పోటెత్తిన కోట
విశాఖ పార్లమెంట్ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోట జనాలతో పోటెత్తింది. జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తికి జనాలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. జనం కష్టాలు తీర్చిన రాజన్న సతీమణి విజయం సాధించాలని కోరుకున్నారు.జామి, ఎస్.కోట, వేపాడ, ఎల్.కోట మండలాల్లో రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. రాష్ర్టంలో రాజకీయ పరిస్థితి, చంద్రబాబు మోసపూరిత విధానాలు, కిరణ్ డబుల్ గేమ్, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ సాగిన ఆమె ప్రసంగం ప్రజలను ఆలోచింపచేసింది.
శృంగవరపుకోట, న్యూస్‌లైన్: జనప్రయోజనం కోసం ఆరాటపడి, ప్రజలకు మేలు చేయాలని, పది కాలాలపాటూ నిలిచే పనులు చేపట్టిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మైపై ప్రజలు అభిమాన జల్లులు కురిపించారు. ఆత్మీయ అతిథికి నీరాజనం పలికారు. ప్రియతమనేత సతీమణికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జై జగన్ నినాదాలు రోడ్‌షో ఆద్యంతం మిన్నంటాయి. విజయమ్మ రాకతో నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉప్పొంగింది. విశాఖ లోక్‌సభ పరిధిలోని ఎస్.కోట నియోజకవర్గంలో ఆమె శుక్రవారం ప్రచారం నిర్వహించా రు. జామి మండలంలో భీమసింగి గ్రామం వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశించిన విజయమ్మకు అపూర్వ స్వాగతం లభించింది.
విజయమ్మ వస్తున్న సమాచారం తెలుసుకున్న ప్రజలు ఆత్మీయ అతిథికి స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. తొలిసారి ఎన్నికల ప్రచారానికి వచ్చిన విజయమ్మను జనం తమ ఆత్మబంధువుగా ఆదరించారు. భీమసింగి జంక్షన్ వద్ద విజయమ్మ, వైఎస్సార్సీపీ పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ నియోజక వర్గంలోకి అడుగుపెట్టారు. ఎస్.కోట నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి రొంగలి జగన్నాథం, విజయనగరం నేతలు గాదె శ్రీనివాసులునాయుడు, బోకం శ్రీనివాస్, వేచలపు చినరామునాయుడు, కోళ్ల గంగాభవానిలు వారికి ఘన స్వాగతం పలికారు. జామి జంక్షన్లో విజయమ్మ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. రోడ్‌షోలో పలు చోట్ల తనను చూసేందుకు వచ్చిన మహిళల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.
సంతగవిరమ్మపేట గ్రామ మహిళలు విజయమ్మకు హారతులు పట్టారు. అడగడుగునా జనం నీరాజనాలు పలికారు. విజయమ్మ రాక తె లుసుకున్న గ్రామస్తులు దారి పొడుగునా బారులు తీరి స్వాగతం పలికారు. తొలిసారిగా ఎస్.కోట వచ్చిన విజయమ్మకు అపూర్వ ఆదరణ లభించింది. సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా రాజన్నకు ముందు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, రాజన్న తర్వాత వచ్చిన కిరణ్ పాలనలో లోపాలను విజయమ్మ సోదాహరణంగా వివరించారు. ప్రజల కష్టాల గురించి ప్రస్తావించారు. రాజన్నలో రాజసం, తెగువ, పట్టుదల, అన్నింటికి మించి సేవచేసే గుణం ఉన్న జగన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్గించారు.
అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్లలా రాజన్నపాలన సాగించారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం కుట్రలను ఎండగట్టారు. వేపాడ మండలం బొద్దాం గ్రామంలో స్థానికులు రాజన్న పాలన తీసుకు రావాలని, పేదలను ఆదుకోవాలని కోరడంతో ‘‘మీరంతా ఆదరిస్తే జగన్ అధికారంలోకి వస్తాడు. రాజన్న పెట్టిన ప్రతి సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా కొనసాగిస్తాడు’’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వేపాడ వెళుతుండగా సోంపురం వద్ద రైల్వేగేటు పడడంతో కాన్వాయ్ ఆగింది. ఈసందర్భంగా కొందరు మహిళలు, గ్రామస్తులు రాజన్న కాలంలో అమలైన సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వారి అభ్యర్థనపై స్పందించిన విజయమ్మ మాట్లాడుతూ మాట తప్పని, మడమ తిప్పని నైజం నాయన నుంచి జగన్‌కు అలవడింది, గతంలో రాజన్న అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని నడిపిస్తాడు. అంతకన్నా ఎక్కువగా ప్రయోజనం చేకూరేలా అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, 104, 102 వంటి పథకాలు ఏర్పాటు చేసి అమలు చేస్తారంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.
వేపాడలో వెల్లువలా వచ్చిన జనం జై జగన్‌అంటూ నినాదాలతో హోరెత్తించారు. రాత్రి 9.30 గంటల సమయంలో లక్కవరపుకోట చేరుకున్న విజయమ్మను చూసేందుకు వేలసంఖ్యలో వచ్చిన జనం నిరీక్షించారు. విజయమ్మ ప్రసంగాన్ని ఆద్యంతం విన్నారు. విజయమ్మ రోడ్‌షో కోసం ఎక్కడా ప్రచారం చేయకపోయినా, పలు గ్రామాల నుంచి జనం పెద్ద సంఖ్యలో సభలకు హాజరైన జనం మహానేతపై తమకున్న అభిమానాన్ని చాటిచెప్పారు. యువనేత జగన్ వెంట నడుస్తాం అన్న భరోసా ఇచ్చారు.