breaking news
scrootny
-
17 స్థానాలకు 320 దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు 320 మంది ఆశావహులు దరఖా స్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభస్థానాలకు ఈ నెల 10 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం ముగిసింది. రిజర్వుడ్ నియోజకవర్గాలైన నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో భారీగా డిమాండ్ ఉందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 25కిపైగా దరఖా స్తులు వచ్చినట్టు సమాచారం. వీటిని ఈ నెల 17న జరిగే ప్రదేశ్ ఎన్నికల కమిటీ భేటీలో పరిశీలించి ఆ తర్వాత స్క్రూటినీ కమిటీ షార్ట్‌లిస్టు చేయనుంది. ఈ నెల 20లోపు నియోజకవర్గానికి 1 లేదా 2, అనివార్యమైతే 3 పేర్లతో జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపనున్నట్లు సమాచారం. నేటి నుంచి సమీక్షలు..: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షలను శుక్రవారం నుంచి మూడ్రోజులు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో తొలిరోజు ఆదిలాబాద్–పెద్దపల్లి, నిజామాబాద్–జహీరాబాద్, కరీంనగర్–వరంగల్, రెండోరోజు నాగర్‌కర్నూల్– మహబూబ్‌నగర్, ఖమ్మం– మహబూబాబాద్, నల్లగొండ–భువనగిరి నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి. అదేరోజు పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది. మూడోరోజు చేవెళ్ల–మల్కాజ్గిరి, హైదరాబాద్–సికింద్రాబాద్, మెదక్ స్థానాల సమీక్షతోపాటు ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. భేటీలకు నేతలు ఆర్సీ కుంతియా, ఉత్తమ్, భట్టి హాజరు కానున్నారు. -
‘చిలక’ పలుకు
♦ గిరిజన విద్యార్థి రాహుల్ అద్భుత ప్రతిభ ♦ 7.40 నిమిషాల్లో వేమన శతక పద్యధారణ ♦ రికార్డును తిరగరాసిన సిద్ధారం విద్యార్థి ♦ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ స్క్రూట్నీలో ఎంపిక సత్తుపల్లి: సిద్ధారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న చిలక రాహుల్ అద్భుత ప్రతిభ ప్రదర్శించాడు. తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు కోసం సోమవారం పాఠశాలలో జరిగిన స్క్రూట్నీలో వేమన శతకంలోని 100 పద్యాలను 7.40 నిమిషాల్లో పూర్తి చేసి రికార్డులు తిరగరాశాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా రికార్డు గతంలో సింగరాజు మంజునాథ్ పేరున ఉండేది. 11 ఏళ్ల వయసులో మంజునాథ్ 2015 అక్టోబర్‌లో తిరుపతిలో జరిగిన వేమన పద్యాల పోటీల్లో 11.40 నిమిషాల్లో రికార్డు నమోదు చేశాడు. దాన్ని సోమవారం 12 ఏళ్ల రాహుల్ తిరగరాయటం గమనార్హం. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ముఖ్య అతిథులు తహసీల్దార్ దొడ్డా పుల్లయ్య, ఎంపీడీఓ రవి చేతులమీదుగా రాహుల్ స్క్రూట్నీ గుర్తింపు పత్రాన్ని పొందాడు. త్వరలో ప్రధాన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ♦ రాహుల్ నేపథ్యం: ఎస్టీ నాయకపోడు వర్గానికి చెందిన చిలక రాంబాబు, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. రాహుల్ (8వ తరగతి), సుస్మిత (6వ తరగతి). వీరు సిద్ధారం యూపీఎస్ పాఠశాలలో చదువుతున్నారు. తల్లిదండ్రులిద్దరూ కూలీ పనులు చేస్తే తప్ప పూట గడవని పరిస్థితి. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ అద్భుత ప్రదర్శనపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ♦ ఇదో అద్భుత ఘట్టమని తహసీల్దార్ పుల్లయ్య పేర్కొన్నారు. రా హుల్‌ను ప్రోత్సహించిన ఉపాధ్యా య బృందాన్ని అభినందించారు. ♦ 8 నిమిషాల్లోపే వేమన శతక పద్యాలను పూర్తి చేయడం అద్భుత ఘట్టమని ఎంపీడీఓ రవి పేర్కొన్నారు. ♦ తెలుగుబుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి రాహుల్‌కు గుర్తింపు పత్రాన్ని ఇచ్చారు. ప్రధాన పోటీలకు అనుమతించారు. ఈ కార్యక్రమంలో సిద్ధారం సర్పంచ్ మోరంపూడి ప్రమీలారాణి, ప్రసాద్, హెచ్ఎం బి.మధుసూదన్‌రాజు, సృజన బాధ్యులు రామకృష్ణ తదితరులు రాహుల్‌కు, బొమ్మారెడ్డికి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. శేషగిరి, మాలతి దంపతులు వీరిని శాలువాలతో సత్కరించారు. ఉపాధ్యాయులు రాజేశ్వరి, రాజ్యలక్ష్మి, నాగాచారి, మస్తాన్, రజనీదేవిలతో పాటు ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, ఎంఈఓ బి.రాములు, ఎంపీటీసీ వినుకొండ కృష్ణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఎన్.రాజేశ్వరరావు, గురుజ్యోతి నిర్వాహకులు చిత్తలూరి ప్రసాద్, ఎస్ఎంసీ చైర్మన్ దుర్గాచారి, ఉపసర్పంచ్ శ్రీరాములు రాహుల్‌ను అభినందించిన వారిలో ఉన్నారు.