రాజయ్యకు స్వైన్ఫ్లూ దెబ్బ?
తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ విపరీతంగా వ్యాపించింది. రాష్ట్రంలో 893 మందికి అనుమానంతో స్వైన్ ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేయించగా.. వారిలో 299 మందికి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం అధికారికంగానే 12 మంది ఇప్పటివరకు ఈ వ్యాధితో మరణించారు. వైద్య ఆరోగ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న డాక్టర్ తాటికొండ రాజయ్య, ఈ విషయాన్ని అంత తీవ్రంగా పరిగణించలేదేమోనన్న వాదనలు వినిపించాయి.
బహుశా అందుకే ఆయన మంత్రిపదవిపై వేటు పడిందేమోనని అంటున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి విషయం కూడా చర్చనీయాంశమే అయ్యింది. వైద్య ఆరోగ్యశాఖలోని అధికారులందరినీ అక్కడి నుంచి తప్పించి.. చివరకు రాజయ్యను కూడా తప్పించారు. అయితే, తాను మంత్రిపదవికి రాజీనామా చేయలేదని.. రాజీనామా చేయాల్సిన అవసరం కూడా తనకు లేదని రాజయ్య అంటున్నారు. ఆయన అనుచరులు కూడా ఈ అవమానంపై ఆందోళనకు దిగుతున్నారు.