Samaikyandhra Strike
-
నేడే వైఎస్సార్సీపీ సమైక్య ధర్నా
-
నేడే వైఎస్సార్సీపీ సమైక్య ధర్నా
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏర్పాట్లు పూర్తి ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభం మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు భారీ సంఖ్యలో ఢిల్లీకి చేరుకున్న సమైక్యవాదులు సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుజాతిని విచ్ఛిన్నం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుయుక్తులను ఎండగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో సోమవారం సమైక్యనాదం వినిపించనున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించుకొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఇక్కడి జంతర్‌మంతర్ వద్ద భారీ ఎత్తున సమైక్య ధర్నా నిర్వహించనున్నారు. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిన తీరును నిరసిస్తూ... పూర్తి ఏకపక్షంగా, అడ్డగోలుగా జరుగుతున్న విభజనను వ్యతిరేకించాలని ధర్నా వేదికగా మరోమారు జాతీయ పార్టీలకు జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ ధర్నాకు సంబంధించి జంతర్‌మంతర్ వద్ద ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వేల సంఖ్యలో సమైక్యవాదులు ఈ ధర్నాకు హాజరుకానున్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రానికే రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, సమైక్యవాదులు ఢిల్లీకి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో సమైక్యవాదులు తరలివస్తున్న ప్రత్యేక రైళ్లు సోమవారం ఉదయానికి ఢిల్లీకి చేరుకోనున్నాయి. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ ధర్నాకు వివిధ సంఘాలు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఉదయం 10కి ప్రారంభం.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమైక్య ధర్నా సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లాల అధ్యక్షులు, వివిధ అనుబంధ శాఖల అధ్యక్షులు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, భారీ సంఖ్యలో సమైక్యవాదులు ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. దాదాపు 100 మంది ధర్నా వేదికపై ఉండేలా చర్యలు తీసుకున్నారు. ధర్నాకు హాజరయ్యే వారికోసం వేదిక ముందు భారీ టెంట్లు ఏర్పాటు చేశారు. కాగా, జంతర్‌మంతర్ వద్ద ధర్నా ఏర్పాట్లను పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి, పార్టీ ఐటీ విభాగం అధ్యక్షుడు చల్లా మధుసూదన్‌రెడ్డి ఆదివారం ఉదయం పర్యవేక్షించారు. ధర్నాకు వచ్చే సమైక్యవాదులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలను సూచించారు. విద్యార్థి, ఉద్యోగ సంఘాల మద్దతు.. వైఎస్సార్సీపీ సమైక్య ధర్నాకు పలు విద్యార్థి, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. సమైక్యం కోసం మొదటి నుంచీ పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ నిర్వహించనున్న ధర్నాకు పూర్తి మద్దతు ఇస్తున్నామని సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సీమాంధ్ర విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్ అడారి కిశోర్, సీమాంధ్ర మేధావుల ఫోరం నేత చలసాని శ్రీనివాస్ తదితరులు వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిసి ధర్నాకు పూర్తి మద్దతు ప్రకటించారు. కేంద్ర ఆటవిక చర్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తాం:ఎమ్మెల్యేలు కొరుముట్ల, గుర్నాథరెడ్డి అప్రజాస్వామికంగా జరుగుతున్న విభజనను జాతి మొత్తానికి తెలిపేందుకే భారీ ధర్నా నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, గుర్నాథరెడ్డి తెలిపారు. కేంద్రం సాగిస్తున్న ఈ ఆటవిక చర్యను మొత్తం ప్రపంచం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సమైక్యం కోసం నిరంతరం కృషి చేస్తున్న జగన్ ధర్నాకు సమైక్యవాదులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల బాగుకోసం జరుగుతున్న ఈ ధర్నాతో అయినా కేంద్రం కళ్లు తెరవాలన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖకు ఉద్యమ సెగ
మార్కాపురం, న్యూస్‌లైన్: మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ పరిధిలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా తగ్గిపోయాయి. దీని పరిధిలో మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం, పొదిలి, దర్శి, కందుకూరు, అద్దంకి, కనిగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. గతేడాది నవంబర్ 30వ తేదీ నాటికి 27,053 రిజిస్ట్రేషన్లు జరిగి రూ. 28.42 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది నవంబర్ నాటికి కేవలం 11,412 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.12.55 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. సమైక్యాంధ్ర సమ్మె కారణంగా సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్లు జరగలేదు. జరిగిన వాటిలో పొలం అమ్మకాలు, దాన దస్తావీజులు, బహుమతులు, పవర్ఆఫ్ అటార్నీ దస్తావీజులు ఎక్కువగా ఉన్నాయి. ఇవీ కారణాలు.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సమైక్యాంధ్ర సమ్మెతో ఉద్యోగులందరూ కార్యాలయాలకు హాజరు కాకపోవడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇదే సమయంలో అకాల వర్షాల వల్ల పంట నష్టం జరగడంతో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. ఇంకోవైపు రాష్ట్ర విభజన జరుగుతుందని, ఒంగోలు రాజధాని అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వెలువడడంతో అమ్మకందారులు వెనక్కి తగ్గారు. తమ భూములను ఇంకా ఎక్కువ ధరకు అమ్మవచ్చనే ఉద్దేశం ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం ఆగిపోయింది. మార్కాపురం ప్రాంతంలో గతేడాది వివిధ సంస్థలు ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఇవ్వకపోవడంతో రియల్ వ్యాపారం మందగించి స్తబ్ధత ఏర్పడింది. కొత్త రాజధాని నిర్ణయం, పంటలకు గిట్టుబాటు ధర వంటివి అమలైతే తప్ప రిజిస్ట్రేషన్ శాఖ మళ్లీ పుంజుకోదు. ఒంగోలు రాష్ట్ర రాజధాని అయ్యే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో ఇటీవల కాలంలో పొదిలి, మార్కాపురం, కనిగిరి, దొనకొండ, దర్శి ప్రాంతాల్లో పలువురు ప్రముఖులు భూములు కొన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు 9 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాలిలా ఉన్నాయి.. నెల జరిగిన ఆదాయం రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ - 1921- 2,14,28,890 మే - 2208 - 2,63,27,085 జూన్ - 2590 - 2,85,75,019 జూలై - 2123 - 2,13,74,880 ఆగస్టు - 701 - 8,89,95,607 సెప్టెంబర్ నిల్ అక్టోబర్ - 1869 - 1,88,29,558 నవంబర్ - 3455 - 4,46,56,843 -
జిల్లాలో 59వ రోజు ఉధృతంగా సమైక్యాంధ్ర ఉద్యమం
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పలు విధాలుగా ఆందోళనలు తెలిపిన సమైక్యవాదులు శుక్రవారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఒంగోలు నగరంతో పాటు అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులను ఉద్యోగులు ముట్టడించారు. దీంతో కేంద్ర ప్రభుత్వ సర్వీసులైన బీఎస్ఎన్ఎల్, పోస్టాఫీసులు, ఎల్ఐసీ, బ్యాంకులు మూతపడ్డాయి. బ్యాంకుల బంద్‌తో ఆర్థిక లావాదేవీలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆందోళన కార్యక్రమాలు యథావిధిగా సాగాయి. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పదవికి రాజీనామా చేయాలని కోరుతూ విద్యార్థులు ప్రకాశం పంతులు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు కలెక్టరేట్ ఎదుట గోడలకు సున్నం వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డిపో వద్ద ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. వివిధ నియోజకవర్గాల్లో... సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో సాగుతున్న ఆందోళన కార్యక్రమాలు శుక్రవారానికి 59వ రోజుకు చేరాయి. అద్దంకిలో ఎన్జీఓ నేతల పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగులు మూయించారు. బంద్‌తో బ్యాంకులు, పోస్టాఫీసులు, సొసైటీ, ఎల్ఐసీ కార్యాలయాలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు, ఆర్టీసీ నాయకులు డిపో ఎదుట ఆందోళన చేశారు. ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 40వ రోజుకు చేరాయి. బల్లికురవలో సమైక్యవాదుల రిలే దీక్షలు 16వ రోజూ సాగాయి. మేదరమెట్ల మండలంలోని కొణిదెనలో బ్యాంకులు, పాఠశాలలు, వ్యాపార సంస్థలను ఆందోళనకారులు మూయించారు. రావినూతలలో సమైక్యాంధ్ర కోసం ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి రిలే దీక్షలు చేపట్టారు. చీరాలలో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 31వ రోజుకు చేరాయి. ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ కార్మికులు పట్టణంలో భారీ ప్రదర్శన చే శారు. ఉపాధ్యాయులు, మున్సిపల్ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వేటపాలెంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన రథయాత్ర నిర్వహించగా, రజకులు నిరాహార దీక్ష చేపట్టారు. పర్చూరులో సమైక్యవాదుల దీక్షలు 9వ రోజుకు చేరాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇంకొల్లులో బ్యాంక్‌లు, కేంద్ర కార్యాలయాలను జేఏసీ ఆధ్వర్యంలో మూయించారు. కందుకూరులో రైతు గర్జన: కందుకూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పోస్టాఫీసు సెంటర్లో రైతుగర్జన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు రోడ్డుపై వరి, పత్తి మొక్కలు నాటి వినూత్న నిరసన తెలిపారు. గుడ్లూరులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో వంటా-వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. కొండపిలోను కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా మూతపడ్డాయి. పొన్నలూరు మండలంలోని అగ్రహారం, ముప్పాళ్ల గ్రామాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవ హారం, కోలాటం, హోమాలు నిర్వహించారు. మార్కాపురంలో ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. కొనకనమిట్లలో సమైక్యాంధ్ర కోరుతూ రైతులు, విద్యార్థినులు, విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. పొదిలిలో సమైక్యాంధ్ర కోరుతూ ఫొటోగ్రాఫర్లు ర్యాలీ- రాస్తారోకో చేపట్టారు. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజారుకు చెందిన ప్రజలు రాష్ట్ర విభజనను నిరసిస్తూ భారీ ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. జేఏసీ దీక్షా శిబిరంలో నల్లబండకు చెందిన యువకులు రిలే నిరాహార దీక్షలు చేశారు. బేస్తవారిపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లింలు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఉపాధ్యాయులు ర్యాలీ చేపట్టి, రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. కొమరోలులో ఎంపీడీఓ విజయకుమార్, కార్యాలయ సిబ్బంది, ఉపాధి సిబ్బంది ర్యాలీ, మానవహారం, రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. కంభంలో ముస్లింలు ర్యాలీ, మానవహారం, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జేఏసీ నాయకులు గిద్దలూరు, రాచర్ల, ఆకవీడులలో కేంద్ర కార్యాలయాలను మూసేయించారు. కనిగిరిలో సమైక్యాంధ్ర కోసం శాంతిహోమం: కనిగిరిలో సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూర్ బాష సంఘం తరఫున రిలేదీక్షలో కూర్చున్నారు. అలాగే సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక బ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోసం శాంతి హోమం చేశారు. నిరసన ర్యాలీ, వంటా వార్పు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో వైఎస్సార్సీపీ కార్యకర్తల రిలే దీక్షలు 12వ రోజుకు చేరాయి. టీడీపీ కార్యకర్తల దీక్షలు కొనసాగుతున్నాయి. హనుమంతునిపాడు మండలం వేములపాడులో గ్రామస్తులు నిరసన ర్యాలీ చేపట్టి, కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎస్‌పురంలో విద్యార్థులు రోడ్లు ఊడ్చి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. డీజీపేటలో విద్యార్థులు, యువకులు ర్యాలీ చేపట్టారు. పామూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లీంలు నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. యర్రగొండపాలెంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. -
