breaking news
VVPAT technology
-
ఈవీఎంలపై విస్తృత అవగాహన
ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృతఅవగాహన కల్పించేందుకు చైతన్యబృందాలతో ప్రచారం నిర్వహించనున్నారు. ఈమేరకు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాట్లు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు చైతన్య బృందాలతో ప్రచారం నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 92 చైతన్య బృందాలతో ఈవీఎంలపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాజకీయ పార్టీల నుంచి వచ్చిన సూచనల కనుగుణంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు పోలింగ్‌కు హాజరయ్యేందుకు తగిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న 41,62,215 మంది ఓటర్లతోపాటు ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకునే వారికి పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి ఓటు వేసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన మార్చి 25వ తేదీకి 10 రోజుల ముందుగా అంటే మార్చి 15 వరకు స్వీకరించిన క్లెయిమ్స్, అభ్యంతరాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో పేరున్నదీ? లేనిదీ? సరిచూసుకోవాల్సిందిగా ఆస్తిపన్ను చెల్లింపుదారుల మొబైల్ నంబర్లకు ఇప్పటికే ఎస్ఎంఎస్లు పంపించామన్నారు. ఎన్‌వీఎస్‌వీ పోర్టల్, సీఈఓ వెబ్సైట్లలో తమ పేర్లను చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 3,976 పోలింగ్ కేంద్రాలుంటాయన్నారు. ప్రచారానికి సంబంధించి ఎకోఫ్రెండ్లి సామగ్రినే వా డాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలు చేయడానికి హైదరాబాద్ జిల్లాలో 374 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 42 స్టాటిక్ çసర్వైలెన్స్ టీమ్స్, 42 వీడియో సర్వైలెన్స్ టీమ్స్, 14 వీడియో వ్యూయింగ్ టీమ్స్, 14 అకౌంటింగ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. 10 వాహనాలకే అనుమతి... నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ... మంగళవారం రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నగరంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏవిధమైన అనుమతులు కావాలన్నా ఈ–సువిధ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 7వేల మంది పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చామన్నారు. రోడ్ షోలకు 10వాహనాలకు మించి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మాణిక్‌రాజ్ కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్, సికింద్రాబాద్ లోక్‌సభ రిటర్నింగ్ ఆఫీసర్ రవి, అడిషనల్ పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, ఆయా పార్టీల నాయకులు ఎంఎస్ ప్రభాకర్, జాఫ్రీ, మర్రి శశిధర్‌రెడ్డి, వనం రమేశ్, పి.వెంకటరమణ పాల్గొన్నారు. సిబ్బందికీ అవగాహన అవసరం... ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఎన్నికల సిబ్బందికి కూడా తగిన అవగాహన లేదని.. వారికీ తగిన శిక్షణ అవసరమని రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. పోలైన ఓట్లకు సంబంధించి ఈవీఎంల లెక్కకు, ఏజెంట్ల లెక్కకు, వీవీప్యాట్లలో లెక్కకు తేడా ఎందుకు ఉంటోందని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు అవగాహనలేమితో వీవీప్యాట్లలోని స్లిప్‌లను తొలగించారని గుర్తుచేశారు. పోలింగ్ ముగిశాక గంటలు గడిస్తే గానీ శాతం ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఆయా అంశాలకు సంబంధించిన ధరల పట్టిక వాస్తవంగా లేదని, సవరించాలని కోరారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ సక్రమంగా జరపాలన్నారు. సున్నిత ప్రాంతాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లోని వారికి నాణ్యమైన ఆహారాన్ని సరిపడా అందించాలని సూచించారు. -
మన అభ్యర్థి గుర్తుకు ఓటు పడిందా? లేదా?
