breaking news
suprabha
-
ఆ అడవికి అమ్మలు వీరు
‘ఇది ఒక నోవా పడవ’ అని 3 ఎకరాల స్థలంలో శాంక్చురీ స్థాపిస్తున్నప్పుడు వాళ్లు అనుకున్నారు. కాకుండా అది వృక్షజాలానికి నోవా పడవ. పశ్చిమ కనుమల్లోని రెయిన్ ఫారెస్ట్‌ల క్షీణతవల్ల అంతరించిపోతున్న అరుదైన మొక్కలను చెట్లను కాపాడి దాచి పెట్టడమే ఈ నోవా పడవ లక్ష్యం. ఇవాళ కేరళలోని వేనాడు ప్రాంతంలో ‘గురుకుల బొటానికల్ శాంక్చరీ’ పేరుతో దాదాపు 50 ఎకరాల వరకూ విస్తరించిన ఈ అభయారణ్యం పూర్తిగా స్త్రీల నిర్వహణ, రక్షణలో ఉంది. 27 మంది స్త్రీలు ఇక్కడ పని చేస్తారు. ప్రకృతిని శ్వాసింప చేస్తున్నారు. 1980లలో కేరళలోని వేనాడు ప్రాంతంలోని నది నీళ్లల్లో మొదటిసారిగా కొట్టుకుని వచ్చిన ప్లాస్టిక్ కవర్‌ను చూసి ‘నాగరికత ఇక్కడి దాకా వచ్చేసింది’ అన్నాడతను. అతని పేరు ఓల్ఫ్‌గాంగ్ టియర్‌కాఫ్. జర్మన్ పౌరుడు. బొటానిస్ట్. కేరళలోని నారాయణ గురు బోధనల గురించి విని జర్మనీ వదిలి కేరళ వచ్చేశాడు. 1980లో భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు. 2014లో మరణించాడు. కాని ఈ మధ్య కాలం అంతా అతడు చేసింది స్త్రీలకు ఒక అభయారణ్యం అప్పజెప్పడమే. ఉత్తర వేనాడులోని అలాత్తిల్ అనే గ్రామం దగ్గర 1981లో ఐదు ఎకరాల ‘గురుకుల బొటానికల్ శాంక్చురీ’ పేరుతో అభయారణ్యాన్ని మొదలుపెడుతూ దానిని ‘నోవా పడవ’ అని పిలిచాడతడు. (జలప్రళయానికి ముందు ప్రవక్త నోవా అన్ని జాతుల జంటలను ఒక నావలో చేర్చాడు. దానినే నోవా పడవ అంటారు) అక్కడ పని చేసే స్త్రీలను పిలిచి ‘పశ్చిమ కనుమల్లోని వర్షపాత అడవుల్లో చాలా అరుదైన వృక్షజాతులు నాగరికుల ఆక్రమణ వల్ల అంతరించిపోతున్నాయి. వాటిని మనం ఈ అడవిలో దాచిపెట్టి కాపాడుకోవాలి’ అన్నాడు. అడవిని పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ కాపాడతారని అతని నమ్మకం. దాపునే ఉన్న పెరియా అనే ఊరి నుంచి లీలా అనే మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె ఆ అడవికి మొదటి రక్షకురాలు. ఆ తర్వాత సుప్రభ శేషన్ అనే పర్యావరణ ప్రేమికురాలు చాలా కాలంగా దానికి డైరెక్టర్‌గా పని చేస్తోంది. గత నలభై ఏళ్లుగా స్త్రీలే ఈ అడవిని కాపాడుతూ ప్రస్తుతం 63 ఎకరాల అభయారణ్యం చేశారు. ఇప్పుడు అక్కడ ఉన్న స్త్రీల సంఖ్య 27. ఐసియు వార్డ్ ‘ఇది అభయారణ్యం కాదు. ఒక ఆస్పత్రి అనుకోండి. కొన ఊపిరితో ఉన్న వృక్షజాలాన్ని కాపాడే ఆస్పత్రి’ అంటుంది సుప్రభ శేషన్. