గిర్నార్ సాఫ్ట్ చేతికి వొలొబ్ టెక్నాలజీస్
రెండేళ్లలో ఎనిమిది సంస్థలను కొన్న గిర్నార్ సాఫ్ట్
న్యూఢిల్లీ: వర్చువల్ రియాల్టీ స్టార్టప్ వొలోబ్ టెక్నాలజీస్‌ను గిర్నార్ సాఫ్ట్ కంపెనీ కొనుగోలు చేసింది. కార్‌దేఖోడాట్‌కామ్, గాడిడాట్కామ్, జిగ్వీల్స్డాట్కామ్ వంటి వాహన పోర్టళ్లను నిర్వహిస్తున్న గిర్నార్ సాఫ్ట్ కంపెనీ వొలోబ్ టెక్నాలజీస్ కొనుగోలు లావాదేవీని అంతా నగదు చెల్లించే పూర్తి చేసింది. అయితే లావాదేవీల వివరాలు వెల్లడి కాలేదు. కార్‌దేఖోడాట్‌కామ్ 3డీ విజువలైజేషన్ సామర్థ్యాలను వొలొబ్ టెక్నాలజీస్ మరింత పెంపొందిస్తుందని కార్‌దేఖోడాట్‌కామ్ సీఈఓ అమిత్ జైన్ చెప్పారు. 2010లో తరుణ్ కుమార్, శ్వేత జైన్లు వొలొబ్ టెక్నాలజీస్‌ను ప్రారంభించారు.
ఈ సంస్థ వివిధ పరిశ్రమలకు ముఖ్యంగా వాహన పరిశ్రమకు 3డీ విజువలైజేషన్ సొల్యూషన్లను అందిస్తోంది. మారుతీ సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా, గోద్రేజ్, గ్రీన్‌ప్లే, సొమాని సిరామిక్స్ తదితర సంస్థలకు తన సేవలందించింది. కాగా గిర్నార్ సాఫ్ట్వేర్ సంస్థ రెండేళ్లలో ఎనిమిది కంపెనీలను కొనుగోలు చేసింది. అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ ఇండియాలో వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టగా, కనెక్టో, హెల్ప్ఆన్ వీల్స్, జిగ్వీల్స్డాట్కామ్, గాడీడాట్కామ్, బయింగ్ఐక్యూ తదితర కంపెనీలను కొనుగోలు చేసింది. కాలేజ్దేఖోడాట్కామ్ను ఏర్పాటు చేసి దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేసింది.