breaking news
Sericulture Department
-
పట్టు జారి పోతోంది!
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. గతంలో కిలో పట్టుగూళ్లకు రూ.400 నుంచి రూ.500 వరకు వస్తుంటే నేడు కూడా అదే ధర పలుకుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు.కర్నూలు(అగ్రికల్చర్): మల్బరీ తోటల సాగుపై, పట్టు పురుగుల పెంపకంపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. గతంలో ఆదోని ప్రాంతంలోని దొడ్డనగేరి, జాలిమంచి, కోసిగి, ఇస్వీ ప్రాంతాల్లో గతంలో ఎటు చూసినా మల్బరీ తోటలు ఉండేవి. ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ శాఖ సహాయ సంచాలకుల కార్యాలయం ఉండేది. అయితే క్రమంగా ఈ ప్రాంతంలో మల్బరీ సాగు తగ్గుతూ వచ్చి నేడు పూర్తిగా కనుమరుగైంది. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న పట్టుపరిశ్రమల శాఖ ఏడీ కార్యాలయాన్ని ప్యాపిలికి మార్చారు. అక్కడ కూడా మల్బరీ సాగు తగ్గడంతో కార్యాలయం కర్నూలుకు వచ్చింది. గతంలో వెల్దుర్తి మండలం బోయినపల్లి, సూదేపల్లి, కోడుమూరు మండలం లద్దగిరి గ్రామాలు మల్బరీ సాగుకు నెలవుగా ఉండేవి. నేడు ఈ ప్రాంతాల్లో మల్బరీ సాగు కనిపించడం లేదు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పాములపాడు, ఆత్మకూరు మండలాల్లో 2,000 ఎకరాల్లో మల్బరీ సాగు ఉండేది. ఆత్మకూరులో ప్రత్యేకంగా అసిస్టెంటు డైరెక్టర్కార్యాలయం కూడా ఉంది. అయితే నేడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆత్మకూరు ఏడీ పరిధిలో 50 ఎకరాల్లో కూడా మల్బరీ సాగు కనిపించడం లేదు. ఎందుకు ఇలా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో మల్బరీ సాగు 80 శాతంపైగా పడిపోయినా సెరికల్చర్, సహాయ సెరికల్చర్ ఆఫీసర్లు, సాంకేతిక సహాయకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాకాలు లేకపోవడం, పట్టుగూళ్ల ధరల్లో పురోగతి లేకపోవడంతో రైతులు పట్టుకు ప్రత్యామ్నాయంగా పొగాకు, మినుము వంటి పంటలు సాగు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడి వ్యయం పట్టు సాగులో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. పట్టు పురుగుల పెంపకానికి షెడ్ అత్యవసరం. ఇందుకు రూ.15 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ప్రభుత్వం గతంలో ఇస్తున్న సబ్సిడీ రూ.3 లక్షలే ప్రస్తుతం అందిస్తోంది. రెండుఎకరాల్లో మల్బరీ మొక్కలకు రూ.45 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.5000. సూట్‌కు రూ.40 వేలు, వరండాకు రూ.30 వేలు, నేత్రికలకు రూ.50 వేలు ప్రకారం సబ్సిడీలు ఉన్నాయి. సబ్సిడీలు పోను మొక్కలు నాటుకోవడానికి రైతులకు రూ.20 వేలు, వ్యాధి నిరోధకాలకు రూ.12 వేలు, సూట్‌కు రూ.1.50 లక్షలు, వరండాకు రూ.లక్ష, నేత్రికలకు రూ.10 వేలు, చాకి పురుగులకుఏడాదికి రూ.50 వేల వరకు ఖర్చు వస్తోంది. మొత్తం పెట్టుబడి వ్యయం రూ.20 లక్షల వరకు ఉండగా.. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రూ.4.80 లక్షలు సరిపోవడం లేదు. పట్టుగూళ్లకు హిందూపురం, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో మార్కెటింగ్ సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్ సదుపాయం లేదు. దీంతో రైతులకు నికరాదాయం రావడం లేదు. పట్టుపురుగులపై పురుగుమందుల ప్రభావంఏడెనిమిదేళ్లుగా కంది, పత్తి, మినుము, మిర్చి, మొక్కజొన్న, వరి తదితర పంటల్లో పురుగు మందుల వాడకం భారీగా పెరిగింది. ఈ ప్రభావం చుట్టుపక్కల ఉన్న పట్టు పురుగులపై పడుతోంది. పట్టు పురుగులు చాలా సున్నితంగా ఉంటాయి. గాలి వాటంగా వస్తున్న పురుగుమందుల ప్రభావానికి లోనై మరణిస్తున్నాయి. డోన్ మండలంలోని ఉడుములపాడు గ్రామం పరిసరాల్లో రెండు, మూడేళ్ల క్రితం ఫెస్టిసైడ్ కంపెనీ ఏర్పాటు అయింది. దీని ప్రభావం వెల్దుర్తి మండలం సూదేపల్లిలో సాగు చేస్తున్న పట్టు పరిశ్రమపై పడుతోంది. ఉమ్మడి జిల్లాలో పట్టు పరిశ్రమ మనుగడ కోల్పోతుండటానికి పురుగు మందుల పిచికారీ ప్రభావం కూడా ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాగుకు స్వస్తి పలికాం పట్టు సాగులో విశేషంగా రాణిస్తున్నందుకు నాకు గతంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు వచ్చింది. బైవోల్టెన్ పట్టు గూళ్ల ఉత్పత్తికి గతంలో కిలోకు రూ.50 ఇంటెన్సివ్ లభించేది. ప్రస్తుతం రైతులకు ఇది లేకుండా పోయింది. పెట్టుబడి వ్యయం ఎక్కువవుతున్నా సబ్సిడీలు పెరగడం లేదు. పట్టు గూళ్ల ధరలు పెరగకపోవడంతో పట్టు సాగుకు స్వస్తి పలికి పొగాకు, మినుము తదితర వాటిపై ఆసక్తి చూపుతున్నాం. – భాస్కరరెడ్డి, ఆత్మకూరునష్టాలు మూట కట్టుకుంటున్నాం పట్టులో ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయవచ్చు. ప్రస్తుతం ఈ పరిస్థితి లేదు. మూడు, నాలుగు పంటలే గగనం అవుతున్నాయి. ఒక్కోపంటకు రూ.80 వేలకుపైగా ఖర్చు వస్తోంది. పెట్టుబడి వ్యయం రూ.2.50 లక్షలు అయ్యింది. మూడు పంటలపై వచ్చిన పట్టుగూళ్లను అమ్మగా కేవలం రూ.1.90 లక్షలు మాత్రమే వచ్చింది. నష్టాలు మూట గట్టుకున్నాం. – మధుసూదన్, రామసముద్రం, జూపాడుబంగ్లా మండలంఫిర్యాదులు వస్తున్నాయి డోన్ మండలం ఉడుములపాడు సమీపంలో ఉన్న కెమికల్స్ ఫ్యాక్టరీ ప్రభావం సూదేపల్లి సాగు చేస్తున్న మల్బరీపై పడుతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మల్బరీ సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ఏడాదికేడాది పురుగు మందుల వినియోగం పెరుగుతోంది. దీంతో మల్బరీ సాగు నుంచి కొంతమంది రైతులు దూరం అవుతున్నారు. మల్బరీ సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – విజయకుమార్, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి, కర్నూలు -
చేనేత కార్మికులు, మల్బరీ సాగు రైతుల సమస్యలపై గళమెత్తిన కవిత
-
ఉద్యోగులమా.. కూలీలమా!
నిర్మల్/దిలావర్పూర్: నిర్మల్ జిల్లాలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల ఉద్యోగులు, సిబ్బంది మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశమైంది. తాము ఉద్యోగులమా? కూలీలమా? అనుకునే స్థాయికి పరిస్థితి చేరడంతో అందరి దృష్టి సదరు శాఖలపై పడింది. జిల్లాలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ రాష్ట్ర కమిషనర్ లోక వెంకట్రాంరెడ్డికి చెందిన వ్యవసాయక్షేత్రం ఉంది. ఇందులో గురువారం హార్టికల్చర్, సెరికల్చర్ ఉద్యోగులు, సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అసలు ఆ రెండు శాఖల ఉద్యోగులకు కమిషనర్ వ్యవసాయక్షేత్రంలో ఏం పని?..కమిషనర్ మెప్పు కోసమే సదరు ఉద్యోగులతో చాకిరీ చేయిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నా యి. సదరు శాఖల జిల్లా అధికారులు మాత్రం విధి నిర్వహణలో భాగంగానే ఈ పనులు చేయిస్తున్నట్లు చెబుతున్నారు. అక్కడే విధులా..? కమిషనర్‌కు చెందిన 50 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వివిధ పండ్ల చెట్లు, ఇతర పంటలు సాగు చేయిస్తున్నారు. ఇక్కడ చాలాకాలంగా హార్టికల్చర్ శాఖ ఉద్యోగులు, సిబ్బందితోనే పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. ఇక కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన ఇద్దరు హెచ్‌ఈవోలు ఇక్కడి పనులు చూసుకుంటున్నారు. తమ శాఖల కార్యాలయాల సిబ్బందితోనే తోట పని చేయిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. మల్బరీ సాగుతో వివాదం.. వ్యవసాయ క్షేత్రంలో మల్బరీ మొక్కలు నాటేందుకు పట్టుపరిశ్రమ శాఖ పరిధిలో పనిచేసే నలుగురు రెగ్యులర్ ఉద్యోగు లు, నలుగురు కాంట్రాక్ట్ సిబ్బందిని క్షేత్రానికి రప్పించారు. గురువారం సెరికల్చర్ ఉద్యోగులకు, అక్కడే ఉండి క్షేత్రాన్ని చూసుకుంటున్న హార్టీకల్చర్ హెచ్‌ఈఓలకు మధ్య మాటామాటా పెరిగింది. హెచ్‌ఈఓలు ప్రణీత్, దేవన్న, సెరికల్చర్ ఎస్వోలు షోయబ్‌ఖాన్, భరత్, బిక్యానాయక్, డి.రాములు మధ్య వాగ్వాదం జరిగింది. ఉన్నతాధికారుల మెప్పు పొం దేందుకు తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారంటూ సెరికల్చర్ ఉద్యోగులు వాపోతూ తోట నుంచి బయటకు వచ్చారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని సెరికల్చర్ ఉ ద్యోగులు తెలిపారు. మల్బరీ సాగుపై అవగాహన కల్పిం చేందుకే తమ ఉద్యోగులకు పంపినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సెరికల్చర్ అధికారి మెహర్‌బాషా తెలిపారు. కాగా, మామిడితోటలను పరిశీలించేందుకు హార్టికల్చర్ హెచ్‌ఈవో లు వెళ్లినట్టు ఆ శాఖ అధికారి శరత్‌బాబు చెప్పారు. -
కలెక్టర్ చెవిలో పట్టు పూలు
సెరికల్చర్ శాఖలో బది‘లీల’లు భారీ అవినీతికి తెరలేపిన ఓ ఉన్నతాధికారి చిత్తూరు: జిల్లా సెరికల్చర్ శాఖలోని ఓ ఉన్నతాధికారి కలెక్టర్ సిద్ధార్థజైన్ చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ ఉద్యోగుల బదిలీల్లో భారీ అవినీతికి పాల్పడినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారిందని అత్యంత విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో శాఖలో 20 శాతానికి మించి బదిలీలు జరపకూడదు. అయితే ఆ శాఖలో మాత్రం ఏకంగా 40 శాతం మందిని బదిలీ చేసినట్లు తెలియవచ్చింది. ఈ మేరకు వీరికి కొన్ని రోజుల క్రితం జరిగిన కౌన్సెలింగ్‌లో ఉత్తర్వులు కూడా జారీచేశారు. ఈ బదిలీలపై గురువారం ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు పలమనేరు సెరికల్చర్ ఏడీ కార్యాలయంలో సమావేశం కూడా ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి హాజరైన ఉద్యోగులకు బదిలీ ప్రక్రియను వివరిస్తూ... కలెక్టర్ ప్రత్యేక అనుమతితో కొంత ఎక్కువ శాతం బదిలీలు చేశామని.. దీనిపై ఎవరికీ అనుమానం వద్దని వారికి ధైర్యం చెప్పారు. మొత్తం 65 మందిని బదిలీ చేశామని, వారికి కేటాయించిన ప్రాంతాల వారీగా ఆయా ఏడీవోలకు రిపోర్ట్ చేస్తారని, బదిలీపై వచ్చిన వారిని చేర్చుకొని వర్క్ అలాట్మెంట్ మాత్రం ముందు పని చేసిన ప్రాంతాల్లోనే ఇవ్వాలని సూచించారు. ఇది ప్రమాదకరమని కొంతమంది ఏడీవోలు అనుమానం వ్యక్తం చేయగా... ‘కలెక్టర్‌కు తెలిస్తే కదా’ అని జిల్లా సెరికల్చర్ అధికారి వారికి బదులిచ్చారు. ఉదాహరణకు.. ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ మదనపల్లె సెరికల్చర్ ఆఫీసులో పని చేస్తోంది. ఈమెను తిరుపతికి బదిలీ చేశారు. ఆమె తిరుపతి సెరికల్చర్ ఏడీ ఆఫీసులో రిపోర్టు చేస్తుంది. తిరుపతి ఏడీ మాత్రం ఆమెకు మదనపల్లెలోనే వర్క్‌అలాట్‌మెంట్ చేస్తారు. ఓటెక్నికల్ ఆఫీసర్ కొలమాసపల్లెలో పని చేస్తున్నారు. ఆయన్ను మదనపల్లెకి ట్రాన్స్ఫర్ చేశారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మదనపల్లె ఏడీ ఆఫీసులో జాయిన్ అవుతారు. మదనపల్లె ఏడీ ఆ టెక్నికల్ ఆఫీసర్‌కు కొలమాసపల్లిలోనే వర్క్ అలాట్మెంట్ చేస్తారు. ఇదీ పట్టు పరిశ్రమ శాఖలో నెలగా జరుగుతున్న బది‘లీల’ల భాగోతం. ఈ తతంగంతో ఆ ఉన్నతాధికారి ఏకంగా జిల్లా కలెక్టర్ చెవిలో పట్టుపూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.