రంగారెడ్డి జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం
రంగారెడ్డి: నగరంలో దొంగల ముఠాల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నగర శివారు ప్రాంతాలను అనువుగా చేసుకుని జనసంచారం లేనిచోట దొంగలు దొంగతనాలకు పాల్పడుతూ బీభత్స సృష్టిస్తున్నారు. ఎవరైనా ప్రతిఘటిస్తే హత్య చేయడానికి కూడా దొంగలు వెనకాడట లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెదగొల్కొండలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో 30 తులాల బంగారం, వెండి నగదును దొంగలు అపహరించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో ముసుగులను ధరించి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు ఇంటి యజమానులను బెదిరించి తాళ్లతో కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. వారినుంచి విలువైన బంగారం, నగదును దోచుకెళ్లినట్టు బాధితులు వాపోయారు. దీంతో పరిసర ప్రాంతాల్లో దొంగలు సృష్టించే బీభత్సానికి జనం బెంబేలెత్తున్నారు.