breaking news
Tenali Rama Krishna
-
హాకీ ఎక్స్‌ప్రెస్
నిన్న కాక మొన్న విడుదలైన సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘నినువీడని నీడను నేను’తో మంచి సక్సెస్ సాధించారు. ఈ నెల 15న ‘తెనాలి రామకృష్ణ’ అంటూ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోమవారం స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ని ప్రారంభించి మంచి స్పీడు మీదున్నారు ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాకీ ఆట ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సందీప్ కిషన్ తొలిసారిగా నటిస్తున్నారు. సోమవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సందీప్, మురళీశర్మ, రఘుబాబులపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కెవిన్రాజు, ఎడిటింగ్: ఛోటా.కె. ప్రసాద్ -
ఆ అల్లుళ్లకు సలామ్!
పద్యానవనం అల్లుడు అభిమానస్తుడు అల్లునికి పనిచెప్పకూడదది చెప్పినచో, చిల్లర మూడే పనులట ఇల్లలుకను పేడదీయ ఇస్తరులెత్తన్. తెలుగు పద్యసాహిత్యంలో చాటువులకు సముచిత స్థానమే ఉంది. ఎవరు రాశారో తెలిసేది కొన్ని సందర్భాల్లోనే. కొన్నిమార్లు వారు రాశారో రాయలేదో కూడా ఇదమిద్ధంగా తెలియదు కానీ, ఫలానా వారు రాసిన చాటుపద్యమిది అని ప్రాచుర్యంలోకి వస్తుంది. ఆయా కవి పండితుల పలుకుబడిని బట్టి కూడా ఒకోసారి సదరు పద్యం ఎక్కువ ప్రచారానికి నోచుకుంటుంది. శ్రీనాథ కవిసార్వభౌముని విషయంలో ఇలాంటివి తరచూ వింటుంటాం. అలనాటి పల్నాటి పల్లె సీమల మీద ఆయన రాసినట్టుగా చెప్పే చాటు పద్యాలు అలా ప్రాచుర్యంలోకి వచ్చినవే! వేళాకోళానికి తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టు ప్రచారంలో ఉన్న చాటు పద్యాలకున్న ఆదరణ తక్కువేం కాదు. తరాలు మారినా సందర్భాన్ని బట్టి తరచూ వాడుకోవడానికి అతికినట్టు సరిపోయే చాటుపద్యాలుంటాయి. అవి, నవ్వు పుట్టిస్తూ, ఒకింత వ్యంగ్యం పండిస్తూ, సామాజిక వాస్తవికతకు అద్దం పడతాయి. కొన్ని చాటుపద్యాలు వస్తురీత్యా హాస్యం పుట్టించినా, వాస్తవికత పరంగా కాలదోషం పడ్తాయి. ఎవరు రాసిందో తెలియని ఈ పద్యం కూడా అదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు, ఆడపిల్లల తలిదండ్రులకు అల్లుళ్లతో నిద్రలేని రాత్రులుండేవి. కట్నకానుకలని, పెట్టిపోతలని, మర్యాద-మన్ననలని.... ఎన్ని వేధింపులుండేవో! అల్లుడొస్తున్నాడంటే, అత్తామామలకు ఒళ్లు జలదరించేది. గ్రహాలు పట్టి పీడించకూడదని, నవగ్రహదోష నివారణకు ప్రత్యేక పూజలు చేయడం మనందరికి తెలిసిందే. అయితే, ఆ తొమ్మిది గ్రహాలకు మించిన పవర్ఫుల్ గ్రహంగా అల్లున్ని పరిగణించారు గనుకే ‘జామాతా దశమగ్రహ’ అన్నారు. ఏది పట్టినా, పట్టకపోయినా... ఈ పదో గ్రహం పట్టకూడదని కోటి దేవతలకు మొక్కుకునేవారు. కొంతమంది అల్లుళ్లు అత్తారింటికి