breaking news
vengalaraya sagar project
-
పెళ్లికి వచ్చి.. పరలోకానికి
మక్కువ(సాలూరు) : స్నేహితుడి పెళ్లి చూసేందుకని వచ్చి మళ్లీ తిరిగిరాని లోకాలకు చేరుకున్న ఓ వ్యక్తి విషాద గాథ ఇది. సాలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖపట్నంలోని క్రాంతినగర్ కాలనీకి చెందిన ముత్యాల నారాయణమూర్తి సాలూరు మండలం బాగువలసలో జరుగుతున్న స్నేహితుడి పెళ్లి కోసమని శుక్రవారం వచ్చాడు. పెళ్లి అయిపోయిన అనంతరం శనివారం అక్కడే ఉన్న వెంగళరాయసాగర్ ప్రాజెక్టును చూసేందుకు మిగిలిన స్నేహితులు మురళి, అప్పలస్వామితో కలిసి వెళ్లాడు. వారితో కలిసి రెగ్యులేటర్‌లోకి స్నానానికి దిగాడు. అయితే రెగ్యులేటర్ వద్ద రాళ్లపై స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి ప్రాజెక్టు లోపలికి పడిపోయాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు ప్రయత్నించినా నారాయణమూర్తి రాళ్లలో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక చనిపోయాడు. విషయం తెలుసుకున్న సాలూరు అగ్నిమాపక సిబ్బంది వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుని సుమారు మూడు గంటలు గాలించి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. సంఘటనా స్థలానికి సాలూరు సీఐ సయ్యద్ మహ్మద్, ఏఎస్ఐ గౌరీశంకర్ చేరుకుని కేసు నమోదు చేశారు. మృతునికి భార్య ఉమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లికి వచ్చిన వ్యక్తి తమ గ్రామంలో చనిపోవడంతో బాగువలసలో విషాదం అలుముకుంది. -
గోముఖి లింక్ ఛానల్ పనుల్లో నాణ్యత కరవు
విజయనగరం (మక్కువ) : విజయనగరం జిల్లాలో వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పరిధిలోని గోముఖి లింక్ ఛానల్ నిర్మాణ పనుల్లో నాణ్యత లేదని ఆయకుట్టు ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. హుద్ హుద్ తుఫాన్ పునరావాస నిధులతో చేపట్టిన ఈ నిర్మాణ పనుల్లో సరైన నాణ్యత పాటించకపోవడంతో కాలువ సపోర్టింగ్ వాల్ ఇటీవల కోతకు గురైంది. దీంతో నీరు లీక్ అయి వృథాగా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నందున ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు. -
అంతా మా ఇష్టం!
బొబ్బిలి :అధికారం మా చేతిలో ఉంది... మేం చెప్పిన వారికే పనులివ్వాలి... చేస్తే మా వాళ్లే చేయాలి..