సాహిత్యం తోడైతేనే సంగీతానికి రాణింపు
గాయని ఎస్పీ శైలజ
రాజమండ్రి కల్చరల్ : సాహిత్యం తోడైతేనే సంగీతవ రాణిస్తుందని ప్రముఖ గాయని ఎస్పీ శైలజ అన్నారు. బుధ, గురువారాల్లో జరగనున్న సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి నగరానికి వచ్చిన ఆమె బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. సంగీత సాహిత్యాలు పార్వతీపరమేశ్వరులవంటివని, వాటిని విడదీయలేమనిఅన్నారు. నటిని కావాలని ఎన్నడూ అనుకోలేదని, నటిగా ‘సాగర సంగమం’ తన మొదటి, చివరి సినిమా అని అన్నారు. 1977లో ‘మార్పు’ సినిమాలో ‘ఇద్దరం, మేమిద్దరం’ సినిమాల కోసం పాడిన తొలిపాటని, ఇప్పటి వరకు తెలుగు, తమిళం,కన్నడం, మలయాళ భాషల్లో సుమారు 5 వేలపాటలు పాడానని చెప్పారు. హిందీలో కూడా రెండు పాటలు పాడానని, ‘సాగరసంగమం’లో ‘వేదం..’ పాట తనకు చాలా ఇష్టమని చెప్పారు. ఒకప్పుడు వాయిద్యాలు పాటను మింగేసేలా కాక పాటకు అనువుగా ఉండేవని, ఇప్పుడు వాటి మోత పెరిగిపోయిందని అన్నారు. ఈ పరిస్థితికి ఎవరినీ నిందించలేమన్నారు. అయితే, కొన్ని మంచి పాటలు ఇప్పుడూ వస్తున్నాయన్నారు. బాపు, కె.విశ్వనాథ్, జంధ్యాల వంటి దర్శకుల సినిమాలు నిత్యనూతనాలని, వాటిని చూస్తూ బతికేయవచ్చని అన్నారు.
నర్సరీని సందర్శించిన మలేసియూ బృందం
కడియం : స్థానిక శ్రీ సత్యదేవ నర్సరీని మలేసియా పామ్ ఆయిల్బోర్డు అధికారుల బృందం బుధవారం సందర్శించింది. డాక్టర్ మెలినా అబ్దుల్లా నేతృత్వంలోని బృందానికి కడియం నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు స్వాగతం పలికారు. స్థానిక నర్సరీల్లో లభ్యమయ్యే వివిధ రకాల మొక్కలను గురించి రైతు పుల్లా రామకృష్ణ వారికి వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగిలోని పామాయిల్ సెంటర్ను సందర్శించేందుకు వచ్చిన తాము నర్సరీలను చూసేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈ బృందంలో డాక్టర్ మహ్మద్డీన్, డాక్టర్ యాకోబ్లతో పాటు రాజమండ్రికి చెందిన ఎన్.మల్లికార్జున్, స్థానిక రైతులు ఉన్నారు.