సాక్షి,కల్వకుర్తి: పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిబంధనలు అమలు చేయడంలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు) కీలకపాత్ర వహించాలని ఎన్నికల రిట ర్నింగ్ అధికారి, ఆర్డీఓ రాజేశ్‌కుమార్ సూచిం చారు. గురువారం పట్టణంలోని భ్రమరాంబిక బీఈడీ కళాశాలలో పీఓలకు, ఏపీఓలకు రెండు విడతలుగా శిక్షణ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం ఇచ్చిన శిక్షణలో ఎన్నికల నియమావళి, ఈవీ ఎంల వినియోగం, వీవీ ప్యాట్లపై శిక్షణ ఇచ్చా రు. ఆర్డీఓ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఎన్నికలు కీలకమని, అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఓటు హక్కు వజ్రాయుధంగా మారుతుందన్నారు. గతంలో ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతి కొనసాగేదని, ఈ ఎన్నికల్లో నూతనంగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నామన్నారు. అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఎన్నికల సంఘం మరో అడుగు ముందుకేసిందన్నారు. వేసిన ఓటు అనుకున్న అభ్యర్థి గుర్తుకు పడిందా? లేదా? అని వెంటనే చూసుకునేందుకు వీలుగా వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైడ్ పేపర్ అడిట్ ట్రయల్) యంత్రాలను పరిచయం చేస్తున్నామన్నారు. వీటి వినియోగంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించామన్నారు. పోలింగ్ బూత్‌కు హాజరయ్యే ఓటర్లకు ఈవీఎంపై ఎలాంటి ఇబ్బందులు ఉండరాదని సూచించారు. ఏమైనా సమస్య తలెత్తితే పోలింగ్ అధికారి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. ఓటు వేసే విధానంపై.. ఓటరు పోలింగ్ కంపార్టుమెంట్లోకి వెళ్లగానే ప్రిసైడింగ్ అధికారి పక్కన ఉన్న చిత్రంలో చూపిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో బ్యాలెట్‌ను సిద్ధంగా ఉంచుతామని ఆర్డీఓ పేర్కొన్నారు. బ్యాలెట్ యూనిట్‌పైన క్రమసంఖ్య అభ్యర్థి పేరు పక్కన గుర్తులు ఉంటాయన్నారు. వీటిలో నచ్చిన అభ్యర్థి గుర్తుపై ఓటు వేయడానికి పక్కనే నీలిరంగు బటన్ ఉంటుందని, బటన్ నొక్కగానే ఎర్రలైట్ వెలుగుతుందని, ఎంచుకున్న అభ్యర్థికి ఓటు పడుతుందన్నారు. అలాగే కంట్రోల్ యూని ట్ యంత్రం ఈవీఎంలకు అనుసంధానం చేసి ఉంటుందని ఈ యంత్రాన్ని పోలింగ్ అధికారులు మాత్రమే ఉపయోగించేందుకు వీలు ఉంటుందన్నారు. యంత్రాలపై స్క్రీన్ ఏర్పాటు చేసి ఉంటుందని, ఓటింగ్ సంబంధించిన వివరాలు ఈ యంత్రంలో నమోదు అవుతాయన్నారు. వీవీ ప్యాట్‌పై.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈవీఎంల పని తీరుపై సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని ఆర్డీఓ తెలిపా రు. ఓటర్లు ఎవరికి ఓటు వేశారనే విషయాన్ని చూసుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం వీవీ ప్యాట్లను ఏర్పాటు చేసిందన్నారు. ఈవీఎంలో ఓటరు ఓటు వేయగానే అభ్యర్థికి పడిందా.. లేదా అనే విషయం వీవీప్యాట్‌లో కనిపిస్తుందని తెలిపారు. వీవీప్యాట్ యంత్రంలో ఓటరు ఎంచుకున్న అభ్యర్థి సీరియల్ నంబర్, గుర్తు, పేరు ఒక బ్యాలెట్ స్లిప్ మీద కనిపిస్తుందని తెలిపారు. ఈ బ్యాలెట్ స్లిప్ ఏడు సెకండ్ల పాటు కనిపించి ఆ తర్వాత కట్ అయ్యి ప్రింటర్ డ్రాప్ బాక్స్‌లో పడుతుందన్నారు. మొత్తం 700మందికి పైగా వీవీ ప్యాట్ల శిక్షణకు హాజరయ్యారు. దాదాపు 30మంది శిక్షణకు గైర్హాజరయ్యారు. గతంలో శిక్షణ తీసుకున్న అధికారులే పీఓలకు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో కల్వకుర్తి తహసీల్దార్ గోపాల్‌తో పాటు నియోజకవర్గంలోని వెల్దండ, ఆమన్‌గల్, తలకొండపల్లి, మాడ్గుల తహసీల్దార్లు హాజరయ్యారు. -
బ్యాలెట్ టు వీవీ ప్యాట్లు..
