breaking news
transporting
-
అప్పుడే నల్ల బజారుకి
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లా ఆఫీసర్లకే ఒక్కొక్కలకి లక్ష దాకా ఇస్తం. బియ్యం పట్టుకోకుండ, రాష్ట్రం దాటిచ్చెటందుకు గీ ఆఖరి పోలీస్టేషన్‌కే నెలకు లక్ష ఇస్తం. తాసీల్దార్లు, డీటీలు అందరికి ఎవలయి వాళ్లకు పోతయి. బియ్యం బయటకు పోకుండ ఆపితే మాకంటే వాళ్లకే ఎక్కువ లాస్. గందుకె మా దందా ఆగది’ సిరోంచలో బియ్యం దందా చేసే ఓ వ్యక్తి బాహాటంగా చెపుతున్న మాటలివి. రాష్ట్రంలో పేదలకు అందాల్సిన పీడీఎస్ బియ్యం లబ్ధిదారులు, రేషన్ డీలర్ల ద్వారా ఈ నెల కూడా యధేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. పీడీఎస్ బియ్యం పంపిణీ ఈ నెల 4వ తేదీ నుంచి మొదలు కాగా , ఎప్పటి మాదిరిగానే గత మూడు రోజుల నుంచి బియ్యం నల్లబజారుకు తరలిపోవడం మొదలైందని విశ్వసనీయ సమాచారం. చిన్న చిన్న సరకు రవాణా వాహనాలను పోలీసులు పట్టుకున్నట్లు షో చేస్తుండగా, టన్నుల కొద్దీ బియ్యాన్ని గోడౌన్లకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సోమవారం నుంచి రాత్రి వేళల్లో లారీలు, ట్రక్కుల్లో దాచి ఉంచిన బియ్యాన్ని మహారాష్ట్ర, కర్నాటకకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. బియ్యం రవాణా విషయంలో పౌరసరఫరాల శాఖ డీఎస్వోలు, డీఎంలు, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పెద్దగా దృష్టి పెట్టలేదని తెలుస్తోంది. ఈ శాఖల అధికారులకు అక్రమ రవాణా దారుల నుంచి వచ్చే మామూళ్లే అందుకు కారణమని అంటున్నారు. సర్కారు ఆదేశించినా అదే తీరు...: రాష్ట్రంలో పేదల బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ‘సాక్షి’లో గతనెల 30, ఈనెల 1వ తేదీల్లో ప్రచురితమైన వార్త కథనాలపై పౌరసరఫరాల శాఖ స్పందించింది. ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు కమిషనర్ వి.అనిల్‌కుమార్ జిల్లాల డీఎస్ఓలు, డీఎంలతో పాటు ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. 4వ తేదీ నుంచి మొదలయ్యే బియ్యం పంపిణీ సక్రమంగా జరగాలని, రేషన్ షాపులపై నిఘా పెట్టాలని ఆదేశించారు. అయితే కొన్ని చోట్ల మినహా ఏ జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ సిబ్బంది పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి పెట్టలేదు. రేషన్ దుకాణాలను సందర్శించి, స్టాక్‌ను తనిఖీ చేసిన, చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో రేషన్ దుకాణాల నుంచి యధేచ్ఛగా బియ్యం గోడౌన్లకు తరలిపోతున్నట్లు సమాచారం. సోమవారం నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల మీదుగా పక్క రాష్ట్రాలకు బియ్యాన్ని పంపించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగినట్లు తెలుస్తోంది. కాగా దుకాణాలకు రేషన్ చేరిన వారం రోజుల్లోగా ..రేషన్ దందా చేసే వాళ్ళు ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో రెండుసార్లు బియ్యం అక్రమ రవాణాకు స్కెచ్ వేస్తున్నట్లు మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ ‘సాక్షి’కి తెలిపారు. తూతూ మంత్రంగా దాడులు... తాజాగా మరికల్ మక్తల్ మీదుగా కర్ణాటకకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే అమరచింతకు చెందిన ఓ వ్యక్తికి చెందిన బియ్యం లారీ, బొలెరో వాహనాన్ని మహబూబ్‌నగర్, నారాయణపేటల్లో స్థానికులు పోలీసులకు పట్టించి ఇచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్‌లో అక్రమ రవాణా అవుతున్న రూ. 86వేల విలువైన 43 క్వింటాళ్ల బియ్యాన్ని అదుపులోకి తీసుకొని పౌరసరఫరాల శాఖ డీటీకి అప్పగించారు. అయితే ఈ ఘటనల్లో అసలు దందా చేసే వ్యక్తులను మాత్రం పోలీసులు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల రవాణా విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చే సరుకుల విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేయడం, రాష్ట్రాల సరిహద్దుల వద్ద అడ్డుకోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయమై గురువారం హోల్‌సేల్ వ్యాపారులు పౌర సరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డితో భేటీ అయ్యారు. నిత్యావసరాల ధరలు పెంచవద్దని ప్రభుత్వం విన్నవిస్తోందని, అయితే సరుకు రవాణా జరుగకుండా ధరల పెరుగుదలను అడ్డుకోవడం సాధ్యం కాదని వ్యాపారులు ఆయన దృష్టికి తెచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి చక్కెర, గుజరాత్ నుంచి ఉప్పు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ నుంచి శనగపప్పు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కందిపప్పు, రాజస్తాన్ నుంచి పెసరపప్పు, కృష్ణపట్నం, కాకినాడ, చెన్నై ఓడరేవుల నుంచి ముడి వంట నూనెలను నిరంతరం దిగుమతి చేసుకుంటున్నామని వ్యాపారులు తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద వీటిని అనుమతిస్తేనే ధరల పెరుగుదలను అడ్డుకోవచ్చని తెలిపారు. స్పందించిన కమిషనర్, ఎక్కడైనా చెక్‌పోస్టుల దగ్గర సరుకుల రవాణా వాహనాలను నిలిపివేస్తే డ్రైవర్ పేరు, నంబర్ తెలియజేస్తే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధిక ధరలకు విక్రయిస్తే పీడీ కేసులు లాక్‌డౌన్‌కు ముందున్న ధరల ప్రకారమే నిత్యావసరాలను విక్రయించాలని పౌరసరఫరాల కమిషనర్ సత్యనారాయణరెడ్డి సూచించారు. అధిక ధరలపై విజిలెన్స్ బృందాలు ప్రత్యేకంగా నిఘా వేసి ఉంచాయని, అధిక ధరలకు విక్రయిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
జి.మాడుగుల: విశాఖ జిల్లాలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జి.మాడుగుల ఉరుము జంక్షన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున 20 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పెద్దబయలు మండలానికి చెందిన జె.సాల్మన్‌రాజు, ప్రేమానందం స్థానికంగా 20 కిలోల గంజాయిని కొనుగోలు చేసి నర్సీపట్నం తరలించేందుకు బైక్‌పై వెళుతున్నారు. ఉరుము జంక్షన్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బైక్‌తోపాటు, 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు.