breaking news
Vishwaroopam2
-
మళ్లీ సెట్స్ మీదకు 'విశ్వరూపం 2'
లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ చిత్రం విశ్వరూపం. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వెంటనే సీక్వల్‌ను కూడా రెడీ చేశాడు. అయితే అదే సమయంలో విశ్వరూపం 2 చిత్ర నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వటంతో విశ్వరూపం 2 ఆగిపోయింది. కొద్ది పాటి షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. చాలా రోజులు ఈ సినిమాను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న కమల్ ఫైనల్‌గా ఆస్కార్ రవిచంద్రన్ నుంచి విశ్వరూపం 2 సినిమాను తీసేసుకున్నాడు. త్వరలోనే తన సొంతం నిర్మాత సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. మంగళవారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసిన కమల్, త్వరలో పెండింగ్ షూటింగ్ ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా ఆ భాగాన్ని చెన్నైలోని మిలటరీ ఆఫీసర్స్ అకాడమీలో షూట్ చేసేందుకు నిర్ణయించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు కమల్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న శభాష్ నాయుడు సినిమా కూడా సెట్స్ మీదే ఉంది. -
కమల్ నోట రాజకీయ మాట
* కమల్ నోట రాజకీయ మాట * ఇంకా తగ్గని 'విశ్వరూపం' ఉద్వేగం * విదేశాలకు వెళ్లిపోతానంటూ పునరుద్ఘాటన తానేంటో, తన సినిమాలేంటో అంటూ సాగిపోయే కమలహాసన్ తొలిసారిగా రాజకీయ వ్యాఖ్యలతో ప్రకంపనలు సృష్టించారు. రాజకీయ నేతలపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. నేను దేశ నాయకుడిని అని చెప్పుకునే ఎవరితోనైనా చర్చకు సిద్ధమంటూ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సవాల్ విసిరారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:కోలీవుడ్‌లో ఎంజీఆర్, శివాజీ గణేషన్ తర్వాత తరంలో అంతటి జోడి హీరోలుగా రజ నీకాంత్, కమల్‌హాసన్ పేరు పొందారు. ఎంజీ ఆర్, శివాజీ గణేషన్ రాజకీయూల్లో తమదైన ముద్ర వేశారు. అలాగే రాజకీయూల్లోకి రావాలం టూ కమలహాసన్, రజనీకాంత్‌లపై అభిమానులు పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. రాజకీయ వాసన సోకకుండా కమల్ ఎంతో దూరంగా మెలుగుతున్నారు. రజనీ మాత్రం అప్పుడప్పుడూ ఊరిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఫలానా పార్టీకి ఓటేయాల్సిందిగా పిలుపునిస్తుంటారు. జాతీయ నాయకులతో చెలిమి చేస్తుంటారు. తమతో జత కట్టాలని రజనీకి వివిధ పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతుంటాయి. ప్రస్తుతం రజనీకాంత్‌ను నరేంద్రమోడీ ద్వారా బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. కమల్ మాత్రం రాజకీయాలకు, రాజకీయ నాయకులకు దూరంగా మెలుగుతున్నారు. ఏదైన ప్రత్యేకమైన సందర్భాల్లో సినీ ప్రముఖుని హోదాలో జయలలిత, కరుణానిధిని కలుస్తున్నారు. రాజకీయాలపై అంతటి జాగ్రత్తలు తీసుకునే కమల్‌హాసన్ ఆశ్చర్యకరమైన రీతిలో ఉద్వేగంగా స్పందించారు. విశ్వరూపం సినిమా విడుదల సందర్భంగా ఎదుర్కొన్న చేదు అనుభావాలే ఆయన చేత అటువంటి మాటలు అనిపించాయని ఇట్టే తెలుసుకోవచ్చు. కమలహాసన్ మంగళవారం చెన్నైలో ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజకీయూలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలే నాయకులు ప్రజాసేవ పేరుతో రాజకీయాలు చేసేవారు, గెలిచి అధికారంలోకి వచ్చేవారు ప్రజా నాయకులు కాదని, ప్రజాప్రతినిధులు మాత్రమేనని కమల్ పేర్కొన్నారు. వాస్తవానికి ప్రజలే నాయకులని నొక్కి చెప్పారు. నేను దేశ నాయకుడిని అని చెప్పుకునే ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. కోలీవుడ్ నుంచి ఎందరో రాజకీయాల్లోకి వచ్చారు, రాబోయే ఎన్నికల్లో మీరూ వస్తారా అనే ప్రశ్నకు స్పష్టమైనరీతిలో సమాధానమిచ్చారు. నటునిగా తన సంగతి తెలుసునని, ఏ విషయంలోనూ ఎవరినీ అనుకరించనని, తన బాట వేరేనని బదులిచ్చారు. రాజకీయ ప్రవేశం చేసే ఉద్దేశమే లేదన్నట్లుగా నాకు ప్రేక్షకులు కావాలి, ఓటర్లు వద్దురూ. అంటూ రాజకీయ ఊహాగానాలకు తెరదించారు. ఐదేళ్లకోసారి ఓటు వేయడం ద్వారా తన రాజకీయ బాధ్యతను నెరవేరుస్తున్నానని వెల్లడించారు. ప్రతి పౌరుడూ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా మనోభిప్రాయాన్ని చాటాలన్నారు. ఉచితంగా దేశసేవ చేస్తాననే వారికే పాలనా బాధ్యత అప్పగించాలని సూచించారు. అటువంటి వారికి మంచి జీతం ఇచ్చి దేశాన్ని సరైన దిశగా నడిపే బాధ్యతను అప్పగించాలని తెలిపారు. రాజకీయాల్లో ఉండేవారిని దయచేసి నాయకులు అనవద్దని, వారు మన ప్రతినిధులు మాత్రమేనని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లిపోతా విశ్వరూపం సినిమా విడుదలలో ఎదురైన చేదు అనుభవాలు విశ్వరూపం-2కు సైతం పునరావృతమైతే శాశ్వతంగా విదేశాలకు వెళ్లిపోయేందుకు సిద్ధమని కమల్ పునరుద్ఘాటించారు. మీడియా సమక్షంలో గతంలో చెప్పిన మాటలకు నేటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. వివాదాలు సృష్టించిన వారికి విడుదలకు ముందే విశ్వరూపం చూపానని, షేక్ హ్యాండ్లు ఇచ్చి మరీ అభినందించారని చెప్పారు. అయితే మరుసటి రోజే సినిమాను నిషేధించాలనే డిమాండ్లు లేవనెత్తారని విమర్శించారు. సినిమా సమాజంపై ప్రభావం చూపడం లేదని, సమాజంలో జరిగేదే సినిమాల్లో చూపిస్తున్నామని వివరించారు. బాబ్రీ మసీదు కూల్చివేసినపుడు ఆ అంశంపై నోరువిప్పిన ఒకే ఒక నటుడిని తాను మాత్రమేనన్నారు. ఎఫ్.ఎం.హుస్సేన్‌లా దేశాన్ని విడిచి వెళ్లేందుకు తానూ సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉంటూ సినిమాలు తీసినా అడ్డుకుని తీరుతారని, ఎందుకంటే సెంటిమెంట్ పేరుతో అడ్డుకునే సంస్కృతికి వేళ్లూనుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా తనకు రాజకీయాలు లేవని ముగించారు. -
ఒకే రోజున రజనీ, కమల్ చిత్రాల రిలీజ్
సూపర్‌స్టార్ రజనీకాంత్, పద్మశ్రీ కమల్ హాసన్ చిత్రాలు ఒకే రోజున తెరపైకొస్తే ఎలా ఉంటుంది. రసవత్తరంగా ఉంటుందంటున్నారు పంపిణీదారులు. అయితే అలాంటి అవకాశం ఉందా? అంటే, సరైన సమాచారం ఎవ్వరికీ చిక్కడం లేదు. రజనీకాంత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కోచ్చడయాన్’. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. త్రీడీ మోషన్ కాప్చరింగ్ పరిజ్ఞానంతో హాలివుడ్ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని రజనీ పుట్టిన రోజైన డిసెంబరు 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చరిత్రాత్మక భారీ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాగా కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విశ్వరూపం-2’. ఆండ్రియా, పూజాకుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పాటలను వచ్చే నెలలోను, చిత్రాన్ని డిసెంబరులోనూ విడుదల చేయడానికి కమల్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రెండు భారీ చిత్రాలను ఒకేసారి విడుదల చేయడం సరైన విధానమేనా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వస్తుంది. ఇప్పుడు మాత్రం రజనీ, కమల్ చిత్రాలు ఒకే రోజునే విడుదల చేయాలనే ఆకాంక్షను పంపిణీదారులు వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు చెప్పే కారణం ఇతర స్టార్ హీరోల చిత్రాలకు, రజనీ, కమల్ చిత్రాలకు వ్యత్యాసం ఉంటుందన్నదే. ఇతర హీరోల చిత్రాలు ఒకేసారి విడుదలయితే వాటిలో బాగున్న చిత్రమే థియేటర్లలో నిలబడుతుందటున్నారు. రజనీ, కమల్ చిత్రాలు అలా కాదని, ఎన్నో అంచనాలతో కూడిన ఈ చిత్రాలు హౌస్‌ఫుల్‌గా ప్రదర్శితం కావడం ఖాయం అని అంటున్నారు. అదేవిధంగా తమిళనాడులోని 700 థియేటర్లలోనూ ఈ రెండు చిత్రాలనే ప్రదర్శించవచ్చునని పేర్కొంటున్నారు. ఇతర హీరోల చిత్రాలకు ఇది సాధ్యం కాదంటున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో!?