breaking news
unemployees of ap
-
వాళ్ల ఆత్మహత్యలు బాధాకరం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ఇద్దరు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు బాధాకరమని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలులో ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రం ఆవిర్భావం నుంచి లక్షా 43వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. దాని ఫలితమే నిరుద్యోగుల ఆత్మహత్యలు. నిరుద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దు. అందరం కలిసికట్టుగా పోరాడి ప్రత్యేక హోదాను సాధించుకుందాం. జీవితం చాలా విలువైంది. మంచి రోజులు వస్తాయి.’ అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు. కాగా ఉన్నత విద్య అభ్యసించి ఏళ్ల తరబడి ఎదురు చూసినా ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరు నిరుద్యోగులు బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బీటెక్ పూర్తి చేసిన అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన నవీన్ (23) ఉరి వేసుకుని, ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన పాలిక గాంధీ అలియాస్ శ్రీను(28) పురుగు మందు తాగి తనువు చాలించారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి. pic.twitter.com/IoNL9IzGXF — YS Jagan Mohan Reddy (@ysjagan) 12 October 2017 -
నిరుద్యోగులకు బంపర్ చాన్స్
ఉద్యోగం సంపాదించాలంటే ఎంత కష్టమో డిగ్రీలు పూర్తిచేసి రెండుమూడేళ్లు తిరిగినవాళ్లకు తెలుస్తుంది. రకరకాల పోర్టళ్లలో రెజ్యూమ్ అప్లోడ్ చేసి నెలలు గడిచినా ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాక నిరాశ చెందేవాళ్లు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి మంచి అవకాశం కల్పిస్తోంది. గతంలో అంటే, సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితం అయితే ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజిలో పేర్లు నమోదుచేసుకునేవాళ్లు. అప్పుడు వాళ్ల అర్హతలకు తగిన అవకాశాలుంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చేది. ఇప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి కూడా తన రూపం మార్చుకుంది. తాజాగా ఏపీ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి డాట్ కామ్ అనే వెబ్సైట్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. ఇందులో ఒకసారి రిజిస్టర్ చేసుకుని, తమ రెజ్యూమ్‌ను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అభ్యర్థి అర్హతలను బట్టి ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. అలాగే ఆయా జిల్లాలు, మండలాల వారీగా ఉండే ఉద్యోగాల సమాచారం కూడా తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం, నోటిఫికేషన్లు, ప్రభుత్వోద్యోగాల సమాచారం అంతా ఈ సైట్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో రిజిస్టర్ చేసుకోడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని సేవలు పూర్తి ఉచితం. అలాగే రిక్రూటర్లు కూడా.. ఈ సైట్లో తమ సంస్థలో ఉన్న ఖాళీల గురించి పోస్ట్ చేస్తే, దానికి తగిన అర్హతలు, నైపుణ్యాలున్న అభ్యర్థులు వాటికి దరఖాస్తు చేస్తారు. పూర్తి వివరాలకు www.apemploymentexchange.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.