breaking news
shiva swami
-
మాలలు తీసేందుకు వెళ్తే.. అప్పికొండ శివాలయానికి తాళం!
విశాఖ : మాలలు తీసేందుకు అప్పికొండ శివాలయానికి వెళ్లిన శివస్వాములకు చేదు అనుభవం ఎదురైంది. శివస్వాములు మాలలు తీసేందుకు కనీస ఏర్పాట్లు చేయడాన్ని పక్కకు పెట్టిన అధికారులు.. ఏకంగా ఆలయానికే తాళాలు వేశారు. 41 రోజుల దీక్ష అనంతరం అప్పికొండ దేవాలయంలో మాలలు తీయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే శివ స్వాములు మాలలు తీయడానికి వెళ్తే ఆలయ అధికారులు శివాలయానికి తాళం వేసేశారు. దాంతో అధికారులు, పోలీసుల తీరుపై శివస్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాములకు కనీస సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని శివస్వాములు మండిపడుతున్నారు. ఆచారం ప్రకారం పూజలు చేసుకోనివ్వడం లేదని, దేవాదయ, పోలీస్ శాఖ వారు దుర్మార్గంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏ అధికారి పర్యవేక్షిస్తున్నారో కూడా తెలియదని, ఈ విధంగా వ్యవహరించడం దారుణమని అధికారుల తీరును తప్పుబట్టారు. -
పనిచేయని షవర్లు, పంపులు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, షవర్ బాత్‌ల వద్ద నీళ్లు రావడంలేదని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శివస్వాములు ధర్నా చేశారు. శుక్రవారం నీటి సరఫరాలో సమస్య తలెత్తుతుండటంతో స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆర్టీసీ బస్టాండ్ వెనుక శివదీక్ష శిబిరాల సమీపంలో ఏర్పాటు చేసిన స్నానపు గదులు, మరుగుదొడ్ల వినియోగానికి రూ.30 చొప్పున బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు, నీటి సరఫరా ఏఈలు ధర్నా చేస్తున్న శివ స్వాముల వద్దకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వెనుక శివదీక్ష శిబిరాల వైపు సర్వతోభద్రవనం పక్కన ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, షవర్ బాత్‌లను పరిశీలించి నీటి సమస్యను పరిష్కరించారు. మరుగుదొడ్ల వినియోగానికి టెండర్ నిబంధనల మేరకు రూ.10 మాత్రమే వసూలు చేయాలని అధికారులు హెచ్చరించారు. అధికంగా వసూలు చేస్తే టెండర్‌ను రద్దు చేస్తామన్నారు. కాగా రెండు రోజులు క్రితం వరకు మరుగుదొడ్ల వద్ద ఉచితం అని రాసి ఉందని, ఆ తర్వాత బోర్డును తొలగించేసి డబ్బులు వసూలు చేస్తున్నారని శివ స్వాములు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఇంజనీరింగ్ అధికారులు దేవస్థానం శానిటేషన్ అధికారులను సంప్రదించి మరుగుదొడ్లను, స్నానపు గదులను టెండర్ ప్రాతిపదికన ఇచ్చారా లేక ఉచిత పద్ధతిన ఏర్పాటు చేసినవా నిర్ధారించుకొని ఎలాంటి రుసుము చెల్లించవద్దని శివ స్వాములకు సూచించడం గమనార్హం. -
వీఐపీ ఘాట్‌లో ఉండాల్సిన సీఎం.. : శివస్వామి
సాక్షి, అమరావతి : గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాటకు కారణాలు వివరిస్తూ సోమయాజులు కమిషన్ ఇచ్చిన నివేదికను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి తప్పుపట్టారు. భక్తుల మూఢనమ్మకాలు, పంచాంగ కర్తలు, స్వామిజీలు, మీడియా వల్లే గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగిందంటూ నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. గోదావరి పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఆ వ్యవహారాన్ని దాచేందుకే.. పుష్కరాల కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారన్న శివస్వామి.. పుష్కరాల్లో బోయపాటి శ్రీను డాక్యుమెంటరీ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయినా పుష్కరాల సమయంలో వీఐపీ ఘాట్‌లో ఉండాల్సిన ముఖ్యమంత్రి సామాన్యులు స్నానం చేసే ఘాట్‌లో ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈ ఘటనను స్వామిజీలు, మీడియాపైకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలదే తప్పు అన్నట్లుగా కమిషన్ నివేదిక ఇవ్వడాన్ని స్వామిజీల తరపున ఖండిస్తున్నామన్నారు. కాగా 2015లో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన తొక్కిసలాటకు అతి ప్రచారమే కారణమని జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.


