breaking news
World Telugu Kavitvotsavam
-
రికార్డ్ నెలకొల్పిన ‘ప్రపంచ మహిళా తెలుగు కవితా మహోత్సవం’
హైదరాబాద్: "డాక్టర్ సి.నారాయణరెడ్డి వంశీ విజ్ఞాన పీఠం" "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్, "సాహితీ కిరణం" మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా మూడు రోజుల పాటు, అంతర్జాల వేదిక పై 17 దేశాల నుండి పాల్గొన్న 250మంది కవయిత్రులతో అద్వితీయంగా నిర్వహించబడిన "ప్రపంచ మహిళ తెలుగు కవితా మహోత్సవం" ప్రపంచ స్థాయిలో రికార్డ్ నెలకొల్పింది. కార్యక్రమం ముఖ్య నిర్వాహకులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. "అంతర్జాలం ద్వారా ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నా కూడా, కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమం నిర్వహించాలనే ఉద్దేశంతో మహిళా కవయిత్రులకు ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, అనూహ్యమైన స్పందన వచ్చి 17 దేశాలనుండి 250 మంది కవయిత్రులు కేవలం వారం రోజుల్లో ముందుకొచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారని, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తమ ప్రయత్నానికి ప్రత్యేక అభినందనలు తెలిపారని, తమ ప్రయత్నానికి మరింత తృప్తిని ఇస్తూ ఈ కార్యక్రమం "తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్" వారిచే రికార్డు చేయబడిందని" తెలియజేస్తూ తన ఆనందాన్ని, కృతజ్ఞత వ్యక్తం చేశారు. 23, 24, 25 తేదీలలో జరిగిన ఈ అంతర్జాల కార్యక్రమంలో మొదటిరోజు భువనచంద్ర, డాక్టర్ నందివాడ అనంతలక్ష్మి; రెండవ రోజు డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి; మూడవరోజు డాక్టర్ సుద్దాల అశోక్ తేజ, మామిడి హరికృష్ణ, 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, 'సాహితీ కిరణం' మాసపత్రిక సంపాదకులు శ్రీ పొత్తూరి సుబ్బారావు, వివిధ దేశాలలోని తెలుగు సంస్థల అధ్యక్షులు పలు ప్రముఖ రచయిత్రులు పాల్గొన్నారు. రాధికా మంగిపూడి (సింగపూర్), జుర్రు చెన్నయ్య (హైదరాబాద్), జయ పీసపాటి (హాంకాంగ్), రాధిక నోరి (అమెరికా), కార్యక్రమ వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ఆసక్తికరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. భారత్, అమెరికా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూ కె, ఖతార్ మొదలైన 17 దేశాల నుండి ఆయా ప్రాంతాలలో పేరుపొందిన 250 మంది రచయిత్రులు వారి దేశ కాలమానాలకు అనుగుణమైన సమయాలలో విచ్చేసి తమ కవితలను ఈ వేదికపై పంచుకున్నారు. ఉగాది కవితలు, ఛందోబద్ధ రచనలు, సామాజిక స్పృహ ఉండే అంశాలు మొదలైన వివిధ కోణాల నుండి వైవిధ్యభరితమైన అంశాలను ఎన్నుకొని అందంగా మలచిన కవితలతో కవయిత్రులందరూ రాణించడం విశేషంగా ఆకర్షించింది. చదవండి: ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి -
'సాంస్కృతిక దాడి మరీ ప్రమాదకరం'
మలికిపురం (తూర్పుగోదావరి) : భౌతిక దాడుల కంటే సాంస్కృతిక దాడులు అత్యంత ప్రమాదకరమైనవని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. రికార్డు సృష్టించే లక్ష్యంతో 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో శనివారం నాటికి 1620 మంది కవులు పేర్లు నమోదు చేయించుకున్నారు. కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సాంస్కృతిక దాడులు ఎక్కువయ్యాయని తెలిపారు. శత్రువు ఎక్కడో లేడని.. టీవీలు, సెల్ ఫోన్ల రూపంలో మనింట్లోనే ఉన్నాడని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు ఒకే చోట కూర్చొని మాట్లాడుకునే పూర్వ సంప్రదాయం ఇప్పుడు కనుమరుగైందని, విడాకుల సంస్కృతి పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కవులు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మాటలు చలి వల్ల చావలేవని, ధైర్యం లేకనే చనిపోతాయని ఒక హిందీ రచయిత చెప్పిన మాటలు కవులు గుర్తుంచుకోవాలన్నారు. రచయితలకు హద్దులు ఉండకూడదని, రాసేవారు కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచి రచనలు వస్తాయన్నారు. కొత్త తరాలను రచనా రంగంలోనికి ఆహ్వానించకుంటే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రచయిత కత్తిమండ ప్రతాప్, కలిదిండి వర్మ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల 30 సెకన్ల వరకూ జరుగుతుంది.