పండుటాకులకు పెద్దకష్టం
వర్గల్: కలహాల కాపురం..క్షణికావేశం...వెరసి కు టుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. తల్లిదండ్రుల బలవన్మరణాలతో పసిపిల్లలు అనాథలు గా మిగిలిపోతున్నారు. తమ బతుకులే కష్టంగా మారిన పండుటాకులకు మరింత భారమవుతున్నారు. విధి ఆడిన వింత నాటకంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు జాలిగా ప్రేమ కోసం పరితపిస్తుంటే..రెక్కలే తప్ప మా దగ్గరేమున్నాయంటూ అక్కున చేర్చుకుంటున్న పండుటాకులు ఇందుకా తాము బతికున్నదని తమలో తామే కుమిలిపోతున్నారు.
వర్గల్ మండలం నెంటూరుకు చెందిన చీరాల ఎల్లయ్య(60), రామవ్వ(56) దంపతులు నిరుపేదలు. వీరికి బాలయ్య, ఆంజనేయులు, రమేష్ సంతానం. పెద్ద కుమారుడు బాలయ్య పదేండ్ల క్రితం చనిపోయాడు. దీంతో పసిప్రాయంలో ఉన్న బాలయ్య కుమారుడిని అతని తల్లి తాత, నాన్నమ్మల వద్ద వదిలి తన దారిన వెళ్లిపోయింది. ఇక ఎల్లయ్య, రామవ్వల రెండో కుమారుడు ఆంజనేయులుకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా, బతుకుదెరువు కోసం భార్య వరలక్ష్మితో కలిసి ఒంటిమామిడికి వెళ్లాడు. అక్కడ తాను కూరగాయల మార్కెట్లో హమాలీగా, భార్య కూలీగా పనిచేస్తున్నారు.
వీరికి రజిత (6), నందిత (4) సంతానం. దంపతుల మధ్య సఖ్యత లేక వీరి కాపురం కలహాలకు నెలవైంది. రెండ్రోజుల క్రితం శుక్రవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. తమ కాపురానికి గుర్తుగా ఇద్దరు చిన్నారులున్నారనే విషయం విస్మరించిన వరలక్ష్మి క్షణికావే శానికి లోనైంది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. భార్య బలవన్మరణం చెందడం, అందుకు తానే కారణమని అపవాదు రావడంతో భర్త ఆంజనేయులు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. శనివారం భార్య అంత్యక్రియలకు సైతం హాజరుకాకుండా అదేరోజు రాత్రి ఓ చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణం చెందాడు.
దీంతో వారి పిల్లల భవిష్యత్తు అయోమయంగా మారింది. పిల్లల ఆలనాపాలనా భారం తాత, నానమ్మలైన ఎల్లయ్య, రామవ్వలపై పడింది. ఇద్దరు కుమారుల కాపురాలు చితికిపోయి... వారి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో ఆ వృద్ధ దంపతులు పెను విషాదంలో కూరుకుపోయారు. పదో తరగతి చదువుతున్న చిన్న కుమారుడు రమేష్తోపాటు తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన హరికిషన్(బాలయ్య కుమారుడు), రజిత, నందిత (ఆంజనేయులు సంతానం) భారాన్ని రజక వృత్తితో కాలం వెల్లదీస్తున్న ఈ పండుటాకులు ఎలా భరించి ఆసరాగా నిలుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
శనివారం కోడలు చితికి....ఆదివారం కుమారుడి చితికి..
వరలక్ష్మి ఆత్మహత్యకు ఆమె భర్త ఆంజనేయులే కారణమని అపవాదు రావడంతో మనస్తాపం చెందిన అతను శనివారం నెంటూరులో జరిగిన ఆమె అంత్యక్రియలకు రాలేదు. దీంతో మామ ఎల్లయ్యనే తల కొరివిపెట్టి కోడలు వరలక్ష్మి అంత్యక్రియలు జరిపారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కుమారుడు బలవన్మరణం చెందిన వార్త తెలిసి హతాశుడయ్యాడు.
ఆదివారం ఆంజనేయులు మృతదేహానికి గజ్వేల్లో పోస్టుమార్టం నిర్వహించి ఇంటికి తీసుకురాగా, ఒక రోజు ముందు కోడలి చితికినిప్పుపెట్టిన ఎల్లయ్య ఆదివారం కుమారుడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య దంపతులు వేదన, చిన్నారుల ఆక్రందనలు నెంటూరు గ్రామస్తులను కంట తడిపెట్టించాయి.