breaking news
sunil varma
-
'నా భక్త కన్నప్ప.. ఓ లవ్ స్టోరీ'
అలనాటి భక్త కన్నప్ప సినిమా అంటే.. అరివీర శివభక్తుడిగా కనిపించే కృష్ణంరాజు గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు అదే పేరుతో తాను హీరోగా రూపొందుతున్న సినిమా మాత్రం భక్తి సినిమా కాదని, ఓ గిరిజన ప్రేమకథా చిత్రమని సునీల్ చెబుతున్నాడు. అందులో వినోదం కూడా కావల్సినంత ఉంటుందంటున్నాడు. తాను ఈ సినిమాలో ఓ గిరిజనుడి పాత్ర పోషిస్తున్నానని, గ్రామీణ ప్రాంతంలో అందంగా సాగిపోయే ప్రేమకథ ఇందులో ఉంటుందని చెప్పాడు. ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. మరో రెండు పెద్ద సినిమాల్లో కూడా సునీల్ చేయబోతున్నాడు. నిజానికి హీరో అయినప్పటి నుంచి తాను నటిస్తున్న సినిమాల సంఖ్య గణనీయంగా పడిపోయిందని, ఇప్పుడు కనీసం ఏడాదికి ఒక సినిమా పూర్తి చేయడం కూడా కష్టమే అవుతోందని చెప్పాడు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపాడు. విక్కీ దర్శకత్వంలో ఒకటి, రచయిత గోపీమోహన్ దర్శకత్వంలో మరొక సినిమా ఈసారి చేస్తానని చెప్పాడు. 2010లో రాజమౌళి తీసిన మర్యాదరామన్నతో కమెడియన్ సునీల్ హీరోగా మారాడు. -
విలన్ పాత్ర చేస్తానంటున్న సునీల్!!
సునీల్ అనగానే ఒక్కసారిగా పెదాలమీదకి నవ్వు ఆటోమేటిగ్గా వచ్చేస్తుంది. ఈ మధ్య కాలంలో సిక్స్ ప్యాక్ బాడీతో హీరో పాత్రలు చేసినా ఇప్పటికీ సునీల్ తన నవ్వులతోనే ఎక్కువగా అలరిస్తున్నారు. అలాంటి సునీల్.. ఇప్పుడు కొత్తగా విలన్ పాత్ర పోషించాలని భావిస్తున్నాడు. మంచి అవకాశం వస్తే తప్పకుండా విలన్ పాత్ర చేస్తానని చెబుతున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం అంటే తనకు చెప్పలేనంత అభిమానం ఉందని, ఆయన సినిమాల్లోనే విలన్గా కూడా చేయాలని ఉందని చెప్పాడు. ఇంతవరకు తనకా అవకాశం రాలేదు గానీ, మర్యాద రామన్న చిత్రంతో తనను హీరో చేసింది కూడా ఆయనేనని సునీల్ గుర్తుచేశాడు. ఇప్పుడు రాజమౌళి చిత్రంలో విలన్గా చేసే అవకాశం వచ్చిందంటే మాత్రం తప్పకుండా సంతోషంగా విలన్గా చేస్తానని సునీల్ అన్నాడు. ఇతర సినిమాల్లోనైనా విలన్గా చేయడానికి తనకు అభ్యంతరం లేదని, అయితే మంచి పాత్ర మాత్రం కావాలని తెలిపాడు. నువ్వు నాకు నచ్చావు, నువ్వు నేను లాంటి సినిమాల్లో కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన సునీల్, గత రెండేళ్లలో తడాఖా, మిస్టర్ పెళ్లికొడుకు చిత్రాల్లో హీరో పాత్రలు చేశాడు. మొదట్లో కమెడియన్ పాత్రలు పోషించేటప్పుడు ఏడాదికి పది సినిమాలు చేసేవాడినని, కానీ ఇప్పుడు హీరోగా మాత్రం గట్టిగా రెండు సినిమాలు కూడా చేయలేకపోతున్నానని సునీల్ అంటున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేశాననేదానికన్నా ప్రేక్షకులు తనను ఎంతగా ఆదరించారన్నదే ముఖ్యమని చెబుతున్నాడు. ప్రస్తుతం సునీల్ 'భక్త కన్నప్ప' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.