రోడ్డుపై, కాలేజీ గోడలపై అలా రాశాడు.. భయపడిపోయా: నటి
కాలేజీ రోజుల్లో తనకు ఎదురైన ఓ భయంకరమైన సంఘటన గురించి బుల్లితెర నటి శుభాంగి ఆత్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆమె ఇంటర్ చదవుతున్న రోజుల్లో ఓ వ్యక్తి రోజు బైక్పై ఫాలో అయ్యేవాడని.. అతని చర్యలు చూసి భయపడిపోయానని శుభాంగి చెప్పింది.‘నేను ఇండోర్లో 10-11వ తరగతి చదవుతున్నప్పుడు ఓ వ్యక్తి రోజు బైక్పై మమ్మల్ని ఫాలో అయ్యేవాడు. కాలేజీ గోడలపై, రోడ్డుపై నా పేరు, తన పేరు కలిపి రాసేశాడు. మా ఇంటికి ఎదురుగా ఉన్న గోడపై కూడా అలానే రాశాడు. నేను అతనితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కానీ మా వెనకే తిరిగేవాడు. ఓ సారి మా అక్క అతనితో మాట్లాడింది. ‘ఇలా తిరడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. ఏదైనా సాధించి రా.. అప్పుడు మనం మాట్లాడుకుందాం’అని చెప్పింది. కొన్నాళ్ల తర్వాత అతను కనిపించకుండా పోయాడు. ఇలాంటి వేధింపులు ఆడపిల్లలను చాలా భయానికి గురి చేస్తాయి. బయటకు కూడా రాలేరు. ఇంట్లో వాళ్లు కూడా భయపడతారు. వేధింపులపై మహిళలు, యువతులు మౌనంగా ఉండకూడదు. ధైర్యంగా ఎదురు తిరగాలి. నేటి తరం అమ్మాయిలు తమ రక్షణ విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించడం మంచి పరిణామం’ అని శుభాంగి అన్నారు.‘కసౌతీ జిందగీ కే' అనే సిరియల్తో సీనీ కెరీర్ని ప్రారంభించిన శుభాంగి ఆత్రే.. 2007లో వచ్చిన 'కస్తూరి' అనే ధారవాహికతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత 'భాబీజీ ఘర్ పర్ హై!'లో అంగూరి భాభీ పాత్ర పోషించి బాగా పేరు సంపాదించింది. చిడియా ఘర్, అధురి కహానీ హుమారీ, హవన్, దో హాన్సన్ కా జోడా వంటి షోలలో కూడా నటించింది.