breaking news
Vidhie
-
ఇంద్రాణీ ముఖర్జీతో కలిసి ఉండడానికి వీల్లేదు
ముంబై: ఇంద్రాణీ-పీటర్ ముఖర్జీల కూతురు విధీ ముఖర్జీకి ఎదురు దెబ్బ తగిలింది. తల్లితో కలిసి జీవించేందుకు అనుమతించాలన్న అభ్యర్థనను ముంబై ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరించే ముందు సీబీఐ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది కోర్టు. విధీ ముఖర్జీ గత కొన్ని సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తోంది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన తన తల్లిని కలిసేందుకు సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆమె ముంబై ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ కోర్టు ముందుకు రావడంతో ఆమె లండన్ నుంచి వచ్చారు. కన్నకూతురు షీనా బోరా హత్య కేసులో ప్రథమ నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జీ.. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే తల్లికి ఉన్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. ఆమెతో ఉండేందుకు అనుమతించాలని విధీ ముఖర్జీ తన అభ్యర్థనలో పేర్కొంది. అంతేకాదు.. 2015లో ఇంద్రాణీ అరెస్ట్ తర్వాత తల్లికి దూరమై తాను భావోద్వేగానికి లోనయ్యానని.. మైనర్‌గా ఉన్న తాను తల్లికి దూరమై కుమిలిపోయానని విధీ తన అభ్యర్థనలో చెప్పుకొచ్చింది. అయితే ప్రాసిక్యూషన్(సీబీఐ) మాత్రం అందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. విధీ ముఖర్జీ సైతం ఈ కేసులో సాక్షిగా ఉందని, ఆమెను ఇప్పటివరకు ప్రశ్నించని విషయాన్ని కోర్టుకు తెలిపింది సీబీఐ. ఆధారాల సేకరణ పూర్తయ్యే వరకు ఇంద్రాణీ ఎవరినీ కలవడానికి.. అనుమతి లేదన్న విషయాన్ని సీబీఐ, ప్రత్యేక న్యాయస్తానానికి గుర్తు చేసింది. ఒకవేళ విధి పిటిషన్‌ను విచారణకు గనుక స్వీకరిస్తే.. ఇంద్రాణీ బెయిల్ సమయంలో సుప్రీం కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. ఈ తరుణంలో.. సీబీఐ వాదనలో ఏకీభవించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజనీత్ సంఘాల్.. విధీ ముఖర్జీ పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కన్నకూతురైన షీనా బోరా(24)ను.. ఇంద్రాణీ ముఖర్జీ తన మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్వర్ రాయ్‌తో కలిసి కారులో 2012లో దారుణంగా హత్య చేసి.. శవాన్ని రాయ్‌గఢ్ జిల్లా శివారులోని అడవుల్లో తగలబెట్టింది. 2015లో వేరే కేసులో అరెస్ట్ అయిన శ్యామ్వర్ రాయ్ నోరు విప్పడంతో ఈ సంచలన కేసు వెలుగు చూసింది. ఈ కుట్రలో ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జీ పాత్ర కూడా ఉందని తేలడంతో ఆయన్ని అరెస్ట్ చేయగా.. 2020లో బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆపై ఇంద్రాణీ-పీటర్లు విడాకులు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉన్నప్పుడు, దుస్తులు తొలగించే హక్కు కూడా ఉంటుందా? -
విధీ కోసం ఇంద్రాణికి ప్రత్యేక అనుమతి
ముంబై: షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న ఇంద్రాణి ముఖర్జియాకు సీబీఐ న్యాయస్థానం ప్రత్యేక అనుమతులిచ్చింది. ఇంద్రాణి రెండో కూతురు విధీ చదువుల నిమిత్తం చెక్కులపై సంతకాలు చేసేందుకు ఓకే చెప్పింది. రిమాండ్ గడువు ముగిసిన నేపథ్యంలో నిందితులు ఇంద్రాణి, సంజీవ్ ఖన్నా, శ్యామ్ రాయ్ లను సీబీఐ అధికారులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. జనవరి 16 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చిన కోర్టు.. చెక్కులపై సంతకాలకు కూడా అనుమతించింది. కోర్టు హాలు బయట ఇంద్రాణి- విధీలు కౌగిలించుకుని కన్నీటిపర్యంతమయ్యారు. తల్లీకూతుళ్లు ఒకరినొకరు ఓదార్చుకున్నారు. విచారణ అనంతరం తిరిగి జైలుకు వెళ్లేందుకు పోలీస్ వ్యాన్ ఎక్కిన సందర్భంలోనూ ఇరువురూ భావోద్వేగానికి లోనయ్యారు. మరోవైపు జైలు తిండి తనకు పడటంలేదని, ఇంటినుంచి భోజనం తెప్పించుకుంటానన్న సంజీవ్ ఖన్నా అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. విధీ.. ఇంద్రాణి- సంజీవ్ ఖన్నాల కూతురు.