
యూనస్ సర్కారుపై జనాగ్రహం
దేశవ్యాప్త సమ్మెకు దిగిన టీచర్లు
ఇప్పటికే పౌర సేవకుల ఆందోళనలు
ఢాకా: బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. ముహమ్మద్ యూనస్ తాత్కాలిక సర్కారుపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే సైన్యం నుంచి తీవ్ర రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న సర్కారుకు ఇది రోకటిపోటుగా పరిణమించింది. పౌర సేవకుల సమ్మె నాలుగో రోజుకు చేరగా వేతన పెంపు డిమాండ్‌తో టీచర్లు కూడా నిరసన బాట పట్టారు.
వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. మే 5 నుంచి పాక్షికంగా పని చేస్తున్నవారు కూడా సోమవారం నుంచి పూర్తిగా విధులు నిలిపేశారు. దీనిపై యూనస్ సర్కారు మండిపడింది. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ సోమవారం రాత్రి ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు.
రాజకీయ గందరగోళం
కొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్‌లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతుండగా 2026 జూన్‌కు ముందు కుదరదని సర్కారు అంటోంది.
మరోవైపు కీలక సంస్కర ణలకు పార్టీలు మద్దతివ్వకపోవడంతో యూనస్ అలిగా రు. రాజీనామా చేస్తానని బెదిరించినా తర్వాత వెనక్కు తగ్గారు. అధికారాన్ని నిలుపుకోవడానికే తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలను ఆలస్యం చేస్తోందంటూ బేగం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఢాకాలో భారీ నిరసనలకు దిగింది. దాంతో యూనస్‌కు మద్దతుగా ఆయన అనుయాయులు విద్యార్థుల సారథ్యంలో మే 24న మార్చ్ నిర్వహించారు.