మారుతున్న కాలానుగుణంగా ఎన్నికల నిర్వహణలోనూ అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నాడు బ్యాలెట్ విధానం ఉండగా ప్రస్తుతం ఆ స్థానంలో ఈవీఎంలు వచ్చాయి. అంతేకాకుండా వేసిన ఓటు సరి చూసుకోవడానికి ఈ ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్లు అందుబాటులోకి రానున్నాయి. మిర్యాలగూడ రూరల్ : చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధానంలో ఓటింగ్ ప్రధానమైంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానంలోనూ మార్పు సంతరించుకుంటోంది. ఎన్నిక సంఘం సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఒకప్పుడు ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు ఉపయోగించగా.. ఇటీవలి కాలంలో ఈవీఎంల వినియోగం పెంచింది. ఈ ఎన్నికల్లో ఓటు కచ్చితత్వాన్ని ఓటరు తెలుసుకునేలా వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫై యేబుల్ పేపర్ ఆడిట్ ట్రాయల్ ) యంత్రాన్ని ఎన్నికల సంఘం వినియోగించనుంది. దేశంలో ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు స్వతంత్ర ప్రతి పత్తిగల రాజ్యంగబద్ధ సంస్థ భారత ఎన్నిక సంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. 1950 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్ ఏర్పాటైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జాతీయ ఎన్నికల కమిషన్‌లో భాగమే. రాజకీయ పార్టీ గుర్తింపు, రద్దు, ఎన్నికల ప్రణాళిక, ప్రవర్తనా నియమావళి రూపకల్పన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ ఎన్నికల సంఘం విధుల్లో భాగం. భారత దేశంలో మొదటి సారిగా ఎన్నికలు 1951లో జరగగా , ప్రజలు ఓటు వేసేందుకు బ్యాలెట్ విధానం అమలులో ఉండేది. ముద్రించిన బ్యాలెట్ పేపరుపై ఏ అభ్యర్థిని ఎన్నుకుంటున్నామో దానిపై ముద్రవేసి బ్యాలెట్ బాక్స్‌లో వేసేవారు. ఆ తర్వాత నూతన టెక్నాలజీలో భాగంగా 2004 నుంచి ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. వీటి వినియోగంపై ఆరోపణలు రావడంతో ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లను వినియోగించనున్నారు. రిగ్గింగ్‌కు కాలం చెల్లు భారత దేశంలో మొట్టమొదటి సారి నిర్వహించిన సాధారణ ఎన్నిల్లో బ్యాలెట్ బ్యాక్స్‌లను వినియోగించారు. ఈ విధానంలో అభ్యర్థుల పేర్లు, పార్టీ గుర్తింపుతో ముద్రించిన పేర్లు వాడేవారు. వాటిపై ఓటరుకు వచ్చిన అభ్యర్థి వద్ద స్టాంప్ వేసి ఆ బ్యాలెట్ పేపర్‌ను బ్యాలెట్ బ్యాక్స్‌లో వేసేవారు. ఓటింగ్ పక్రియ పూర్తయిన అనంతరం పేపర్ల (ఓట్ల ) లెక్కింపు ఉండేది. ఈ విధానంలో రిగ్గింగ్‌కు ఎక్కువ అవకాశం ఉండేది. దొంగ ఓట్లు ఎక్కువగ పోలయ్యేవి. 1999 ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాల ముద్రణకు 7,700 టన్నుల కాగితం వాడారు. వీవీఎం ప్యాట్లు.... ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్రంలో డిసెంబర్ 7న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఈవీఎం, వీవీప్యాట్లను ఉపయోగించనుంది. ఈవీఎం ఓటు విధానం ద్వారా ఓటు ట్యాంపరింగ్ జరుగుతుందని, ఏ పార్టీ ఓటు వేసిన అధికార పార్టీకే ఓటు పడుతుందని కొన్ని రాజకీయ పార్టీలు ఈవీఎం ద్వారా ఓటింగ్‌ను వ్యతిరేకించాయి. దీంతో ప్రస్తుతం ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీ ప్యాట్లను వినియోగంలోకి తేనుంది. వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫై యేబుల్ పేపర్ ఆడిట్ ట్రాయల్ ). ఈ పద్ధతిలో ఏ అభ్యర్థికి ఓటు వేశామో వీవీ ప్యాట్ డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఈ కొత్త విధానంపై ఇప్పటికే ఎన్నికల అధికారులు నాయకులకు, ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ పద్ధతిలో ఏ పార్టీకి ఓటు వేస్తామో ఆ పార్టీ గుర్తు , అభ్యర్థి పేరు పేపర్‌పై ముద్రించి ఉంటుంది. ఈ పేపరు స్క్రీన్‌పై 7 సెకండ్ల కాలం కనిపిస్తుంది. అనంతరం ఆపేపరు మిషన్‌కు అమర్చిన బాక్స్‌లో పడి పోతుంది. దీనితో ఓటరుకు ఏ అభ్యర్థికి ఓటు వేసామో తెలుస్తుంది. మారుతున్న ప్రచార సరళి ఎన్నికల్లో ఆయా పార్టీల ఆభ్యర్థులు ఓట్లను ఆకర్శించేందుకు విపరీతంగా ప్రచారం నిర్వహిస్తుంటారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం, గోడలపై రాతలతో మొదలు పార్టీ కండువాలు, టోపీలు , జెండాలు, కర పత్రాలు, వాహనాలకు మైక్ సెట్లతో ప్రచారం నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో గోడలపై రాతలు ఎక్కువగా కనిపించేవి. దీంతో పెయింటింగ్ కళా కారులకు చేతినిండా పని ఉండేది. సత్తు రేకుపై అభ్యర్థి పేరు గుర్తుతో అచ్చువేయించే వారు. వాటిని గోడలపై అచ్చు వేయడం ద్వారా పెయింటింగ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పార్టీ కార్యాలయ భవనంపై తమ పార్టీ గుర్తులను ఏర్పాటు చేసి దీనికి లైటింగ్ ఏర్పాటు చేసే వారు. పార్టీ జెండాలతో కార్యకర్తలు తన అభిమాన నాయకుడి వెంట ర్యాలీగా వెళ్లే వారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరగడంతో అభ్యర్థుల ప్రచార సరళిలో మార్పొచ్చింది. డిజిటల్ ప్రచారం ఇప్పుడంతా డిజిటల్ హవా నడుస్తోంది. రాజకీయ నాయకులు సహితం టెక్నాలజీని ప్రచారానికి అనుగుణంగా మార్చుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సప్, ట్విటర్లను వేదికగా చేసుకొని ఓటర్లను ఆకర్శించే పనిలో పడ్డారు. మెసేజీలు, వాట్సప్ కాల్స్ ద్వారా ఓటర్లకు ఫోన్ చేçస్తున్నారు. వాల్ పెయింటింగ్‌ల స్థానంలో ఫ్లెక్సీలు వచ్చాయి. గతంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసేందుకు ప్లైవుడ్‌ను వా డే వారు. దానిపై అభ్యర్థుల, నాయకుల బొమ్మలు వేసే వారు. ఇందుకు కొన్ని రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం ఫ్లెక్సీలు అందుబాటులోకి రావడంతో ఎంత పెద్ద కటౌట్ అయినా క్షణాల్లో రెడీ అవుతోంది. ఈవీఎంలు..... 2004 నుంచి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని చోట్ల ఓటింగ్ కోసం బ్యాలెట్ బాక్స్‌ల స్థానంలో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)వాడకం అమల్లోకి వచ్చింది. అంతకుముందు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదే«శ్ రాష్ట్రాల్లో ఈవీఎంలను ప్రయోగాత్మకంగా వినియోగించారు. ఇక్కడ ఈ విధానం సఫలం కావడంతో 2004 నుంచి అన్నిచోట్ల ఈవీఎం ఓటింగ్ విధానం అమల్లోకి వచ్చింది. దీనివల్ల బ్యాలట్ పత్రాల ముద్రణ వల్ల జరిగే కాగితం వాడకాన్ని అరికట్టినట్లయింది. ఈ ఏవీఎంలను భారత్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వం సంస్థలు తయారు చే సాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థ లేని చోట్ల కూడా వినియోగించవచ్చు. బ్యాటరీ సహాయంతో పనిచేస్తాయి. ఒక్కోక్క ఈ ఈవీఎంలో 1400 లోపు మంది ఓట్లను ఓటింగ్‌కు అనుమతిస్తుంది. పోటీలో 64 మంది కంటే తక్కువగా ఉంటే ఈవీఎంలను వాడతారు. ఎక్కువగా ఉంటే బ్యాలెట్ విధానం వినియోగిస్తారు. యువగళం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారికే ఓటు వేస్తా .... హుజూర్నగర్ : ఈసారి ఎన్నికలలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వారికి ఓటు వేస్తాం. ప్రతి ఏడాది లక్షలాది మంది ఎంతో కష్టపడి ఉన్నత విద్యను పూర్తి చేస్తున్న ప్పటికీ ఉద్యోగ ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితి సహకరించనప్పటికీ అప్పులుచేసి మరీ విద్యను కొనసాగించి ఉద్యోగాల కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. మాటలతో కాలయాపన చేయకుండా మాట ఇచ్చి అమలు చేసే వారికి మాత్రమే ఓటు వేయాలని నిర్ణయించుకున్నా. మధిర దేదీప్య, హుజూర్నగర్ అండగా ఉండే వారికే ఓటు వేస్తా నకిరేకల్: ప్రజలు అందుబాటులో ఉండాలి. ఎలాంటి ఆపద, సమస్యలు వచ్చిన పరిష్కరించి అండగా ఉండే వారికి ఓటు వేయాలనుకుంటున్నా. ప్రస్తుతం ఎన్నికల తీరు చూస్తే అంత డబ్బుమయంగా మారింది. ప్రజలు కూడా డబ్బుకోసం ఆశపడి ఆమూల్యమైన ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు. ప్రజల మేలు కోరే అభ్యర్థులకు మాత్రమే తమ ఓటును వేయాలి. – గుల్లోజు సుదీర్, నకిరేకల్ నోటు కాదు ఓటు ముఖ్యం ఓటు ఎంతో విలువైనది. కానీ చాలా వరకు నోటు కోసం ఓటును అమ్ముకుంటున్నారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలు అడిగి సమస్యలను పరిష్కరించే వారికి మాత్రమే ఓటు వేస్తా. చాలా వరకు గెలిచిన తరువాత సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు. నోటు కోసం ఓటును తాకట్టు పెట్టితే ఐదేళ్ల పాటు తప్పు చేసిన వారమవుతాం. నీతి నిజాయితీతో పాటు అభివృద్ధి కోసం పాటు పడే వారికి మాత్రమే ఓటు వేస్తా. సమస్యలపై స్పందించాలి.. అలాంటి వారికి మాత్రమే తాను ఓటు వేస్తా. – రాజశేఖర్, మిర్యాలగూడ నిజాయితీగా పనిచేసే వారికి మాత్రమే ఓటు ప్రతి విషయంలో నితి నిజాయితీగా పనిచేసే అభ్యర్థికి మాత్రమే తన ఓటు వేస్తా. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రతి సమస్యపై స్పందించాలి. అదే విధంగా నిరుద్యోగ సమస్య మరింత పెరిగింది ఆ సమస్యపై స్పందించే అభ్యర్థికి ఓటు వేస్తా. చాలావరకు ఎన్నికల సమయంలోనే వచ్చే ఓటు అడుగుతున్నారు తప్ప సమస్యలపై స్పందించడం లేదు. అధికారంలోకి వచ్చి ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచనచేసే వారు కానీ సమస్యలపై స్పందించే వారు కరువయ్యారు. ఈసారి నేను ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకుంటా. – అనిపిరెడ్డి నవ్య, దామరచర్ల మంచి నాయకుడికి ఓటు వేస్తా భువనగిరి : నాకు ఓటు హక్కు రావడం సంతోషంగా ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నా. సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది బలమైన ఆయుదం. ఈసారి మంచి నాయకుడికి ఓటు వేస్తా . – రమ్య, భువనగిరి అందుబాటులో ఉండే వారికే ప్రజాప్రతినిధులుగా గెలిచే వ్యక్తులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి. ప్రజలను అందుబాటులో ఉండాలి. అభివృద్ధి చేసే మంచి నాయకుడిని ఎన్నుకుంటా. మహిళలకు సంక్షేమ పథకాలను అమలు చేసే మంచి నాయకుడికి ఈసారి ఓటు వేయాలని నిర్ణయించుకున్నా.