breaking news
Warangal Zoo
-
స్రవంతి ఇక లేదు..
సాక్షి, న్యూశాయంపేట: వరంగల్ హంటర్‌రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్‌లో తన గాండ్రింపులతో సందర్శకులను ఆకట్టుకున్న ఆడచిరుత స్రవంతి(17 సంవత్సరాల 11నెలలు) శనివారం మృతి చెందింది. కొన్ని రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న చిరుతకు వైద్యులు చికిత్స చేసినా ఫలితం కానరాక కన్నుమూసింది. వయస్సు పైబడడానికి తోడు అవయవాల పనితీరు మందగించడంతో చికిత్స అందించినా కోలుకోలేదని అధికారులు ప్రకటించారు. చదవండి: (కోడిపిల్లలు ఫ్రీ.. పరుగులు తీసిన జనం) 2003లో జననం.. 2003 ఫిబ్రవరి 2న జన్మించిన ఆడ చిరుతను హైదరాబాద్ అత్తాపూర్‌లోని లాబోరేటరీ కన్జర్వేషన్ ఆఫ్ ఎన్డెసార్డ్ ఆఫ్ థీసిస్‌లో పెంపకానికి ఉంచారు. ఆ తర్వాత 2017 జనవరి నెలలో వరంగల్ కాకతీయ జూలాజికల్ పార్క్‌లో సందర్శకులకు కనువిందు చేయడానికి తీసుకొచ్చారు. దీనికి తోడుగా ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో దేవా పేరుతో ఉన్న మగ చిరుతను ఉంచారు. అయితే, సాధారణంగా 12 నుంచి 17 ఏళ్ల వరకే చిరుతలు జీవించనుండగా, స్రవంతికి ఇప్పటికే 17 ఏళ్ల 11 నెలల వయస్సు వచ్చింది. చిరుత కళేబరం దీంతో జీవిత చరమాంకానికి చేరుకున్న చిరుత అవయవాల పనితీరు మందగించింది. ఈ మేరకు గత సంవత్సరం జూన్‌లోనే వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు లాబోరేటరీకీ పంపించినట్లు తెలిపారు. చిరుతకు కాలేయ సంబంధిత వ్యాధి, కిడ్నీలో లోపాలే కాకుండా హృదయ సంబంధిత ఇబ్బందులు ఉన్నాయని గుర్తించారు. అప్పటినుంచి చికిత్స అందిస్తుండగా, గత పదిహేను రోజులుగా ఆహారం తక్కువగా తీసుకుంటున్న స్రవంతి చివరికి ఆహారం తీసుకోలేని కారణంగా శనివారం మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. జీవిత చరమాంకంలో ఉంది.. మనుషుల్లో మాదిరి జంతువులకు కూడా జీవిత చరమాంకంలో ఉన్నపుడు కొన్ని అవయవాలు పనిచేయవని జూపార్క్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వంశీ తెలిపారు. అదే మాదిరి చిరుత స్రవంతికి కూడా 18 ఏళ్ల వయస్సు వస్తుండడంతో కిడ్నీ, కాలేయం, హృద్రోగ సంబంధిత వ్యాధుల బారిన పడిందని చెప్పారు. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి డిప్యూడీ డైరెక్టర్ డాక్టర్ అహ్మద్ హకీం నేతృత్వంలో ప్రత్యేక బృందం వచ్చి వైద్యం చేసినా ఫలితం లేకపోయిందని తెలిపారు. చిరుత కళేబరానికి జిల్లా అటవీశాఖాధికారి డాక్టర్ రామలింగం పర్యవేక్షణలో శవపరీక్ష నిర్వహించి దహనం చేసినట్లు వారు వెల్లడించారు. -
త్వరలో ఓరుగల్లు ‘జూ’కు చిరుత
సిద్ధమవుతున్న చిరుత ఎన్‌క్లోజర్ వీటితోపాటే జంగిల్ క్యాట్, కసోరియా దసరా నాటికి ప్రారంభమయ్యే అవకాశం వరంగల్ మినీ జూకు కొత్త అందాలు హన్మకొండ : పక్షుల కిలకిలలు, జింక పిల్లల గెంతులకే పరిమితమైన వరంగల్ జూలో ఇకపై పులి గాండ్రింపులు వినపించనున్నాయి. వరంగల్ జూ పార్కుకు వచ్చే సందర్శకులు మరికొద్ది రోజుల్లో చిరుత పులిని ప్రత్యక్షంగా చూడొచ్చు. వివిధ రకాల పక్షుల, జింకలతో మొదలైన వరంగల్ వన విజ్ఞాన కేంద్రం ప్రస్థానం చిరుతపులి రాకతో జూ పార్కు స్థాయి సైతం పెరగనుంది. దసరా నాటికి సిద్ధం రానున్న కొద్ది రోజుల్లో మన జూ పార్కు సరికొత్త అటవీ అందాలు సంతరించుకోనుంది. దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, మొసళ్లు, హంసల వంటి జంతుజాలం సరసన ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తే చిరుతపులి జూ పార్కులో సందడి చేయనుంది. ఈ మేరకు జూ పార్కులో ఎన్‌క్లోజర్ సైతం సిద్ధం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర జూ అథారిటీలు ఎన్క్లోజర్ను పరిశీలించాక దసరా పండుగనాటికి చిరుతపులి గర్జనలు జూ పార్కులో వినిపిస్తాయి. చిరుతపులితో పాటు జంగిల్క్యాట్(అడవి పిల్లి), కోసోవరిలేదా రియో పక్షల(నిప్పుకోడిని పోలి ఉండే ఆఫ్రికా పక్షులు) కోసం జూ పార్కులో ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. విస్తరించనున్న జూ పార్కు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే వరంగల్ మినీ జూ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో జూపార్క్‌గా అప్‌గ్రేడ్ చేయాలంటూ రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ స్మాల్ జూ పార్కు ప్రస్తుతం 48 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతమిక్కడ దుప్పులు, సాంబర్ జింకలకు ప్రత్యేకంగా పార్కులు ఉండగా కొండ గొర్రెలు, ఎలుగుబంటి, నెమళ్లు, రామచిలకలు, పావురాలు, నిప్పుకోళ్లకు ఎన్క్లోజర్లు ఉన్నాయి. త్వరలో చిరుతపులితో పాటు జంగిల్క్యాట్, కచావర్ రానున్నాయి. పెద్దపులి, తెల్లపులి, తోడేలు, ఏనుగు, పగ్డీర్, బార్కింగ్ డీర్, హైనా, అడవిపంది తదితర జంతువులకు సంబంధించిన ఎన్క్లోజర్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అవసరమైతే ప్రస్తుతం జూ పార్కుకు అనుకుని చుట్టు పక్కల అందుబాటులో ఉండే స్థలాన్ని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. దసరా నాటికి సిద్ధం -గంగారెడ్డి(డీఎఫ్ఓ, వైల్డ్‌లైఫ్ వరంగల్) చిరుతపులి, కోసవరి, జంగిల్క్యాట్ల కోసం కొత్తగా ఎన్క్లోజర్ల నిర్మాణం పూర్తి కావొస్తుంది. వీటి నిర్మాణం పూర్తయిన తర్వాత జూ అథారిటీ అధికారులు ఎన్క్లోజర్లను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల నుంచి ఈ మూడు జంతువులను ఒక్కో జత వంతున వరంగల్ జూకు తీసుకొస్తాం.