breaking news
wife strikes
-
భర్త ఇంటి ముందు వధువు ఆందోళన
అనంతపురం సెంట్రల్ : ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. మంచి సంబంధం అనుకొని వివాహంతో ఒక్కటయ్యారు. పెళ్లై పట్టుమని ఐదు నెలలు కూడా గడవలేదు. అప్పుడే మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధిపులు తట్టుకోలేని వధువు భర్త ఇంటి ముందు బుధవారం ఆందోళన దిగింది. న్యాయం కోసం గంటల కొద్దీ బైఠాయించి నిరసన చేస్తున్నా పోలీసు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. ఈ ఘటన అనంతపురం విద్యుత్‌నగర్ సర్కిల్ సమీపంలోని కృపానందనగర్‌లో బుదవారం జరిగింది. పోలీసు శాఖలో ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వీరన్న కుమారుడు నాగరాజు వివాహం నార్పల మండలానికి చెందిన రంగప్ప కుమార్తె ఉషారాణితో గత ఏడాది డిసెంబర్ 11న అయింది. నాగరాజు మడకశిరలో బీఎస్ఎన్ఎల్ శాఖలో జేఈగా పని చేస్తున్నారు. ఉషారాణి ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ జంట వైవాహిక జీవితం తొలినాళ్లలో ఎంతో అన్యోన్యంగా సాగింది. అయితే నాగరాజు మడకశిరలోనే ఉంటూ వారానికోసారి ఇంటికొచ్చి వెళ్లేవాడు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. అత్త, మామతో పాటు ఆడపడుచులు కూడా ఇంట్లోనే ఉంటుండడంతో ఉషారాణిని సూటిపోటి మాటలతో వేధించేవారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలు పంచాయితీలు కూడా చేశారు. భర్తకు చెప్పినా కుటుంబ సభ్యులకే మద్దతు పలుకుతుండడంతో వేధింపులు తాళలేని బాధితురాలు పుట్టింటివారితో కలసి భర్త ఇంటి ముందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆమెకు మహిళా సంఘాలు మద్దతుగా నిలిచాయి. అయితే పోలీసులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ కుమారుడు కావడంతోనే పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని బా«ధితురాలు ఉషారాణి, ఆమె తండ్రి రంగప్ప అన్నారు. అనంతరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ యల్లమరాజును కలసి జరిగిన అన్యాయాన్ని వివరించారు. -
భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా
కొత్తచెరువు(పుట్టపర్తి) : పెళ్లి చేసుకుని ఆ తరువాత ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్న భర్త, అత్తమామాల నుంచి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ అభాగ్యురాలు ఆందోళనకు దిగింది. ఏకంగా అత్తారింటి ఎదుటే ఆమె ధర్నాకు కూర్చుంది. ముదిగుబ్బ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన స్రవంతి వివాహం కొత్తచెరువుకు చెందిన శివారెడ్డి కుమారుడు ఓం ప్రకాష్‌రెడ్డికి 2015లో అయింది. పెళ్లైన కొద్ది రోజులకే స్రవంతిని పుట్టింటికి తరిమేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెను భర్త కాపురానికి పిల్చుకోలేదు. గతంలోనే ఓం ప్రకాష్‌కు పెళ్లి జరిగిందని, అయితే అ విషయం దాచిపెట్టి మోసం చేశాడని బాధితురాలు ఆరోపించారు. స్రవంతి ఆందోళనకు ఆమె కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె భీష్మించారు. కాగా భర్త ఓంప్రకాష్, ఆయన తల్లిదండ్రులు పరారయ్యారు.