breaking news
Share of water
-
హక్కుగా 90 టీఎంసీల అదనపు వాటా!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లో అదనంగా వచ్చే నీటి వాటాలను సాధించుకునేందుకు బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గట్టిగా పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు జరిగే సమావేశాల్లో అదనపు నీటి వాటాలు కోరేలా వాదనలు సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికి రావాల్సిన 90 టీఎంసీల నీటి వాటాను లేవనెత్తనుంది. కృష్ణా బేసిన్ పరిధిలో పర్యటించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ నేతృత్వంలోని బృందం ఈ మేరకు కృష్ణా జల వివాదాలపై ట్రిబ్యునల్ ముందు చేపట్టాల్సిన వాదనలపై కసరత్తు పూర్తి చేసింది. ఏపీ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు రాగానే ఎగువ రాష్ట్రాలకు అంతే పరిమాణంలో నీటి హక్కులు సంక్రమిస్తాయని, ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో కర్ణాటకకు 22 టీఎంసీలు, మహారాష్ట్రకు 13 టీఎంసీలతోపాటు తమకు 45 టీఎంసీలు హక్కుగా వస్తాయని రాష్ట్రం పేర్కొంటోంది. ఇదే బచావత్ అవార్డులో పోలవరం కాకుండా మరేదైనా ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలిస్తే అంతే పరిమాణం ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని చెబుతోంది. ఈ లెక్కన 45 టీఎంసీలతో ఏపీ పట్టిసీమ చేపడితే అదే స్థాయిలో నీరు తమకు దక్కాలని వాదిస్తోంది. అంటే మొత్తంగా 90 టీఎంసీల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించి దీనిపై స్పష్టత కోరుతూ వాటాలకు పట్టుబట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపీకి కృష్ణాలో 512 టీఎంసీల వాటా ఉన్నా కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాజెక్టులైన పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులకు 550 టీఎంసీల మేర నీటిని మళ్లిస్తోందని, దానికి అడ్డుకట్ట వేసి తెలంగాణ ప్రాజెక్టులకు నీటి వాటాను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 (ఎ), సెక్షన్ (బి)లకు సంబంధించి ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు ఎలా ఉండాలి, నీటి లోటు ఉన్నప్పుడు నీటి కేటాయింపులు జరపాలన్నది బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయించాల్సి ఉందని, ఇది తేలాలంటే నాలుగు రాష్ట్రాలకు పునః కేటాయింపులు జరపాలని రాష్ట్రం కోరనుంది. -
ఆయకట్టు రైతుకు తీపి కబురు
కర్నూలు రూరల్: తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లకు సాగునీటి వాటాలను బోర్డు అధికారులు నిర్ణయించారు. బళ్లారిలో నిర్వహించిన బోర్డు అధికారుల సమావేశంలో తుంగభద్ర దిగువ కాలువ, కర్నూలు-కడప కాలువలకు తుంగభద్ర జలాశయంలో 24 టీఎంసీలు, కేసీకి 10 టీఎంసీ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. ఈ ఏడాది రుతు పవనాల రాక ఆలస్యం కావడం.. వరుణుడు ముఖం చాటేయడంతో ప్రాజెక్టులోకి వరద నీరు చేరక వారం రోజుల క్రితం నిర్వహించాల్సిన బోర్డు ఎస్ఈ స్థాయి అధికారుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ నెల చివరి వరకు జలాశయంలోకి 144 టీఎంసీల నీరు చేరవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇందులో కర్ణాటక వాటా 94 టీఎంసీలు, ఆంధ్రా ౄటాగా 50 టీఎంసీలు కేటాయించారు. ఆంధ్రా వాటాగా కేటాయించిన నీటిలో తుంగభద్ర దిగువ కాలువకు ఈ ఏడాది 16.3 టీఎంసీలు, కర్నూలు, కడప కాలువకు 6.79 టీఎంసీల ప్రకారం కేటాయించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం 0.86 టీఎంసీ అదనంగా కేటాయించడం విశేషం. వాటా పెరిగినా వాస్తవంగా రావాల్సిన నీటి కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు. ఊరిస్తున్న నైరుతి రుతు పవనాలు కరుణించకపోవడంతో జిల్లాలోని ఆయకట్టు రైతులు టీబీ డ్యామ్ నీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. నారుమళ్లు పెంచుకునేందుకు జులై మొదటి లేదా రెండో వారంలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి విడుదల తేదీలను నిర్ణయించనున్నారు. సుంకేసుల జలాశయంలో ఇటీవల కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు, ఆదోని, మంత్రాలయం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నీటి మట్టం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకుంది. స్వల్ప మోతాదులో డ్యాంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఈ కారణంగా దిగువ కాలువ కంటే ముందుగానే కర్నూలు-కడప కాలువకు సాగునీరు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.