వచ్చి రోజులు, వారాలు దాటి నెలల తరబడి తిష్టవేసేవారు. అది భరించడం అత్తామామలకు కష్టమే అయ్యేది! ఇక ఇల్లరికపు అల్లుళ్లది మరో రకం కథ. వారి వారి అదృష్టాన్ని బట్టి, వారు కట్టుకున్న భార్యామణి తత్వం, నోటి గుణం, ఆ ఇంట్లో ఆమెకున్న పలుకుబడి-పట్టును బట్టి కూడా ఆయా అల్లుళ్ల యోగమో, రోగమో కుదిరేది. అలా ఇల్లరికానికి వచ్చిన అల్లుడి నోట్లో నాలుక లేకపోతే ఇక అంతే సంగతులు! బహుషా ఇటువంటి పరిస్థితులన్నింటి నుంచి పుట్టిందేనేమో ఈ పద్యం. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడో... అల్లుడు అభిమానస్తుడు కనుక అత్తారింట్లో ఆయనకి పెద్దగా పని చెప్పొద్దట! తప్పని పరిస్థితి తలెత్తి చెప్పాల్సి వస్తే మాత్రం, ఎటువంటి చిన్నా చితకా పనులు చెప్పొచ్చో వివరిస్తున్నాడు. ఇల్లలకడం, పశువుల కొట్టంలో పేడతీయడం, ఇంట్లో భోంచేసిన వారందరి విస్తరాకులెత్తడం... ఇదుగో, ఈ మూడు పనులే చెప్పాలట. దెబ్బకు పరారై తమ పుట్టింటికెళ్లిపోయేలా చేసే ఎత్తుగడ కాకపోతే మరేంటి! ఇక సీన్‌కట్ చేస్తే...... నవశకం అల్లుళ్లు! ముఖ్యంగా మన ఉద్యోగపు అల్లుళ్లు, అర్బన్ అల్లుళ్లు, కాస్త అర్థంచేసుకొని మసలే అల్లుళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. చక్కగా అత్తామామల బాగోగులూ వారే చూసుకుంటున్నారు. కొన్ని సార్లు కన్నకొడుకుల కన్నా వృద్ధాప్యంలో ఉన్న దంపతులకు కూతురి భర్తలే గంజినీళ్లు పోసే పరిస్థితులున్నాయంటే ఆశ్చర్యం లేదు. పద్ధతుల్లో, బాధ్యతల్లో, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులకిది సంకేతం. ఆనాడయినా, ఈనాడయినా తలిదండ్రులపైన కొడుకుల కన్నా కూతుళ్లకే ప్రేమ ఎక్కువ అనడంలో అణుమాత్రం సందేహం లేదు. అయితే, ఆ రోజుల్లో మహిళలకు ప్రేమున్నా ఆర్థిక స్వేచ్ఛ ఉండేది కాదు. అత్యధిక సందర్భాల్లో భర్తచాటు భార్యలుగానే ఉండేవారు. ఇప్పుడు కొంత ఆర్థిక స్వేచ్ఛ, అంతకు మించి సమానత్వ స్పృహ, భర్తలతో సరి సమానంగా బరువు బాధ్యతల్ని పంచుకోవడం... వంటివి పెరిగిన పరిస్థితుల్లో వారి ఆలోచనలకు, భావనలకు, మాటకు విలువ పెరిగింది. కొడుకులే లేని తలిదండ్రుల బాగోగుల్ని కూతుళ్లు స్వయంగా చూసుకుంటున్నారు. కొడుకులుండీ నిర్లక్ష్యం చేసినా, క్షోభపెట్టినా తానున్నానంటూ చొరవ తీసుకొని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. ఆ మేరకు భర్తలకు అవగాహన కలిగించో, అనునయించో ఈ విషయంలో సహకరించేలా చేసుకోగలుగుతున్నారు. ‘‘పున్నామ నరకాత్త్రాయతే ఇతి పుత్రః’’ అన్నారు. తనువు చాలించాక, తలిదండ్రుల్ని పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడో లేదో తెలియదు కాని, జీవిత చరమాంకంలో తోడు కోసం అలమటించే పండుటాకులకు భూలోక నరకాన్ని తప్పిస్తున్న కూతుళ్లకు... వాళ్లకు సహకరిస్తున్న అల్లుళ్లకు... సల్యూట్! - దిలీప్‌రెడ్డి