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆమె బాల్యంలోనే పర్యావరణ రంగంలో పని చేయాలని నిశ్చయించుకుంది. లండన్‌లో డిగ్రీ చేసిన తర్వాత ఈ అభయారణ్యం గురించి విని మరో ఆలోచన లేకుండా ఇక్కడికొచ్చి 1991 నుంచి పని చేస్తోంది. ‘కలిసి శ్వాసిద్దాం’ అనేది మా నినాదం అంటుందామె. మనుషులు కార్బన్ డై ఆక్సైడ్‌ని విసర్జిస్తారు. చెట్లు అవి పీల్చుకుంటాయి. అవి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మనం పీలుస్తాం. దీనిని ‘కలిసి శ్వాసించడం’ అనాలి. అవి లేకపోతే మనం మనం లేకపోతే అవి లేవు. ఇద్దరం మనగలగాలి ఈ భూమ్మీద అంటుందామె. అడవులంటే ఏవో చెట్లు కాదు... క్రిములు కీటకాలు పక్షులు నీళ్లు జలచరాలు జంతువులు నాచు తేమ... ఇవన్నీ అడవిలో భాగం... అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారితం. టీ ఎస్టేట్ల కోసమో... పొగాకు పంట కోసమో... మరో ఆవాసం కోసమో అడవుల్ని నరుక్కుంటూ పోతే అవన్నీ నశించిపోతాయి... ఆ తర్వాత మనుషులు కూడా’అంటుంది సుప్రభ. పశ్చిమ కనుమల్లోని అంతరించిపోతున్న చిన్న, పెద్ద మొక్కలు, చెట్లు వీటిని సేకరించి ఈ అభయారణ్యానికి తీసుకు వస్తారు. వాటిని మొదట ఐసియు వార్డ్‌లో పెడతారు. అంటే అవి బతికి బట్టకట్టాలన్న మాట. ఆ తర్వాత వాటిని జనరల్ వార్డ్‌లోకి తీసుకొస్తారు. అంటే బయటకు. ఆ తర్వాత వాటిని డిశ్చార్జ్ చేస్తారు. అంటే అడవిలో నాటుతారు. ఇక అక్కణ్ణుంచి అవి పెరుగుతాయి. ఈ పని అంతా స్త్రీల అజమాయిషీలో జరుగుతుంది. కాందిశీకులకు ఆశ్రయం ఏ నేలా లేనివారు కాందిశీకులు అవుతారు. అడవిని కోల్పోయిన చెట్లు కూడా కాందిశీకులు అవుతాయి. అలాంటి కాందిశీకులను చేరదీసి ఈ అడవిలో పెంచటం కూడా గురుకుల బొటానికల్ శాంక్చురీ పని. ‘మనుషులు తాము మాత్రమే బతకడానికి పని చేస్తున్నాం అని అనుకుంటారు. కాని చెట్లు, అడవులు కూడా తమ ప్రాణాలు నిలుపుకోవడానికి, ప్రకృతిని శుభ్రపరచడానికి విపరీతంగా పని చేస్తాయి. వాటి పని మనకు కనపడదు’ అంటుంది లీల. ఆమె ఆ శాంక్చురీ వ్యవస్థాపకుడి భార్య. నలభై ఏళ్లుగా అక్కడే ఉంటున్న ఆమెకు ఏ మొక్క, ఏ చెట్టు ఎంత ముఖ్యమైనదో కచ్చితంగా తెలుసు. ‘అడవి ఉంటే పక్షుల ఆర్కెస్ట్రా ప్రతి ఉదయం వినొచ్చు. అడవి ఉంటే రంగు రంగుల సీతాకోక చిలుకల నృత్యం చూడొచ్చు’ అంటుందామె. ‘మనిషి మాత్రమే డబ్బిచ్చి ఆహారం కొనుక్కుంటాడు. ఇక ఏ జీవీ ఏ జంతువూ ఏ జలచరమూ ఏ కీటకమూ డబ్బిచ్చి తమ ఆహారం కొనుక్కోదు. ప్రకృతితో మనిషి విడిపోవడం వల్ల ఆహారం కొనుక్కునే అవసరం ఏర్పడింది. ప్రకృతితో పాటు ఉంటే అదే ఆహారం ఇస్తుంది’ అంటుందామె. ‘నిర్ణయించుకోండి... ఈ భూమి ఫ్యాక్టరీలతో నిండాలా... అడవులతో నిండాలా’ అని నిలదీస్తుంది. కలిసి మెలిసి జీవనం బిడ్డలకు జన్మనివ్వడం తెలిసిన ఈ స్త్రీలు ఇక్కడ మొక్కలను పసిబిడ్డల వలే కాచుకోవడం చూడొచ్చు. వీరందరు కలిసి మెలిసి వొండుకుంటారు. కలిసి మెలిసి భోజనం చేస్తారు. కొందరు అక్కడే ఉన్నా కొందరు బయట ఊళ్లో ఉన్నా ఆ అడవి మాత్రం అచ్చం వారిదే. ఇలాగే స్త్రీలకు అడవి కోసం భూమిని అప్పజెప్తే మరిన్ని నోవా పడవలు సిద్ధం అవుతాయని తప్పక ఆశించవచ్చు. మనమూ వెళ్లొచ్చు కేరళలోని ఈ ‘గురుకుల బొటానికల్ శాంక్చురీ’తో పాటు కర్ణాటక, తమిళనాడుల్లో కొన్ని ప్రయివేటు అభయారణ్యాలు ఉన్నాయి. వీరంతా అంతర్గత అనుసంధానంలో ఉంటారు. వీరు తమ అభయారణ్యాల్లో మూడు నుంచి ఆరు నెలలు ఉంచుకొని ‘ఎకొలాజికల్ నర్చరెన్స్’ పేరుతో ప్రకృతిలో పరస్పరాధారిత జీవ వికాసాన్ని అర్థం చేయిస్తారు. అడవులను ఎలా కాపాడుకోవాలో చెబుతారు. ఈ అప్రెంటిస్‌షిప్ కోసం చేరి గురుకుల బొటానికల్ శాంక్చురీలో పని చేసే యువత ఎందరో ఉన్నారు. ‘ఇది కాకుండా డే టూర్లు, వీక్లీ టూర్లు కూడా మా దగ్గర ఉన్నాయి’ అంటుంది సుప్రభ శేషన్. -
ఆ ఇద్దరితో ఊరు ఖాళీ
తమిళసినిమా: గ్రామాల్లో ఎవరైనా తప్పు జేస్తే వారిని గ్రామ ప్రజలు వెలి వేస్తారు. కుల మతాల కారణంగా ప్రేమ జంటలు ఒక్కోసారి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటారు. అయితే ఒక ప్రేమజంట కారణంగా ఆ గ్రామ ప్రజలే ఊరు వదిలి వెళ్లిపోయిన ఇతివృత్తంతో రూపొందిన చిత్రం నాడోడి కనవు. ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. వీరసెల్వ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేంద్రన్ కథానాయకుడిగా నటించారు.ఈయన బాల నటుడిగా దక్షిణాది భాషలన్నింటిలోనూ అనేక చిత్రాల్లో నటించారన్నది గమనార్హం. నాయకిగా సుప్రజ నటించిన ఇందులో క్రేన్‌మనోహర్, విజయ్గణేశ్, కే.రాజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు. సబేష్ మురళి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత కథా చిత్రం అన్నారు. అసలు ఒక ప్రేమజంట కారణంగా గ్రామ ప్రజలే ఊరు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఆ తరువాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది లాంటి ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం నాడోడి కనవు అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను శివగంగై, చెన్నై పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని, చిత్రాన్ని ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు వెల్లడించారు.