Vidyapati Review: వీడు మామూలోడు కాదు
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో కన్నడ చిత్రం విద్యాపతి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎవరికైనా ఆశ ఉండొచ్చు, అత్యాశ పనికి రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది తమ తక్షణ అవసరాల కోసం అత్యాశకు పోయి అనర్థాలు కొని తెచ్చుకుంటుంటారు. ఆ తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ కోవకు చెందిన కథే ‘విద్యాపతి’(Vidyapati ). ఇది ఓ కన్నడ సినిమా. ఇషాన్ ఖాన్, హసీమ్ ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్యాపతి’. నాగభూషణ, మలైకా వసుపాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దర్శకులు ఈ స్క్రీన్‌ప్లేని సరదా సరదాగా తీసుకువెళ్ళారు. అసలీ ‘విద్యాపతి’ సినిమా కథేంటంటే... విద్య అనే సినిమా హీరోయిన్ పెద్ద స్టార్. ఆ హీరోయిన్ని అల్లరి చిల్లరగా తిరిగే హీరో మోసం చేసి పెళ్ళి చేసుకుంటాడు. అంతేనా... పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయికి సంబంధించిన సినిమా వ్యవహారాలతోపాటు ఆస్తి పైన అప్పనంగా పెత్తనం చెలాయిస్తుంటాడు. అలా చెలాయిస్తూనే తన పేరును విద్యకు అనుసంధానంగా విద్యాపతిగా మార్చుకుని చెలామణి అవుతాడు. కానీ ఎప్పుడూ టైమ్ ఒకేలా ఉండదు కదా. విద్యకి విద్యాపతి చేసిన మోసం తెలిసి, తన ఇంటి నుండి గెంటేస్తుంది. అప్పటిదాకా ఫైవ్ స్టార్ భోగాలు అనుభవించిన విద్యాపతి తినడానికి, ఉండడానికి కూడా గతి లేక తన ఇంటికి వెళతాడు. విద్యాపతి తండ్రి బిరియానీ బండి నడుపుతుంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును అసహ్యించుకుంటాడు. తెలివొచ్చే టైమ్‌లో అన్నీ తెలిసొస్తాయన్నట్టు మన విద్యాపతి కళ్ళు నేల మీదకు వచ్చి విద్య దగ్గర తన లవ్‌ను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి... విద్యాపతి ప్రయత్నం ఫలించిందా లేక బెడిసికొట్టిందా అనేది మాత్రం సినిమాలోనే చూడాలి. ఓ మంచి లైన్‌తో దర్శకులు చక్కటి హ్యూమర్‌ను జోడించి, సినిమాను సరదాగా రూపొందించారు. గుడ్ మూవీ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు