అన్నారు. పెండింగ్‌లో ఉన్న రీ–ఓపెన్ చేసిన అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌కు అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
పిల్లలను బడికి పంపండి
జిల్లా వ్యాప్తంగా 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ‘బాలల్లారా బడికి రండి – ప్రభుత్వ బడి పిలుపు, భవితకు మలుపు’ కార్యక్రమాన్ని కలెక్టర్ కె.దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు రంపచోడవరంలో వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. విద్యా వారోత్సవాలు ఈ నెల 16 నుంచి 23 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యతో పాటు ఉచిత సౌకర్యాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్, భవిత సెంటర్లు, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి పలు కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి శుభం నొఖ్వాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేద్కర్, జిల్లా విద్యా శాఖ అధికారులు రామకృష్ణ, వై.మల్లేశ్వరరావు, మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


