breaking news
Vakadu Mandal
-
రూ.కోట్లు మింగేశారు
ఇరిగేషన్ శాఖలో ఇంజినీర్లు, కాంట్రాక్టర్ల కుమ్మక్కై రూ.కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. గూడూరు నియోజకవర్గంలోని వాకాడు, కోట మండలాల్లో నిర్వహించిన స్వర్ణముఖి, చల్లకాలువ పొర్లుకట్టల మట్టి పనులు తూతూ మంత్రంగా నిర్వహించి అందులో రూ.కోట్లు మింగేశారు. వాకాడు : వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ నుంచి పామంజి వరకు 14.5 కిలోమీటర్ల పొడవున నదికి కుడివైపున జరుగుతున్న పొర్లుకట్ట పనుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శిం చారు. ఈ పనుల మొత్తం అంచనా విలువ రూ.17.05 కోట్లు. అందులో 3.5 కిలోమీటర్ల మేర సుమారు రూ.3 కోట్ల పనులను చేయకుండా అర్ధాంతరంగా నిలిపివేశారు. ఆ నిధులను చేసిన పనులకే సర్దుబాటు చేశారు. దీంతో కొంతమంది రైతులు ఆందోళన చేపట్టడంతో కొత్తగా రూ.3 కోట్లకు అంచనాలు తయారు చేసే ప్రక్రియలో ఇంజినీర్లు ఉన్నట్లు సమాచారం.జిల్లాలో 2000–01 సంవత్సరంలో భారీ వరదలు వచ్చాయి. జలవనరుల శాఖ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పొర్లుకట్టల పనుల పటిష్టత కోసం నాయుడుపేట నుంచి వాకాడు మండలం పామంజి వరకు, కోట మండలం చల్లకాలువ నుంచి పామంజి వరకు పొర్లుకట్టల పనులకు రూ. 287 కోట్లతో అంచనాలు తయారు చేసింది. అప్పట్లో టెండర్లు పిలిచినా పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో 2012 సంవత్సరంలో పొర్లు కట్టల ఎత్తు తగ్గించి మళ్లీ అంచనాలు సవరించి రూ.226 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. 2013లో పొర్లుకట్టల పనులకు టెండర్లు పిలిచారు. అందులోనే కోట మండలం గూడలి నుంచి చల్లకాలువ మీదుగా పామంజి వరకు ఇరువైపులా పొర్లుకట్టలకు సంబంధించి సుమారు రూ.100 కోట్లతో పనులు చేయాల్సి ఉంది. ఒకవైపు కట్టకు సంబంధించి సుమారు రూ.45 కోట్ల టెండర్లకు గాను కాంట్రాక్టర్ లెస్ వేసి రూ.40 కోట్లకే పనులు దక్కించుకున్నారు. ఒక వైపే ఈ పనులు చేసి రెండో వైపు భూసేకరణ సమస్యతో పనుల్లో జాప్యం జరిగింది. రెండు ప్యాకేజీలకు సంబంధించిన పనుల అంచనాలు పలు విధాలుగా విభజించి అధికారులు కాంట్రాక్టర్‌కు అనుకూలంగా చేశారు. కొందరు రాజకీయ నాయకులు పలుకుబడి ఉపయోగించి పాత టెం డర్లు రద్దు చేయించి, తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కుడివైపు కట్టకు రూ.17.05 కోట్లు వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ నుంచి పామంజి వరకు 14.5 కి.మీ. నదికి కుడి వైపు కట్టకు సంబంధించి రూ. 17.05 కోట్లు అదే సమయంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. నెల్లూరుకు చెందిన ఓ కాంట్రాక్టర్ టెండర్ ద్వారా పనులు దక్కించుకున్నారు. ఈ పనులను 2015 నాటికి పూర్తి చేసేలా అప్పట్లో ఒప్పందం జరిగింది. అధికారులు, కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం వెరసి ఒప్పందం ప్రకారం పనులు పూర్తి కాలేదు. పనుల్లో నాణ్యత లోపించి ఎక్కడ మట్టి అక్కడే జారిపోయింది. మళ్లీ పనులు చేసేందుకు ఇటీవల అధికారపార్టీ నేతల జోక్యంతో పొర్లుకట్టల పనులకు ఇంజినీర్లు అంచనాలు తయారు చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసేందుకు అంచనాల మీద అంచనాలు తయారు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వాకాడు మండలంలో పొర్లు కట్టలకు సంబంధించి సమారు 30 ఎకరాలు భూ సేకరణ జరిగింది. అయితే ఆయా భూముల యజమానులకు ఇంత వరకు ఒక్క పైసాకూడా పరిహారం అందలేదు. దీంతో రైతులు పనులు జరగనివ్వకుండా అడ్డుతగులుతున్నారు. నాయుడుపేట నుంచి వాకాడు మండలం పామంజి వరకు జరిగిన పనుల్లో రూ.50 కోట్ల వరకు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలున్నాయి. విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. నాణ్యతేదీ? వాకాడు నుంచి పామంజి మధ్య పొర్లుకట్టల నిర్మాణ పనులన్నీ నాణ్యత లేకుండా జరిగాయి. పొర్లుకట్టకు పక్క భాగంగాలోనే ఉన్న ఇసుక, మట్టిని తీసి కట్టలకు