breaking news
Salahuddin Ahmed
-
రామోజీ ఫిలింసిటీ అక్రమ నిర్మాణాలపై చర్య తీసుకోండి
గవర్నర్ సలహాదారుకు గోనె ఫిర్యాదు హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీ ప్రధానద్వారం అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్‌కు ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఫిలింసిటీ ప్రధాన ద్వారం నిర్మాణం కారణంగా అనాజ్‌పూర్ గ్రామస్తులు పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై సంబంధిత ఆర్డీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం కనిపించడం లేదని గోనె ఆ వినతిపత్రంలో వివరించారు. అలాగే, తెలంగాణ ప్రాంతంలో లక్ష కోట్ల విలువైన భూమి ఆక్రమణలకు గురైందని, వీటిపై చర్యలు తీసుకోవాలని కూడా గోనె కోరారు. మాజీ ఎంపీ మధుయాష్కీ ఫోర్జరీ సర్టిఫికెట్ల వ్యవహారంలోనూ కేసు నమోదు చేయాలని సలావుద్దీన్ అహ్మద్‌కు గోనె ప్రకాశరావు మరో వినతిపత్రం అందజేశారు -
ఇంగ్లీష్ మీడియంలో ఇరగదీశారు
- సరాసరి కంటే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణత శాతం ఎక్కువ - 4.95 లక్షల మందిలో 4.60 లక్షల మంది పాస్ - మొత్తం విద్యార్థుల్లో సగం ఇంగ్లిషు మీడియం వారే - 10 జీపీఏ సాధించిన వారు 4,085 మంది - ఏపీ గురుకులాల హవా - విడుదలైన పదో తరగతి ఫలితాలు సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు అధిక ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన మొత్తం విద్యార్థుల సరాసరితో పోల్చితే ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎక్కువగా నమోదైంది. మొత్తంగా 83.17 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఇంగ్లిషు మీడియంలో మాత్రం 92.90 శాతం మంది పాసయ్యారు. రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతంతో పోల్చినా ఇంగ్లిష్ మీడియంలో ఉత్తీర్ణులైన వారి శాతమే ఎక్కువగా ఉంది. మార్చి/ఏప్రిల్ నెలల్లో జరిగిన పరీక్ష ఫలితాలను సచివాలయ డి బ్లాక్‌లో గురువారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ విడుదల చేశారు. ఈసారి పరీక్షలకు మొత్తంగా మొత్తంగా 12,15,391 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 10,10,960 మంది విద్యార్థులు (83.17 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు విద్యార్థులను మినహాయిస్తే.. రెగ్యులర్ విద్యార్థుల్లో 10,61,703 మంది పరీక్షలకు హాజరుకాగా 9,40,924 మంది (88.62 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సత్తా చాటిన బాలికలు.. పదో తరగతిలోనూ బాలికలే సత్తా చాటారు. బాలురు 87.96 శాతం వుంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 89.33 శాతం వుంది పాస్ అయ్యూరు. 5,44,538 మంది బాలురు పరీక్షలు రాయగా 4,78,955 మంది (87.96 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇక 5,17,165 మంది బాలికలు పరీక్షలు రాయగా 4,61,969 మంది (89.33 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఏపీ గురుకులాల హవా.. మేనేజ్మెంట్ల వారీగా చూస్తే ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల హవా కొనసాగింది. వాటిల్లో 95.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఈసారి బాలికల (94.07) కంటే బాలురు (97.68 శాతం) అధిక శాతం మంది ఉత్తీర్ణులు కావడం విశేషం. 99 స్కూళ్లు ఆంధ్రప్రదేశ్ గురుకులాల సొసైటీ పరిధిలో ఉండగా 91 పాఠశాలల విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 51 స్కూళ్ల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. 7,750 మంది పరీక్షలు రాయగా 7,602 మంది (98.1 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 48 గురుకుల బాలుర స్కూళ్లు ఉండగా 28 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు వచ్చాయి. 43 బాలికల పాఠశాలు ఉండగా 23 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకులాల్లోనూ బాలికల (90.22 శాతం) కంటే బాలురే (94.15 శాతం) అధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల.. ఈసారి పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో ఇంగ్లిషు మీడియం విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రైవేటు స్కూళ్లతోపాటు ప్రభుత్వ సక్సెస్ స్కూళ్లు, గురుకుల విద్యాలయాల్లో ఇంగ్లిషు మీడియం ఉండటమే ఇందుకు కారణం. 3,28,256 మంది విద్యార్థులు 2012లో ఇంగ్లిష్ మీడియంలో పదో తరగతి పరీక్షలు రాయగా, గత ఏడాది 4,62,984 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగి 4,95,225కు చేరుకుంది. అందులో 4,60,086 మంది (92.90 శాతం) ఉత్తీర్ణులయ్యారు. పది జీపీఏ గుంటూరులో అధికం..: గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) పదికి పది సాధించిన విద్యార్థులు గుంటూరులో ఎక్కువ మంది ఉన్నారు. మొత్తంగా పది జీపీఏ సాధించిన విద్యార్థులు 4,085 మంది ఉండగా, గుంటూరు జిల్లాలో 586 మంది పది జీపీఏ సాధించారు. ఆ తర్వాత స్థానంలో 562 మందితో రంగారెడ్డి నిలిచింది. పది జీపీఏ సాధించిన విద్యార్థుల సంఖ్యలో విజయనగరం జిల్లా (46 మంది) చివరి స్థానంలో నిలిచింది. గిరిజన గురుకులాల్లో 89.94 శాతం ఉత్తీర్ణత పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలోని 77 ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల నుంచి 89.94 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు గురుకులం కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. వీరిలో బాలికలు 90.50 శాతం, బాలురు 89.63 శాతమని వివరించారు. 5,606 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షకు హాజరుకాగా... 5,029 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. సీతంపేట, భద్రగిరి, దమ్మపేట, కొమరాడ, కులకచెర్ల, మల్లి, తుమ్మలవలస, కొయ్యూరు, జి.మాడుగుల బాలుర గురుకుల పాఠశాలలో, భద్రగిరి, కొత్తగూడ, కూనవరం, సీతంపేట, వనపర్తి బాలికల పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొన్నారు. -
నెలాఖరున ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరపు ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో, ద్వితీయ సంవత్సరపు ఫలితాలు మే మొదటి వారంలో ప్రకటించనున్నారు. గవర్నరు సలహాదారు సలావుద్దీన్ అహ్మద్‌కు విద్యాశాఖ అధికారులు ఈ మేరకు వివరించారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియెట్ కమిషనర్‌తో సలావుద్దీన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్‌తో పాటు ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మే 25 నుంచి జూన్ 1 వరకూ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు ఆయనకు వివరించారు. అనధికారిక కోతలతో ఇబ్బందులకు గురిచేయెద్దు... అనధికారిక విద్యుత్ కోతలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని ఇంధనశాఖ అధికారులను గవర్నరు సలహాదారు సలావుద్దీన్ అహ్మద్ ఆదేశించారు. ఇంధనశాఖ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 800 మెగావాట్ల కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటు రెండో దశ యూనిట్‌ను త్వరగా పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.