breaking news
sama tirumal reddy
-
హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ కార్పోరేటర్‌కు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు వరదలో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్ సామా తిరుమల్ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ... కార్పోరేటర్ చొక్కా పట్టుకుని నిలదీశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కార్పోరేటర్ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
మంచినీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం
అనేక సంవత్సరాలుగా హయత్‌నగర్ పరిధిలోని గాయత్రినగర్ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్న మంచినీటి పైపులైను పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక కార్పొరేటర్ సామా తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి ఎం. రామ్మోహన్ గౌడ్ స్వయంగా వచ్చి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. దాంతోపాటు సోమవారం నుంచే పనులు కూడా ప్రారంభించారు. హయత్ నగర్ ప్రాంతంలోని మొత్తం 18 కాలనీలకు మంచినీళ్లు ఇచ్చేందుకు పనులు మంజూరయ్యాయని, ఈ కాలనీ రూపురేఖలు మార్చేందుకు అందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా కార్పొరేటర్ తిరుమలరెడ్డి అన్నారు. గాయత్రినగర్ కు వచ్చే మార్గమైన కుమ్మరికుంట చెరువు కట్టమీద లైట్లు లేకపోవడం, అటూ ఇటూ కంపచెట్లు ఉండటంతో ఈ సమస్యను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే కట్ట మీద 14-15 లైట్లు మంజూరు చేశారని, రాబోయే 15 రోజుల్లో అవన్నీ కూడా ఏర్పాటుచేస్తారని ఆయన వివరించారు. ఇక ఔట్ లెట్ లేకపోవడం వల్లే ఈ కాలనీకి ప్రస్తుతం డ్రైనేజి కనెక్షన్ ఇవ్వలేకపోతున్నామని, త్వరలోనే అది కూడా ఏర్పాటుచేయించి దీన్ని నెంబర్ వన్ కాలనీగా రూపొందిస్తామని చెప్పారు. డివిజన్ పరిధిలో మొత్తం 770 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరైనట్లు కూడా ఆయన తెలిపారు.