– పర్వేజ్, వలిగొండ యువతతోనే సాధ్యం సమాజంలో మార్పు యువతతోనే సాధ్యం. యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు. యువత ఓట్లే కీలకం. పార్టీలు పోటీ చేసేందుకు యువకులకు అవకాశం కల్పించాలి. యువకుల అభిప్రాయాలను గౌరవించాలి. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను భర్తి చేయాలి. గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే యువత పాత్ర కీలకం. – రచ్చ కల్పన, ఆలేరు ఇచ్చిన హామీని అమలు చేసే వారికే ఓటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసే అభ్యర్థులకు మాత్రమే ఓటు వేస్తాను. ఓట్ల కోసం అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలను పట్టించుకోని వారికి మాత్రం ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా లేము. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వారికి మాత్రమే ఈ సారి ఎన్నికల్లో ఓటు వేస్తా. కె.సాయికుమార్, కీతవారిగూడెం మంచిచేసే వాళ్లకే ఓటు ఈ ఎన్నికల్లో గెలుపు స్వార్థం కోసం కాకుండా ప్రజలందరికీ మంచిచేసే అభ్యర్థికి ఓటు వేయాలనుకుంటున్నాను. చదువుకునే వారికి చేయూత ఇస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి. రైతులకు మంచి చేయాలి. ప్రస్తుతం ఎన్నికలు పోటీపోటీగా సాగుతున్నాయి. గెలుపు ఓటములు కూడా అంచనాలు వేయలేకపోతున్నాం. – కీసర మమతారెడ్డి, నకిరేకల్ ప్రజాసేవ చేసే వారినే ఎన్నుకోవాలి అర్వపల్లి : ఎన్నికల్లో ప్రజాసేవ చేసే వారినే ఎన్నుకోవాలి. ఎన్నికల్లో గెలవగానే ప్రజలకు అందుబాటులో ఉండకుండా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేసే వారికి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు వేయరాదు. డబ్బు, మద్యంనకు బానిసై మోసపోవద్దు. ఓటు వజ్రాయుధం లాంటింది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా 5ఏళ్లు అన్ని రకాలుగా సేవలందించే వారిని గెలిపించుకోవాలి. – కేసాని రాహుల్, బొల్లంపల్లి,అర్వపల్లి -
పాలేరు పోలింగ్‌లో వీవీ పీఏటీ టెక్నాలజీ
ఖమ్మం: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్‌లో ఎన్నికల అధికారులు వీవీ పీఏటీ సాంకేతికను వినియోగిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ సాంకేతిక పరిజ్ఞాన్ని వినియోగిస్తున్న దేశంలోనే తొలి నియోజకవర్గం పాలేరు అని జిల్లా కలెక్టర్ దానకిషోర్ శనివారం మీడియాకు తెలిపారు. 243 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ మెషిన్లకు వీవీ పీఏటీలను అమరుస్తున్నట్టు ఆయన చెప్పారు. దీని ద్వారా ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసిందీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఏవైనా ఆరోపణలు వచ్చినప్పుడు మూడో పక్షం తనిఖీ చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. మరో వైపు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి తరఫున ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, సంభాని చంద్రశేఖర్, ఆర్ దమోదర్‌రెడ్డి తదితరులు తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో ప్రచారం నిర్వహించారు.