breaking news
Womens rights activist
-
అమ్మా అంటారు.. రాత్రైతే రూమ్‌కి రమ్మంటారు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతోన్న లైంగిక వేధింపుల పర్వాలకు చరమగీతం పాడుతామని మహిళాలోకం గర్జించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంతమయ్యేదాకా పోరాటాన్ని ఆపబోమని ప్రతిజ్ఞచేశారు. వర్కింగ్ విమెన్‌కు ఉన్నట్లే పని ప్రదేశంలో తమకూ హక్కులు కల్పించాలని వర్ధమాన నటీమణులు డిమాండ్ చేశారు. ‘‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’’ పేరుతో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. మహిళా సంఘాల జేఏసీ, పలు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హక్కుల కార్యకర్తలు సంధ్య, దేవి, విమల ఇతర ప్రముఖలు, శ్రీరెడ్డి సహా కొందరు వర్ధమాన నటీమణులు, పెద్ద సంఖ్యలో జూనియర్ ఆర్టిస్టులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటీమణులు తమ గోడు వెళ్లబోసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. హక్కులను సాధించుకునే క్రమంలో అందరం కలిసికట్టుగా పోరాడాలని తీర్మానించారు. చర్చలో వ్యక్తమైన బాధలు, అభిప్రాయాలివి.. ►‘‘ఇండస్ట్రీలో కేవలం యువతులపైనే కాదు 80 ఏళ్ల మహిళలపైనా లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయి. సీనియర్ ఆర్టిస్టులను ఉదయం అమ్మా అని సంబోదిస్తూనే రాత్రైతే రూమ్‌కి రమ్మని పిలుస్తారు. కమిట్మెంట్ ఇస్తేనే సినిమాలో క్యారెక్టర్ ఇస్తామంటారు. జుగుప్సాకరమైన ఈ విధానం అంతం కావాలి. అప్పటిదాకా మేం పోరాడుతూనే ఉంటాం’ ►‘‘మాకంటూ ఏ ఉద్యోగాలు లేకే సినిమాల్లో నటిస్తున్నాం. మాకు సమస్యలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రముఖ హీరో స్పందించరు. వేధింపులు భరించలేని పరిస్థితుల్లోనే మేం బయటికొచ్చాం. మహిళా సంఘాలే మాకు దారి చూపించాలి’’ ►‘‘వేధింపులకు పాల్పడిన అబ్బాయిలను కర్రతో తరిమానని ఓ ప్రముఖ హీరో చెప్పాడు. అయ్యా.. నువ్వు తరిమిన కుర్రాళ్ల సంగతేంటోగానీ ముందు ఇండస్ట్రీలో జరుగుతున్న రేప్‌లను ఆపే ప్రయత్నం చెయ్యి. సినిమాల్లో పనిచేసేవాళ్లు మహిళలుగా నీకు కనిపించరా’’ ►‘‘చిన్నాచితకా క్యారెక్టర్లు చేసి కష్టపడి సంపాదిస్తాం. గుర్తింపు కార్డు కోసం లక్షలు ధారపోయాలి. ఐడీకార్డు లేకుంటే దోపిడీ తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే మా రక్తాన్ని దోచుకుంటున్నారు. న్యాయం జరగడంలేదన్న నిస్పృహలో చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది’’ ►‘‘అమ్మాయిలనే కాదు మేడం.. ట్రాన్స్‌జెండర్లపైనా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కమిట్మెంట్ లేనిదే ఆఫర్లు ఇవ్వరు. చాటింగ్‌ల పేరుతో నిత్యం వేధింపులే’’ ►‘‘మనల్ని ఒక్క మాట అంటేనే ఉడుక్కుంటాం. అలాంటిది సినీ పరిశ్రమలో అమ్మాయిలు ఇంత భయంకరంగా బతుకుతుండటం బాధాకరం. సమస్యలపై తుదిదాకా పోరాటం చేస్తాం. ఇవి ఒక్కరోజులో అంతమైపోయే సమస్యలు కావు. న్యాయపరంగానూ పోరాడాలి. సంఘటిత రంగాల్లో మహిళల మాదిరిగా సినిమాల్లో పనిచేస్తోన్న మహిళలకు కూడా పని ప్రదేశంలో హక్కులు కల్పించాలి. ఆ హక్కుల పరిరక్షణ నిత్యం జరగాలి’’ ►‘‘అవకాశాల కోసం ఫోన్లు చేస్తే బూతులు తిడతారు. న్యూడ్ ఫొటోలు అడుగుతారు. శారీరకంగా వాడుకుని, చాన్సులు లేవుపొమ్మంటారు. ఆఫర్ల ఆశ చూపి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. సాక్ష్యం కావాలంటే ఎలాంటి మెడికల్ టెస్టులైనా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తెరవెనుక సాగుతోన్న వ్యవహారాలకు చెక్ పెట్టాల్సిందే. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. మాకు ఏవైనా ఉపాధి అవకాశాలు చూపించాలి’’ ►‘‘టాలీవుడ్లో జరుగుతోన్న లైంగిక వేధింపులపై కేసులు పెడితే పోలీస్ స్టేషన్లు చాలవు. కేసీఆర్, కేటీఆర్, కవితలు మా బాధలు వినాలి. ఎవరో ఒకరు రియల్ హీరోలా మమ్మల్ని ఆదుకోవాలి’’ -
ఎలుగెత్తిన బాధితులు... గొంతు కలిపిన ఏంజెలినా
చైతన్యం ప్రపంచంలో ఎప్పుడు, ఎక్కడ యుద్ధం జరిగినా మహిళలు, చిన్నారులే బాధితులవుతున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అరణ్యకాండ ఇది. మరి దీనికి అంతం లేదా? అంటూ బాధితులు ఆవేదనతో ప్రశ్నించారు ఆ వేదిక మీద నుంచి. ఆఫ్రికాలో దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధాలు, దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాల్లో మహిళలు బాధితులు అవుతుండటం గురించి ఇటీవల లండన్‌లో ప్రత్యేక చర్చాకార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా హక్కుల ఉద్యమకారిణి నీమా నమడమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈమె కూడా కాంగో అంతర్యుద్ధంలో సామూహిక అత్యాచార బాధితురాలే. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అనేకమంది బాధిత మహిళలు యుద్ధోన్మాదంలో తాము బలైన విధానం గురించి, తమపై జరిగిన అకృత్యాల గురించి ఏకరువు పెట్టుకోగా జోలీ చలించిపోయింది. ఇలాంటి శరణార్థుల సమస్యల విషయంలో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా హోదాలో ఉన్న జోలీ వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకొని కన్నీటి పర్యంతం అయ్యింది. యుద్ధమేఘాలు ఆవరించిన దేశాల్లోని మహిళ స్థితిగతులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం ఎందుకు జరుగుతోందో కూడా తెలియని పిల్లలు బాధితులుగా మారుతుండటంపై జోలీ ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధవాతావరణంలో మహిళలపై లైంగికదాడులు చాలా సహజమైపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించింది. మహిళల ఆవేదనను వ్యక్తపరిచిన ఇదే వేదికపై వాళ్ల శక్తిసామర్థ్యాలకు నిదర్శనమైన ఆవిష్కరణలను కూడా ప్రదర్శించారు. శరణార్థ శిబిరాల్లో ఉన్న మహిళలు రూపొందించిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. వాటిని చూసి ఆశ్చర్యపోతూ ఆ మహిళలను అభినందించింది జోలీ.