సమ్మెలో ఉన్న ఉద్యోగులకు తీపి కబురు: రెండు నెలల జీతం అడ్వాన్స్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పోరాడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తీపికబురు అందించింది. రెండు నెలల జీతాన్ని ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) పద్ధతిలో అడ్వాన్సుగా చెల్లించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కేఎస్ఆర్ మూర్తి అంగీకరించారు. సమైక్యాంధ్ర ఉద్యోగ జేఏసీ నేతలు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఇటీవల ఎస్బీఐ ఆర్ఎంను కలిశారు. సమ్మెలో పాల్గొంటున్నందున తమకు జీతాలు రాలేదని, రెండు నెలల జీతాలు అడ్వాన్సుగా చెల్లించాలని కోరారు. దీనికి ఆర్ఎం అంగీకరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఖాతాలున్న బ్యాంకులను సంప్రదించి అవసరం మేరకు ఒకటి, రెండు నెలల జీతాన్ని ఓడీ పద్ధతిలో అడ్వాన్సుగా పొందేందుకు వెసలుబాటు కల్పించారు. జిల్లాలో ఆగస్టు 13వ తేదీ నుంచి ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. జీతాలు చెల్లించే ఖజానా శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటుండటంతో సెప్టెంబర్ 1న జీతాలు అందలేదు. నెలసరీ నిత్యావసరాలు, పాలు, కరెంట్, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు తదితరాల కోసం ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. మరికొందరు తప్పక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు తీర్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. జిల్లాలో సుమారు 75 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నెలవారీ జీతాలు పొందుతున్నారు. అక్టోబర్‌లో అడ్వాన్సులు తమ బ్యాంకు ద్వారా అక్టోబర్ మొదటి వారంలో ఓవర్‌డ్రాఫ్ట్ పద్ధతిలో రెండు నెలల జీతం అడ్వాన్సుగా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్థానిక సంతపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ చీఫ్ మేనేజర్ బీవీ రమణయ్య తెలిపారు. ఒంగోలు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు తదితర మండలాల టీచర్లు, ఉద్యోగుల ఖాతాలు ఈ బ్యాంకులో ఉన్నాయి. తమ బ్యాంకులో ఖాతాలున్న ఉద్యోగులందరికీ ఓడీ ఇస్తామన్నారు. రెండు నెలల జీతం ఓవర్‌డ్రాఫ్ట్ ఇచ్చేందుకు ఉద్యోగులు అభ్యర్థన పత్రం, జీతం స్లిప్, బ్యాంకు పాస్ పుస్తకం, మొదటి పేజీ, చివరి పేజీ, ఐడీ ఫ్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫొటోతో బ్యాంకులో సంప్రదించాలని ఆయన సూచించారు. సోమవారం నుంచి అభ్యర్థన పత్రాలను స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 7వ తేదీ నుంచి ఉద్యోగుల ఖాతాలకు నిధులు జమ చేస్తామని వివరించారు. డబ్బులను బ్యాంకు కౌంటర్ల నుంచి లేదా ఏటీఎంల నుంచి డ్రా చేసుకోవచ్చు. ఓడీగా ఇచ్చే రెండు నెలల జీతంపై 18.25 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఉద్యోగులు సమ్మె విరమించి విధులకు హాజరైన తర్వాత వచ్చే జీతాలను ఓవర్‌డ్రాఫ్ట్‌కు జమ చేసుకుంటామని రమణయ్య తెలిపారు. జీతాన్ని ఓవర్‌డ్రాఫ్ట్‌గా పొందేందుకు బ్యాంకులోని రిలేషన్ మేనేజర్ రాజేశ్రామ్ను 80082 66605 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రమణయ్య కోరారు. -
రాష్ట్రంలో లక్ష గొర్రెల మృత్యువాత
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘‘ఈ సీజన్లో గొర్రెలు, మేకలకు ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి. కీలకమైన ఈ సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం పశువైద్యుల నుంచి పారా మెడికల్ సిబ్బంది వరకు సమ్మెబాట పట్టారు. సమ్మెకు దిగిన కాలంలో రాష్ట్రంలో లక్ష గొర్రెలు మరణించాయి. ఒక్క సీమాంధ్రలోనే 75 శాతం మృత్యువాతకు గురయ్యాయి. గొర్రెలు మరణిస్తుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పశువైద్యులను సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని’ ఆంధ్రప్రదేశ్ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ జమలయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఒంగోలు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సీజన్లో గొర్రెలు, మేకలకు గాలికుంటు, ఆంత్రాక్స్, నీలినాలుక, గిట్టపుండు వ్యాధులు వస్తాయన్నారు. నీలినాలుక, గిట్టపుండు వ్యాధులకు వ్యాక్సిన్ లేదన్నారు. గాలికుంటు వ్యాధికి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ పై రెండు వ్యాధులను నియంత్రించలేరన్నారు. గొర్రెలు, మేకలు మృత్యువాత పడుతుండటంతో వాటిపై ఆధారపడిన పెంపకందారులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పశువైద్యులు మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. నియోజకవర్గానికి ఒక మొబైల్ వ్యాన్ ఏర్పాటుచేసి పశువైద్యం అందించాలని సూచించారు. ప్రైవేట్ మందులకు రూ. 