ప్రముఖ నటి సుచిత్రా సేన్ కన్నుమూత
కోల్‌కతా : ప్రఖ్యాత బెంగాలీ నటి మూన్ మూన్ సేన్ తల్లి సుచిత్రా సేన్ (82) శుక్రవారం కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్)తో బాధపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ 23 నుంచి సేన్ కోల్‌కతాలోని బెల్లే వ్యూ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతున్నారు.
ఈ నెల 3వ తేదీన సుచిత్రా సేన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో క్రిటికల్ కేర్ యూనిట్(సీసీయూ)లో వైద్యులు చికిత్స అందించారు. అప్పటి నుంచి సేన్ వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నారు. కుమార్తె మూన్‌మూన్ సేన్, మనవరాళ్లు రియా, రైమా ఆస్పత్రిలో ఉంటూ ఆమెను చూసుకుంటున్నారు.
1952లో ‘శేష్ కొతాయ్’తో నట జీవితాన్ని ప్రారంభించిన సుచిత్రా సేన్ 2005లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అందచందాలతో అద్భుతమైన నటనతో ఒకప్పుడు బెంగాలీ చిత్రసీమను ఏలిన సుచిత్రా సేన్ 1972లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 1970లో నటనకు గుడ్‌బై చెప్పిన సుచిత్రా సేన్ అప్పటినుంచి...అభిమానులకు దూరంగా వుంటున్నారు. బొంబయి కా బాబు, మమతా, దేవదాస్, ఆంధీలాంటి హిందీ చిత్రాలతోపాటు దేవదాసు బెంగాలీ చిత్రంలో ఆమె నటనకు అప్పట్లో అభిమానులు జేజేలు పలికారు. 1978 లో ఆమె ప్రణయ్ బాషా అనే బెంగాలీ చిత్రంలో చివరిసారిగా నటించారు.
దేవదాసు చిత్రంలో నటనకుగానూ ఆమో ఉత్తమనటి అవార్డు అందుకున్నారు. హిందీలో ఆమె ఇందిరాగాంధీ జీవిత కథను పోలిన ‘ఆంధీ’ అనే చిత్రంలో నటించారు. అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో అవార్డు పొందిన తొలి బెంగాలీ నటి కూడా ఆమె. సప్తపది అనే చిత్రానికి గాను మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటి అవార్డు లభించింది. కోల్‌కతా ప్రభుత్వం ఆమెను ‘వంగ విభేషణ్’ అవార్డుతో సత్కరించింది.