ఐఎస్ఎల్ చెల్లింపులకే తొలి ప్రాధాన్యం
సాక్షి, కరీంనగర్ : నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద చేపట్టిన వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపులకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్టు జిల్లా నీటియాజమాన్య సంస్థ ఇన్చార్జి డెరైక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ తెలిపారు. మెటీరియల్ కాంపోనెంటు 40 శాతంకన్నా ఎక్కువయిన చోట్ల సర్పంచులతో చర్చించి గ్రామాల్లో పనిదినాలు కల్పించేలా చూస్తున్నామని వివరించారు.
ఇలాంటి చోట్ల పంచాయతీ డంపుయార్డుల ఏర్పాటు తదితర పనులు తీసుకుని పనిదినాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు రెండువందల గ్రామాల్లో ఇలాంటి సమస్య ఉందని, అన్ని గ్రామాల్లో వీలైనంత త్వరగా బిల్లులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్మార్ట్‌కార్డులు లేక నిలిచిపోయిన బిల్లులను సైతం చెల్లిస్తున్నామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదు రాగానే ఈ బృందం గ్రామానికి వెళ్లి లబ్ధిదారులకు బిల్లులు అందేలా చూస్తోందని వివరించారు.