400 కోట్లు ఖర్చు గొర్రెలు, మేకలకు సంబంధించి ప్రభుత్వం అందించే మందుల్లో నాణ్యత లోపిస్తోందని జమలయ్య ఆరోపించారు. నాణ్యమైన నట్టల నివారణ మందు అందిస్తే కొన్నిరకాల వ్యాధులను నియంత్రించవచ్చన్నారు. రాష్ట్రంలో 8 లక్షల మంది పెంపకందారులున్నారని, ఒక్కో పెంపకందారుడు ఏటా 5 నుంచి 10 వేల రూపాయల మందులు కొనుగోలు చేస్తున్నారని, ఏడాదికి దాదాపు రూ. 400 కోట్లు వెచ్చిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే కొన్నిరకాల మందులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నారని, వాటిని ఔషధ నియంత్రణ అధికారులు అడ్డుకున్న దాఖలాలు లేవన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు ఈ ఏడాది రూ. 470 కోట్ల రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొందన్నారు. ఆరునెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదన్నారు. నిధులు ఖర్చు చేయకుంటే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆర్థిక శాఖ నిర్ణయించిందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెంపకందారుల సమస్యలపై గ్రామ స్థాయి నుంచి వివరాలు సేకరించి వాటిని పరిష్కరించాలని కోరుతూ నవంబర్‌లో అసెంబ్లీని ముట్టడించనున్నట్లు జమలయ్య వెల్లడించారు. విలేకరుల సమావేశంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిల్లా కార్యదర్శి మొనపాటి రామకృష్ణ, సహాయ కార్యదర్శి తోట తిరుపతిరావు, లీగల్ అడ్వయిజర్ కే పిచ్చయ్య పాల్గొన్నారు. -
జంతర్‌మంతర్ వద్ద విజయమ్మ ధర్నా
రాష్ట్ర విభజనపై సమన్యాయం చేయాలనే డిమాండ్‌తోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విజయమ్మ ముందుగా ధర్నా ప్రాంగణంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ధర్నాలో కూర్చున్నారు. -
ఆగిన ప్రగతి ‘రథ చక్రాలు’
* సీమాంధ్రలో మూడోరోజూ సమ్మె సంపూర్ణం * డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు * స్వాతంత్య్ర వేడుకలకు ఉద్యోగుల హాజరు సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో గురువారం మూడోరోజూ సమ్మె సంపూర్ణంగా జరిగింది. 12 జిల్లాల్లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రం కొన్ని బస్సులు డిపోల నుంచి వెళ్లాయి. సమ్మె నుంచి తిరుమల డిపోను మినహాయించడంతో తిరుపతి, తిరుమల మధ్య గురువారం 75 బస్సులు తిరిగాయి. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులూ పూర్తిగా నిలిచిపోయాయి. పరిమిత సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఆపరేటర్లు టికెట్ ధరలను భారీగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని అన్ని జిల్లాల్లోని సమైక్య ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉద్యోగుల సమ్మె ప్రభావం పెద్దగా లేదు. వేడుకల్లో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. నేడు గుంటూరులో ఉద్యోగ సంఘాల సమావేశం సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు శుక్రవారం గుంటూరులో సమావేశం కానున్నాయి. ఈ భేటీలో సమ్మె సాగుతున్న తీరును సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఆంటోనీ కమిటీ ముందు హాజరుకావాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందంలో ఎవరు ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే విషయంలోనూ చర్చ జరగనుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆవిర్భావం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సాగుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో గురువారం ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ ఆవిర్భవించింది. వేదిక కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. సీమాంధ్రలోని అన్ని వర్గాలను వేదికలో భాగస్వాములుగా చేయాలని గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ సభలో నిర్ణయించారు. సభ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సమైక్య సభ ఏర్పాటు గురించి ఆవిర్భావ సభలో చర్చించామని వెల్లడించారు. నగరంలో ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, మరో సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ జేఏసీ సమరశంఖం విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ సమర శంఖం పూరించింది. శుక్రవారం నుంచీ నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపీడీసీఎల్ సీఎండీకి లేఖను అందజేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈపీడీసీఎల్ పరిధిలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని జేఏసీ నేతలు తీర్మానించారు. 19, 20, 21 తేదీల్లో బైక్ ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో రాస్తారోకోలు, 25న వంటావార్పు, 26, 27, 28 తేదీల్లో మౌన ప్రదర్శన.. 29, 30, 31 తేదీల్లో మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేపడతారు. సెప్టెంబర్ 4 తేదీ వరకు ఆందోళనలు నిర్వహించి, అప్పటికీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటే మెరుపు సమ్మెకు వెళతామని జేఏసీ చైర్మన్ వీఎస్‌ఆర్‌కె గణపతి లేఖలో పేర్కొన్నారు. -
ఆగిన ప్రగతి ‘రథ చక్రాలు’
* సీమాంధ్రలో మూడోరోజూ సమ్మె సంపూర్ణం * డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు * స్వాతంత్య్ర వేడుకలకు ఉద్యోగుల హాజరు సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్ర జిల్లాల్లో గురువారం మూడోరోజూ సమ్మె సంపూర్ణంగా జరిగింది. 12 జిల్లాల్లో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా డిపో దాటి బయటకు రాలేదు. నెల్లూరు జిల్లాలో మాత్రం కొన్ని బస్సులు డిపోల నుంచి వెళ్లాయి. సమ్మె నుంచి తిరుమల డిపోను మినహాయించడంతో తిరుపతి, తిరుమల మధ్య గురువారం 75 బస్సులు తిరిగాయి. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర జిల్లాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులూ పూర్తిగా నిలిచిపోయాయి. పరిమిత సంఖ్యలో ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. అయితే ఆపరేటర్లు టికెట్ ధరలను భారీగా పెంచి విక్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు, ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని అన్ని జిల్లాల్లోని సమైక్య ఆందోళనకారులు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉద్యోగుల సమ్మె ప్రభావం పెద్దగా లేదు. వేడుకల్లో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. నేడు గుంటూరులో ఉద్యోగ సంఘాల సమావేశం సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు శుక్రవారం గుంటూరులో సమావేశం కానున్నాయి. ఈ భేటీలో సమ్మె సాగుతున్న తీరును సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ఆంటోనీ కమిటీ ముందు హాజరుకావాలని ఏపీఎన్జీవోలు నిర్ణయించిన నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లే ఉద్యోగ సంఘాల ప్రతినిధి బృందంలో ఎవరు ఉండాలనే విషయంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను ఎప్పుడు, ఎక్కడ నిర్వహించాలనే విషయంలోనూ చర్చ జరగనుంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆవిర్భావం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సాగుతున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో గురువారం ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ ఆవిర్భవించింది. వేదిక కార్యవర్గాన్ని ఇంకా ఏర్పాటు చేయలేదు. సీమాంధ్రలోని అన్ని వర్గాలను వేదికలో భాగస్వాములుగా చేయాలని గురువారం ఏపీఎన్జీవో కార్యాలయంలో జరిగిన ఆవిర్భావ సభలో నిర్ణయించారు. సభ అనంతరం ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో సమైక్య సభ ఏర్పాటు గురించి ఆవిర్భావ సభలో చర్చించామని వెల్లడించారు. నగరంలో ఎక్కడ, ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని, మరో సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ జేఏసీ సమరశంఖం విద్యుత్ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ సమర శంఖం పూరించింది. శుక్రవారం నుంచీ నిరంతరం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈపీడీసీఎల్ సీఎండీకి లేఖను అందజేసింది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఈపీడీసీఎల్ పరిధిలోని ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించాలని జేఏసీ నేతలు తీర్మానించారు. 19, 20, 21 తేదీల్లో బైక్ ర్యాలీలు, 22, 23, 24 తేదీల్లో రాస్తారోకోలు, 25న వంటావార్పు, 26, 27, 28 తేదీల్లో మౌన ప్రదర్శన.. 29, 30, 31 తేదీల్లో మంత్రుల ఇళ్ల వద్ద ధర్నాలు చేపడతారు. సెప్టెంబర్ 4 తేదీ వరకు ఆందోళనలు నిర్వహించి, అప్పటికీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటే మెరుపు సమ్మెకు వెళతామని జేఏసీ చైర్మన్ వీఎస్‌ఆర్‌కె గణపతి లేఖలో పేర్కొన్నారు.