లేకపోతే అలాగే వదిలేయండి... ఇదీ మూడు నెలలుగా అధికార పార్టీ నాయకులు ఇరిగేషన్ అధికారులపై తెస్తున్న ఒత్తిడి. గత ఏడాదిలో వచ్చిన హుద్‌హుద్ తుపాను వల్ల దెబ్బతిన్న వెంగళరాయ సాగర్ కాలువ మరమ్మతులకు అధికారులు సిద్ధమైతే.. అధికార పార్టీ నాయకులు మూడు నెలలుగా అడ్డుపడుతూనే ఉన్నారు. మరో మూడు నెలలు ఇలాగే కాలయాపన చేస్తే సాగర్ ద్వారా ఖరీఫ్‌కు సాగునీరు అందకుండా పోయే ప్రమాదం ఉంది. దీంతో అధికారులకు ఏమి చేయాలో తెలి యని స్థితిలో ఉన్నారు. బొబ్బిలి సబ్ డివిజన్లోని వెంగళరాయసాగర్ బొబ్బి లి, సీతానగరం మండలాల పరిధిలో ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వా రా సుమారు 15 వేల ఎకరాల వరకూ సాగునీరు అందుతుం ది. గత ఏడాది అక్టోబరు నెలలో వచ్చిన హుద్‌హుద్ తు పాను వల్ల సాగర్ కాలువలకు గండ్లు పడడంతో పాటు ఆక్విడెక్టులు దెబ్బతిన్నాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 14 పనులను గుర్తించారు. వాటికి అంచనాలు తయారు చేసి దాదాపు రూ. 73 లక్షలకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రతిపాదనలు వెళ్లినా.. ప్రభుత్వం నిధుల మం జూరుకు మీనమేషాలు లెక్కించింది. చివరకు మూడు మా సాల కిందట బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు ఇరిగేషన్ శాఖాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ విషయం బయట పడడంతో వెంటనే కలెక్టరుతో మాట్లా డి పనులకు మంజూరు తీసుకువచ్చారు. వీటిలో 37 లక్షల 50 వేల రూపాయల విలువ కలిగిన 5 పనులకు టెండర్లు కూడా ఆహ్వానించారు. మిగిలిన 9 పనులను నామినేటెడ్ పద్ధతిలో చేయాల్సి ఉంది. అయితే జనవరి నుంచి నామినేషన్ పద్ధతిలో కేటాయింపులు జరగడం లే దు. ఆయకట్టు సంఘాల్లో ఉండే వ్యవసాయదారుడు ఈ పనులు చేయడానికి అర్హులు. వారిని ఎంపిక చేసే బాధ్యత ఆప్రాంతంలో ఉన్న జన్మభూమి కమిటీపై ఉంది. ఎంపిక చేసిన రైతుకు ఆయకట్టులో పొలం ఉందని నిరూపిస్తూ వీఆర్ఓ ధ్రువీకరణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ని ఉన్నా అధికార పార్టీ నా యకులు మాత్రం వారికి చెప్పిన వారికే పనులు ఇ వ్వాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. నీటిపారుదలశాఖ పైనా, పనులపైనా ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి ఉండడంతో నిబంధనలకు అనుగుణంగా వెళతామని ఇరిగేషన్ అధికారులు చెప్పడంతో మూడు మాసాలుగా పనులు జరగక ఎక్కడవక్కడే ఉన్నాయి. ఆన్లైన్లో టెండర్లు చేయాల్సిన పనులు కూడా ఇప్పటికీ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. ఆన్లైన్లో పాల్గొన్న కాంట్రాక్టర్లు మాత్రం వాటిని దక్కించుకోనే పనిలో అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. మరో మూడు మాసాల్లో ఖరీఫ్ సీజన్ మొదలవుతుంది. ఆ సమయానికి మరమ్మతులు పూర్తయితేనే కింది వరకూ నీరు వచ్చిన అవకాశం ఉంది. లేకపోతే వేలాది ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారనుంది. ఈ ప్రాంత రైతులకు ప్రధా న నీటి వనరులు వెంగళరాయసాగర్ కాలువే. దానికి మరమ్మతుకు ప్రభుత్వం నిధులిచ్చినా నియోజకవర్గంలో రాజకీయాల వల్ల పనులు జరగడం లేదు. -
నీరిస్తారా.. నీరుగారుస్తారా..?
