breaking news
Visu
-
World Tourism Day: తిరుగు... తిను... ఉన్నది ఒకటే జిందగీ
కోయంబత్తూరులో కోడి పలావు, అమృత్‌సర్‌లో కుల్చా, లక్నోలో కబాబులు.. ఉడిపిలో ఇడ్లీ... కొత్త ప్రాంతాలు చూస్తూ అక్కడ దొరికే తిండిని రుచి చూస్తూ జీవితం గడిచిపోతుంటే ఎలా ఉంటుంది? సౌమ్య జీవితంలానే ఉంటుంది. ఐటిలో పని చేసే సౌమ్య ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫుల్‌టైమ్ ట్రావెల్ రైటర్ అయ్యింది. భర్త విషుతో కలిసి ‘రోడ్ టు టేస్ట్’ అనే వ్లోగ్‌ని నడుపుతుంది ఆమె. నెలలో ఒక్క కొత్త ప్రాంతాన్నైనా రోడ్డు మార్గంలో చూసి అక్కడి తిండి తినాలన్నది సౌమ్య లక్ష్యం. ఇవాళ ‘వరల్డ్ టూరిజం డే’. లోకం చాలా విశాలమైనది. రుచులు లెక్కలేనివి. తిరుగుతూ తినే అనుభూతి ఈ సెలవుల్లో ట్రై చేయండి. ఊరికే శాంపిల్‌కి సౌమ్య తన భర్త విషుతో వేసిన ఒక ట్రిప్‌ను తెలుసుకుందాం. దాని పేరు ‘దక్షిణ భారతదేశంలో మంచి బిర్యానీని కనుగొనుట’. అంతే. కారు వేసుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు. ముందు హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడి ‘షాబాద్’ లో బిర్యానీ టేస్ట్ చూశారు. ‘షా గౌస్’నూ వదల్లేదు. అక్కణ్ణుంచి బెంగళూరు బయలుదేరి వెళ్లారు. అక్కడి అలీబాబా కేఫ్‌లో ఫేమస్ ‘భత్కలీ బిర్యానీ’ తిన్నారు. ఆ తర్వాత అక్కడే ‘చిచాబాస్ తాజ్’ అనే రెస్టరెంట్లో దొరికే బిర్యానీ తిన్నారు. కీమా బిర్యానీ టేస్ట్ చూశారు. నాగార్జున రెస్టరెంట్లో దొరికే ‘తర్కారీ బిర్యానీ’ (వెజ్ బిర్యానీ) లాగించారు. అక్కడి నుంచి చెన్నై బయలుదేరి దారిలో ‘అంబూర్’లో ఆగి అంబూర్ బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత చెన్నైలో మెరినా బీచ్‌లో సేద తీరి చెన్నైలో దొరికే ‘షాదీ బిర్యానీ’ తిన్నారు. చెన్నైలోని ఫేమస్ ‘చార్మినార్ బిర్యానీ సెంటర్’ అనే చిన్న షాపులోని బిర్యానీ వంకాయ కూరతో తిన్నారు. కల్యాణ్ భవన్లో దొరికే బిర్యానీ వంతు తర్వాత. అక్కడి నుంచి కోయంబత్తూరు బయలుదేరి మధ్యలో మహాబలిపురంలో ఒక బిర్యానీ టేస్ట్ చూశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో దిండిగుల్ మటన్ బిర్యానీకి లొట్టలు వేశారు. చివరకు ఈ ప్రయాణం కేరళలోని కాలిట్లో దొరికే మలబార్ బిర్యానీతో ముగిసింది. ఇంట్లో నాలుగ్గోడల మధ్య కూచుని ఉంటే ఇన్ని ఊళ్ల మీదుగా ఇన్ని బిర్యానీలు తినే వీలు ఉండేదా? అసలు లోకం తెలిసేదా? ఇన్ని రుచులతో ఇన్ని స్థలాలు ఉన్నాయని ఇందరు మనుషులు వీటిని సిద్ధం చేస్తున్నారని ఎలా తెలియాలి? ప్రయాణాలు చేయాలి. సౌమ్య తన భర్త విషుతో కలిసి చేసే పని అదే. అందుకే ఆమె తన వ్లోగ్కు ‘రోడ్ టు టేస్ట్’ అని పెట్టింది. 2015లో పెళ్లి– ప్రయాణం సౌమ్య, విషులు తమ సొంత ఊళ్లు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ప్రపంచమే వారి ఊరు. మొత్తం మీద ఇద్దరూ టీనేజ్ వయసు నుంచి సోలో ట్రావెలర్లుగా ఉన్నారు. కాని విషు పని చేసే ఐ.టి కంపెనీలోనే సౌమ్య కూడా చేరడంతో కథ ఒక దారిన పడింది. ‘మన టేస్ట్ ఒకటే’ అని ఇద్దరూ గ్రహించారు. 2015లో పెళ్లి చేసుకున్నారు. ‘జీవితం అంటే తిరగడమే’ అనేది వీరి పెళ్లికి ట్యాగ్‌లైన్. 2016లో ‘రోడ్ టు టేస్ట్’ వ్లోగ్ మొదలెట్టారు. ఇన్‌స్టాలో కూడా తమ అనుభవాలు, ఫోటోలు పెడతారు. సోషల్ మీడియాలో ఈ జంట చాలా పాపులర్ అయ్యింది. రోడ్డు మార్గం గుండా తిరుగుతూ కొత్త ప్రాంతాల విశేషాలతో పాటు అక్కడి ఆహారం గురించి తెలియ చేస్తారు. కంటికి, కడుపుకి వీరిచ్చే విందు అందరికీ నచ్చింది. ఇప్పటికి వీరు కలిసి 30 దేశాల్లో 100 నగరాలు చూశారు. ఇన్ని మనం చూడకపోయినా మన దేశంలోనే 30 టూరిస్ట్ ప్లేస్‌లు చూడగలిగితే చాలు. డబ్బులూ వస్తాయి ఒక రంగంలో మనం ఫేమస్ అయితే డబ్బులూ వస్తాయి. సౌమ్య కూడా డబ్బు సంపాదిస్తోంది. అనేక ప్రాడక్ట్‌లను ప్రమోట్ చేయమని కంపెనీలు డబ్బులిస్తాయి. ఉదాహరణకు ‘మిల్టన్’ వారు ఒక ట్రిప్‌కు స్పాన్సర్ చేస్తారు. ఆ విశేషాలు రాసేప్పుడు సౌమ్య మిల్టన్ ఉత్పత్తి ఏదైనా తన ప్రయాణంలో ఉన్నట్టు చూపుతుంది. ఒక సినిమాను ప్రమోట్ చేయాలంటే పోస్టర్ ఇచ్చి హిమాలయ బేస్ క్యాంప్‌కు వెళ్లమంటే వెళ్లి అక్కడ దానిని చూపుతూ ఫొటో దిగుతారు. ప్లస్ ప్రయాణ వివరాలు రాస్తారు. అంటే ఉభయతారకం అన్నమాట. భ్రమణ కాంక్ష స్త్రీలైనా పురుషులైనా తిరగాలి. సౌమ్య, విషులకు ఉండే ఆర్థిక శక్తి, ఇంగ్లిష్ ప్రావీణ్యం మనకు లేకపోవచ్చు. కాని పొదుపుగా తక్కువ ఖర్చులో చేసే విహారాలు కూడా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు, తెలంగాణలో ఉన్నవారు ఆ రాష్ట్రంలోని ముఖ్య ప్రదేశాలు కనీసం చూసి ఉండాలి. ఆ తర్వాత సౌత్‌లోని ఒక్కో రాష్ట్రం చూడాలి. తర్వాత నార్త్. తర్వాత ఈశాన్యం. తిరుగుతూ ఉంటే ఈ లోకం ఇంత పెద్దది... చిన్న మనసుతో బతక్కూడదు అనిపిస్తుంది. అది చాలదూ? -
దర్శకుడు విస్సు ఇకలేరు
ప్రముఖ తమిళ దర్శకుడు విస్సు(74) ఇక లేరు. గత కొన్ని రోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన చెన్నై దురైపాక్కంలోని స్వగృహంలో ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. 1981లో దివంగత ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ వద్ద సహాయ దర్శకుడిగా చేరారు విస్సు. ఆ తర్వాత బాలచందర్ దర్శకత్వం వహించిన ‘తిల్లుముల్లు’ చిత్రానికి కథారచయితగా పరిచయమయ్యారు. ‘కణ్మణి పూంగా’ అనే చిత్రంతో దర్శకుడిగా మారారు విస్సు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘ఆడదే ఆధారం’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఎస్పీ ముత్తరామన్ దర్వకత్వం వహించిన ‘కుడుంబం ఒరు కడంబం’ అనే సినిమాతో నటుడిగానూ మారారు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోలతో కలిసి పనిచేశారాయన. ‘అరుణాచలం’ సినిమాలో రంభ తండ్రిగా చేసిన రంగాచారి పాత్ర ఆయనకు మంచి పేరు, గుర్తింపు తీసుకొచ్చింది. కుటుంబ కథా చిత్రాలను చక్కగా తెరకెక్కించగలరనే పేరు పొందారాయన. ఆయన దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘సంసారం అదు నిన్‌సారం’కి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘సంసారం ఒక చదరంగం’ పేరుతో రీమేక్ చేశారు. తమిళంలో విస్సు చేసిన పాత్రనే తెలుగులో గొల్లపూడి మారుతీరావు చేశారు. విస్సు మృతికి తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. విస్సుకి భార్య ఉమ, కుమార్తెలు లావణ్య, సంగీత, కల్పన ఉన్నారు. -
ప్రముఖ నటుడు విసు కన్నుమూత
సాక్షి, చెన్నై : ప్రముఖ దర్శక నటుడు, రచయిత మీనాక్షిసుందరం రామస్వామి విశ్వనాధన్(విసు,72) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1945 జులై 1న తమిళనాడులో జన్మించారాయన. ప్రఖ్యాత దర్శకుడు కే. బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో వచ్చిన ‘కుటుంబం ఒరు కదంబం’ అనే తమిళ చిత్రంతో నటుడిగా మారారు. ఈ సినిమాకు కథను అందించింది కూడా ఆయనే. పలు చిత్రాలకు కథలని అందించిన ఆయన ‘కణ్మని పూంగ’ అనే సినిమాతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తమిళ సినిమా తెరపై కథా రచన, దర్శకత్వం, నిర్మాణం, నటన ఇలా అన్ని రంగాల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 2016లో బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు. -
బీజేపీలో చేరిన నటుడు విసు
చెన్నై: ప్రముఖ చలనచిత్ర నటుడు విసు శనివారం బీజేపీలో చేరారు. చెన్నై టీనగర్‌లోగల రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయానికి నటుడు విసు శనివారం ఉదయం చేరుకున్నారు. అక్కడ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్‌ను కలిసి తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనను కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఆ సమయంలో బీజపీ ఉపాధ్యక్షులు వానతి శ్రీనివాసన్, చక్రవర్తి సహా బీజేపీ నిర్వాహకులు వెంట వున్నారు. తర్వాత నటుడు విసు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి అభినందనలు అందుకున్నారు. నటుడు విసుకు పార్టీలో ముఖ్య పదవి లభించగలదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.