ఉపయోగించారు. అప్పట్లో కురిసిన భారీ వర్షాలకు కొన్ని చోట్ల కట్ట కరిగిపోయింది. మరికొన్ని చోట్ల గండ్లుపడి రైతులకు నష్టపోయారు. ఇది ఇలా ఉంటే కొన్ని చోట్ల పాతకట్టల పనులనే చూపి బిల్లులు చేసుకున్నారు. ఇప్పటికే నీరు–చెట్టు పథకం కింద తెలుగు తమ్ముళ్లు పలు అక్రమాలకు పాల్పడ్డారు. మని కొన్ని పనులకు దొంగ బిల్లులు పెట్టి, అధికారులను భయపెడుతూ నిధుల మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఇటీవల జరిగిన టీడీపీ జనరల్‌బాడీ సమావేశంలో ఈ నెలాఖరుకల్లా నీరు–చెట్టు పథకానికి సంబంధించిన బిల్లులు అన్నిటికీ నిధులు మంజూరు చేస్తామంటూ స్వయాన రాష్ట్ర మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. పనులు నాసిరకంగా చేపట్టారు వాకాడు స్వర్ణముఖి నది పొర్లుకట్టల పనులు నాసిరకంగా చేపట్టారు. దీంతో వరదలొస్తే సమీప గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అలాగే పొర్లుకట్టలకు సంబంధించి రైతుల నుంచి భూములను రెవెన్యూ అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అందుకు పరిహారం చెల్లిస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. భూములు కోల్పోయిన వారంతా దళితులు. జీవనాధారమైన పొలం తీసుకోవడంతో పలు కుటుంబాలు వీధిన పడ్డాయి. –దుంపల సుబ్రహ్మణ్యం, రైతు, గంగన్నపాళెం పొర్లుకట్టల పనులు పూర్తి కాలేదు ప్రస్తుతం జరుగుతున్న స్వర్ణముఖి నది పొర్లుకట్టల పనులు ఇంకా పూర్తి కాలేదు. కొన్నిచోట్ల మట్టి జారిపోయిన సంగతి వాస్తవమే. ఆయా చోట్ల మళ్లీ పనులు చేపడతాం. ఎందుకంటే పనులు పూర్తి చేసిన రెండేళ్ల వరకు కాంట్రాక్టర్ మరమ్మతుల పనులు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే పొర్లుకట్టల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తాం. –మధు, ఇరిగేషన్ డీఈ -
‘వైఎస్ జగన్ సీఎం అయ్యాకే పెళ్లి’
సాక్షి, వాకాడు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యే వరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం కల్లూరు కొత్తపాళెం గ్రామానికి చెందిన రాయిపు రవీంద్ర అనే 27 ఏళ్ల పీజీ విద్యార్థి ఆదివారం జరిగిన పెళ్లి చూపుల్లో శపథం చేశారు. ఆదివారం రాయిపు రవీంద్రకు తన బంధువుల అమ్మాయితో గ్రామంలో పెళ్లి చూపులు జరిగాయి. రవీంద్ర మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో తాను పీజీ చేశానని తెలిపారు. నెల్లూరు విక్రమసింహపురి వర్సిటీలో 2015లో ఎంకాం పూర్తి చేయగా మూడేళ్లుగా నేటి ప్రభుత్వంలో ఉద్యోగం సంపాదించడం అందని ద్రాక్షలా మారిందన్నారు. ఈ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగమని నమ్మబలికి ఉన్న ఉద్యోగాలను కూడా తీసేస్తోందన్నారు. ఉద్యోగాలు రావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని, అప్పుడే తాను పెళ్లి చేసుకుంటానని రవీంద్ర తన దైవం సాక్షిగా ప్రమాణం చేశాడు. దీంతో వచ్చిన బంధువులు కూడా అలాగే చేద్దామంటూ అతనికి మద్దతు పలికారు. -
ఐదేళ్లుగా మాకేం చేశారు?
వాకాడు: తిరుపతి ఎంపీ చింతామోహన్‌కు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగరాజపట్నంలో ప్రజల నుంచి చుక్కెదురైంది. సోమవారం ఆయన దుగరాజపట్నంలో పర్యటించారు. ఎంపీగా గెలిచిన తర్వాత ఐదేళ్లలో ఈ ప్రాంతానికి ఏం చేశావని స్థానికులు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక మౌనం దాల్చారు. వాకాడులోని స్వర్ణముఖి బ్యారేజీ నుంచి దుగరాజపట్నం చెరువుకు సాగునీటి సరఫరా చేసే కాలువకు నిధులు మంజూరైనా, పనులు చేపట్టకపోవడంపై నిలదీశారు. స్థానికులు ఏమి అడిగినా ఆయన నుంచి సమాధానం కరువైంది. కాగా, బుధవారం నెల్లూరు పర్యటనకు రానున్న కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ను దుగరాజపట్నం సమీపంలోని అంజి లాపురానికి తీసుకొచ్చేందుకు చింతా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం నేదురుమల్లి అనుచరులతో వచ్చిన ఆయన జైరాం రమేశ్‌తో పాటు ఆనం రామనారాయణరెడ్డి తదితర నేతలతో ఇక్కడ సభ నిర్వహించే విషయమై చర్చించారు.