మక్కువ, న్యూస్‌లైన్: మక్కువ, సాలూరు మండలాల పరిధిలో కొండలపై ప్రవహించే సెలయేటి నీటిని మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాల రైతుల పొలాలకు మళ్లించేందుకు వెంగళరాయసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. 1977లో పనులు ప్రారంభించి 1984లో ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. వీఆర్ఎస్ ద్వారా మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాలకు 24,700 ఎకరాలకు సాగునీరు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ మేరకు సాగు నీరు అందడం లేదు. వీఆర్ఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కాలువలు, షట్టర్లు, హెడ్‌స్లూయిస్. గోముఖి లింక్‌చానల్ వద్ద రబ్బర్‌సీల్ మరమ్మతులకు గురవ్వడం, గోముఖీ ఆక్విడెక్ట్ పాడవ్వడంతో సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. వీఆర్ఎస్కు జఫాన్ నిధులు వస్తాయి, వాటితో వీఆర్ఎస్ను ఆధునీకరిస్తామని రైతులకు చాలా ఏళ్ల నుంచి చెబుతున్నారు. కానీ నిధులు మాత్రం రావడం లేదు. కేవ లం సీడీఆర్ నిధులతో ఏటా కాలువల్లో పేరుకుపోయిన పూడికలను తొలగిస్తున్నారు తప్ప మిగిలిన పనుల ఊసే పట్టడం లేదు. దీంతో శివారు ప్రాంతాల రైతులకు కన్నీరే మిగులుతోంది. వీఆర్ఎస్ కుడి ప్రధాన కాలువా ద్వారా మక్కువ, బొబ్బిలి, సీతానగరం మండలాలకు చెందిన సుమారు11,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అయితే బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట వరకు మాత్రమే నీరు వెళుతోంది. గోపాలరాయుడుపేట వద్ద నున్న ఆక్విడెక్ట్ మరమ్మతులకు గురవ్వడంతో బొబ్బిలి, సీతానగరం మండలాలకు చెందిన సుమారు ఆరువేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆర్ఎంసీ పరిధిలో ఉన్న 16 షట్టర్లకుగాను 11 షట్టర్లు పాడయ్యాయి. దీంతో నీటిని అదుపు చేసేందుకు వీలు లేక కిందికి వదలాల్సి వస్తోంది. కేవలం సీడీఆర్ నిధులు 15లక్షలు మాత్రమే విడుదల కావడంతో ఆర్‌ఎంసీకి ఏర్పడ్డ గండ్లు, కాలువాల్లో పేరుకుపోయిన షిల్ట్‌ను తొలగించేందుకు వీలు కావడం లేదు. ఎల్బీసీ స్లూయిస్, గోముఖి లింక్‌చానల్ షట్టర్ వద్ద రబ్బర్‌సీల్ కూడా పాడయ్యాయి. హెడ్‌స్లూయిస్ మరమ్మతులు జరిపించే ందుకుగాను *9లక్షలు, గోముఖి లింక్ చానల్ రబ్బర్సీల్ను బాగు చేసేందుకు *4లక్షలు మంజూరయ్యాయి.అయితే పనులు మాత్రం కొంతవరకే జరిగాయి. ఇప్పటివరకు పనులు జరిపించకపోవడతో ఈ ఏడాది ఖరీఫ్‌కు సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్ఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఆర్బీసీ ద్వారా సుమారు ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. శివారు గ్రామాల కాలువల్లో పూడికలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల మూడు వేల ఎకరాల పొలాలకు నీరు అందడం లేదు. సీడీఆర్ నిధులు *4లక్షలతో ప్రధాన కాలువల్లోని పూడికలను ఇటీవల తొలగించినప్పటికీ, పిల్ల కాలువల వైపు అధికారులు తొంగిచూడడం లేదు. గోముఖి ఆక్విడెక్టు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆండ్ర(మెంటాడ): మండలంలోని ఆండ్ర - లోతుగెడ్డ గ్రామాల మధ్య చంపావతి నదిపై నిర్మించిన ఆండ్ర రిజర్వాయర్ గత ఐదేళ్లుగా సరైన నిర్వహణకు నోచుకోవడం లేదు. ఇది రైతులకు శాపంగా మారింది. ఆండ్ర రిజర్వాయర్ ద్వారా సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. నిర్వహణ లోపం కారణంగా పూర్తి స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. పలు చోట్ల ప్రధాన కాలువల్లో పూడికలు తీయకపోవడం, శిథిలావస్థకు చేరుకున్న ప్రధాన కుడి, ఎడమ కాలువలతో పాటు పిల్ల కాలువలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సాగునీరు వృథాగా పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆండ్ర రిజర్వాయర్ ద్వారా మెంటాడ, బొండపల్లి, గజపతినగరం మండలాల రైతులకు సాగునీరు అందుతుంది. గతంలో పని చేసిన ఇరిగేషన్ అధికారులు ఏటా కాలువల్లో పూడికలు తీయడం, శిథిలావస్థకు చేరుకున్న పిల్ల కాలువలకు మరమ్మతులు నిర్వహించేవారని పలువురు రైతులు చెబుతున్నారు. అయితే గత ఐదేళ్లుగా సంబంధిత ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని ఆయకట్టు రైతులు పలువురు ఆరోపిస్తున్నారు. కుడి, ఎడమ కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగించి, కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరుకున్న కాలువలను బాగు చేయాలని రైతులు కోరుతున్నారు. అదనంగా మరో 4600 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎడమ కాలువకు అనుబంధంగా హైలెవెల్ కెనాల్, కుడి కాలువకు అనుబంధంగా 9 ఆర్ కాలువ పనులు చేపట్టారు. హై లెవెల్ కెనాల్ ద్వారా 4100 ఎకరాలకు, 9 ఆర్ కాలువ ద్వారా మరో 500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. హైలెవెల్ కెనాల్ పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఒక ఎకరాకు కూడా సాగునీరు అందడం లేదని ఆయకట్టు రైతులు అంటున్నారు. 9 ఆర్ కాలువ పనులు మధ్యలో నిలిచిపోయాయి. నిర్వహణకు అవసరమైన నిధులు మంజూరు కాకపోవడంతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేకపోతున్నామని సంబంధిత ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. బొబ్బిలి, న్యూస్‌లైన్: ఖరీఫ్ సీజను ముంచుకొస్తున్న తరుణంలో నియోజకవర్గంలో సాగునీటి వనరుల పరిస్థితి దయనీయంగా ఉంది. జలాశయాల్లో పుష్కలంగా నీరున్నా ఆయకట్టుకు అందని దుస్థితి నెలకొంది. తొలకరి కూడా పలకరించడంతో అన్నదాత పనులకు సిద్ధమయ్యాడు. కానీ సాగునీటి వనరుల పరిస్థితి చూస్తే మాత్రం నీరిచ్చే విధంగా కనిపించడం లేదు. బొబ్బిలి మండలం, పట్టణానికి సంబంధించి ప్రధాన వనరులు వెంగళరాయసాగర్, పారాది ఆనకట్టలు. సాగర్ జలాశయం నుంచి చివర ఆయకట్టు వరకూ ఈ ఏడాది సాగునీరు పుష్కలంగా అందుతుందా అనేది సందేహమే. జలాశయాన్ని ఆధునికీకరణ చేయడానికి జపాన్ నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పెట్టడం మినహా నిధులు మాత్రం ఇప్పటివరకు రాలేదు. దీంతో పాటు రాష్ర్ట ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వకపోవడంతో ఏటా గండ్లు పడడం, కాలువలు పటిష్టంగా లేకపోవడం, షట్టర్లు లేని మదుములు ఇలా అనేక సమస్యల వల్ల సాగునీరు పొలాల వరకు చేరలేకపోతోంది. ఈ ఏడాది అదనపు ఆయకట్టు అయిదు వేల ఎకరాలకు సాగునీరు కూడా అందుతుందా అనేది ప్రశ్నార్థకమైంది. ఇక పారాది ఆనకట్ట నుంచి అటు బాడంగి, ఇటు బొబ్బిలి మండలాలకు సాగునీరు ఇవ్వాలి. కానీ బాడంగికి నీరివ్వాల్సిన పాల్తేరు చానల్ పూర్తిగా మూతపడింది. దీన్ని తెరిపించడానికి ఎలాంటి చర్యలు అధికారులు చేపట్టడం లేదు. అలాగే రామభద్రపురం, బాడంగి మండలాలకు పెద్దగెడ్డ నీరు ఇస్తామని ప్రకటనలు చేసినా నేటి వరకూ అవి అందలేదు. ఇక బొబ్బిలి మండలంలోని చిత్ర కోట జలాశయం, కంచరగెడ్డలు జలాశయాలుగా రికార్డులకే పరిమితమయ్యాయి. వాటి వల్ల చుక్క నీరు కూడా ఆయకట్టుకు అందడం లేదు. రామభద్రపురం మండలంలోని ఏడొంపులగెడ్డ తదితర వన్నీ రైతులకు నీరివ్వకలేకపోతున్నాయి. నీటి పారుదలశాఖాధికారులు కూడా ఇప్పటివరకూ ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి, తెర్లాం, బాడంగి మండలాల్లో పెద్ద పెద్ద చెరువులున్నా అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. వాటి వల్ల నీరు పెద్దగా నిల్వ ఉండక సగమే వినియోగపడడం, గండ్లు పడి వృథా అయిపోవడం జరుగుతుంది. ఇకనైనా అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.