breaking news
Teachers strike
-
బంగ్లాలో నిరసనల హోరు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్‌తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.రాజకీయ గందరగోళంకొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్‌లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్‌కు ముందు కుదరదని సర్కారు అంటోంది.మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్‌కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు. -
డీఎడ్ పేపర్ వాల్యూయేషన్ బహిష్కరణ
సాక్షి, గుంటూరు : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీ ఎడ్) ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా విధులకు హాజరైన 130 మందికి పైగా ప్రైవేటు డీఎడ్ కళాశాలల అధ్యాపకులు గతేడాది డీఎడ్ ద్వితీయ సంవత్సర మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూరేషన్ బకాయిలను చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. రెమ్యూనరేషన్ బకాయిలు చెల్లించిన తరువాతే మూల్యాంకన విధుల్లో పాల్గొంటామని అక్కడే ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగ సహాయ కమిషనర్ మాణిక్యాంబకు స్పష్టం చేసి, వాల్యూయేషన్ విధులను బహిష్కరించారు. అనంతరం క్యాంప్ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా చీఫ్ ఎగ్జామినర్, ఎగ్జామినర్ విధులకు హాజరైన అధ్యాపకులు బి.వెంకటేశ్వరరావు, మరియదాసు, టి.దాసు, రాజ్‌కుమార్ మాట్లాడుతూ గతేడాది వాల్యూయేషన్ చేసిన అధ్యాపకులకు చెల్లించాల్సిన రెమ్యూనరేషన్ చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో విసిగి వేసారిన ఫలితంగా తాజాగా డీఎడ్ ప్రథమ సంవత్సర వాల్యూయేషన్ విధులను బహిష్కరిస్తున్నామని చెప్పారు. గతేడాది వాల్యూయేషన్ విధుల్లో పాల్గొన్న 177 మంది అధ్యాపకులకు డీఏతో పాటు పేపర్ వాల్యూయేషన్‌కు కలిపి మొత్తం రూ.9 లక్షలు చొప్పున చెల్లించాల్సి ఉందని తెలిపారు. డీఈవో హామీతో ఆందోళన విరమణ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో అధ్యాపకులు ఆందోళనకు దిగిన విషయాన్ని తెలుసుకున్న డీఈవో ఆర్.ఎస్.గంగా భవానీ అక్కడకు చేరుకున్నారు. అధ్యాపకులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గతేడాదికి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ చెల్లింపులు జరగని మాట వాస్తవమేనని, బకాయిలను 20 రోజుల్లోపు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన అధ్యాపకులు తిరిగి వాల్యూయేషన్ విధులకు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ వరకూ వాల్యూయేషన్ జరగనుంది. -
సీమాంధ్రలో మోగనున్న బడిగంట
సమ్మె విరమించిన సీమాంధ్ర టీచర్లు, అధ్యాపక జేఏసీలు సీఎం సమక్షంలో చర్చలు సఫలం.. నేటి నుంచి విధుల్లోకి వివరాలు వెల్లడించిన మంత్రి ఆనం విరమణ తాత్కాలికమే, అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధం: జేఏసీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్న డిమాండ్‌తో 50 రోజులుగా సమ్మె చేస్తున్న సీమాంధ్ర ఉపాధ్యాయ, అధ్యాపకులు ఇక విధుల్లో చేరనున్నారు. గురువారం రాత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో టీచర్ల, అధ్యాపక జేఏసీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తాత్కాలికంగా సమ్మె విరమణకు జేఏసీలు అంగీకరించాయి. దీంతో సీమాంధ్రలోని 1,61,500 టీచర్లతో పాటు లెక్చరర్లు, అధ్యాపకులు శుక్రవారం విధుల్లో చేరతారని చర్చల అనంతరం ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో చెప్పారు. వారు వెంటనే విధుల్లో చేరడానికి అవకాశం ఉన్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. దసరా సెలవుల అనంతరం క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపారు. సమ్మె కాలంలో వేతనాల చెల్లింపుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుందని, ఉద్యోగ భద్రతకు సీఎం హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వంతుగా పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు ఆనం తెలిపారు.రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆగస్టు 21 అర్ధరాత్రి నుంచి ఉపాధ్యాయులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యా సంవత్సరం నష్టపోకుండా, పరీక్షల్లో వెనుకబడకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉపాధ్యాయ, అధ్యాపక జేఏసీల నేతలు వెల్లడించారు. సమ్మె తాత్కాలికంగానే విరమించామని, సమైక్యాంధ్ర విషయంలో అవసరమైతే మళ్లీ సమ్మెకు సిద్ధంగా ఉంటామని ఆ జేఏసీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం విధుల్లో చేరినా తాము సమైక్యాంధ్ర నినాదాన్ని, ఆందోళనలను కొనసాగిస్తామని వెల్లడించారు. ఆందోళనల రూపం మార్చి రిలే నిరాహార దీక్షలు, గ్రామాల్లో చైతన్య కార్యక్రమాల్ని నిర్వహిస్తామన్నారు. సీఎం సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి పార్థసారథి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, సత్యనారాయణ రాజు, పుల్లయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో పాటు ఇతర అధికారులు రావత్, పూనం మాలకొండయ్య, వాణీమోహన్, ఉపాధ్యాయ, అధ్యాపక జేఏసీల ప్రతినిధులు కమలాకర్‌రావు, శివకుమార్, సుధాకర్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సమ్మె కొనసాగిస్తాం: వైఎస్సార్ టీఎఫ్ కేంద్ర ప్రభుత్వం నుంచి సమైక్య ప్రకటన వచ్చే వరకు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సమ్మె కొనసాగిస్తామని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రకటించింది. సమస్యకు పరిష్కారం లభించకముందే దాదాపు 50 రోజులుగా సాగుతున్న సమ్మె నుంచి ఉపాధ్యాయులు వెనక్కి తగ్గడం దురదృష్టకరమని పేర్కొంది. ఈ మేరకు వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి, స్టీరింగ్ కమిటీ సభ్యులు కే జాలిరెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, రియాజ్ ఉస్సేన్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు వాయిదా
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో పాఠశాల విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు వాయిదాపడ్డాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో అన్ని పాఠశాలలు మూతబడిన నేపథ్యంలో త్రైమాసిక పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పాఠశాలల్లో ఆగస్టులో నిర్వహించాల్సిన రెండవ యూనిట్ పరీక్షలను కూడా నిర్వహించలేదు. గత రెండు నెలలుగా విద్యార్థులకు తరగతులు సరిగా జరగడం లేదు. కొన్ని సబ్జెక్టుల్లో ఇప్పటి వరకు విద్యార్థులకు కేవలం ఒకటి, రెండు యూనిట్లు మాత్రమే పూర్తయ్యాయి. విద్యార్థులకు తరగతులు నిర్వహించకపోవడం, సిలబస్ పూర్తి చేయకపోవడం వలన జరిగే నష్టం కంటే రాష్ట్ర విభజన వల్ల కలిగే నష్టమే ఎక్కువ అంటూ ఉపాధ్యాయులు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. దీంతో విద్యార్థులు కూడా పాఠశాలలకు దూరమయ్యారు. 4.36 లక్షల మందికి పరీక్షల్లేవ్.. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 4.36 లక్షల మంది విద్యార్థులు త్రైమాసిక పరీక్షలకు దూరమవుతున్నారు. ప్రతి విద్యాసంవత్సరంలో సెప్టెంబర్ నెలలో విద్యార్థులకు త్రైమాసిక పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు అనంతరం విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటిస్తారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1.80 లక్షల మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 20 వేల మంది, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 50 వేల మంది 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు 1.86 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 24 ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల మంది, 301 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 83 వేల మంది, 43 ఎయిడెడ్ పాఠశాలల్లో 9 వేల మంది, 7 మున్సిపల్ పాఠశాలల్లో 2,700 మంది, 256 ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 65 వేల మంది, 10 మోడల్ స్కూళ్లు, 9 కేజీబీవీల్లో 4 వేల మంది చదువుతున్నారు. 443 యూపీ పాఠశాలల్లో 12 వేల మంది 6,7 తరగతులు చదువుతున్నారు. వీరందరికీ ప్రస్తుతం త్రైమాసిక పరీక్షలు నిర్వహించడం లేదు. అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు జిల్లాలోని అన్ని యాజమాన్యాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన త్రైమాసిక పరీక్షలు ఉపాధ్యాయుల సమ్మె కారణంగా వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రాజేశ్వరరావు తెలిపారు. త్రైమాసిక పరీక్షలు దసరా సెలవుల అనంతరం ఎప్పుడు నిర్వహించేది తేదీలు ప్రకటిస్తామన్నారు. అన్ని పాఠశాలలకు అక్టోబర్ 4 నుంచి 15వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 16వ తేదీన బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు, దీంతో దసరా సెలవుల అనంతరం 17న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని డీఈఓ తెలిపారు.