breaking news
Sahir
-
మార్పే మంత్రము
ఎదుటివాళ్లలో ఆశించే మార్పు ముందు నీ నుంచే మొదలవ్వాలి అంటాడు మహాత్మా గాంధీ.. ఈ మాటనే బాటగా చేసుకున్నట్టున్నాడు ఈ కుర్రాడు.. http://forthechange.comఅనే వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు!. అతని పేరు.. సాహిర్ భారతి.. ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్.. లాగిన్ అవుదాం.. ..:: శరాది సాహిర్ భారతి.. పేరులోనే బోలెడంత ప్రేరణ ఉంది. హిందీ కవి సాహిర్ లుధియాన్విలోని సాహిర్‌కు, తమిళ కవి సుబ్రహ్మణ్య భారతిలోని భారతిని చేర్చి ఈ కుర్రాడికి నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. అమ్మానాన్న ఆశపడ్డట్టుగానే ఆ ఇద్దరి రచనా లక్షణాన్ని పుణికి పుచ్చుకుని సార్థకనామధేయుడయ్యాడు సాహిర్ భారతి. కాస్త బుద్ధి తెలిసినప్పటి నుంచి కవిత్వం రాయడం మొదలుపెట్టాడు. మూడు నెలల కిందట.. తనలాంటి ఆలోచనలే ఉన్న కొంతమంది స్నేహితులను కలుపుకొని ఓ గ్రూప్‌గా ఏర్పడి http://forthechange.com/వెబ్సైట్ ప్రారంభించాడు. ఇందులో పాటలు, ఉపన్యాసాలు, సినిమాలు ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ మూడు భాషల్లో. అన్నీ యువతలో స్ఫూర్తినింపేవే. విలువలను పెంచేవే. ఇదంతా కూడా ఈ గ్రూప్ ఆశిస్తున్న మార్పును తేవడానికే. "A single drop can make a difference in the ocean'అయినప్పుడు మా యువశక్తి సమాజాన్నెందుకు మార్చలేదు అంటాడు సాహిర్. అందుకే ఈ తపన అని చెప్తాడు. ‘నా కోరికలో స్వార్థం ఉండొచ్చు. ఆ స్వార్థం.. అసమానతలేని సమాజం కోసం.. స్త్రీని గౌరవించే సంప్రదాయాన్ని ఏర్పాటు చేయడం కోసం.. ప్రేమ, ఆప్యాయతలను మాత్రమే పంచుకునే మనుషుల కోసం’ అంటూ తన లక్ష్యాన్ని వివరిస్తాడు. ఇంకేం చేస్తుందీ ఫర్‌దిచేంజ్ డాట్ కామ్ దీని వయసు మూడు నెలలే అయినా ముప్పై ధ్యేయాలను పెట్టుకొంది. ఒక్కొక్కటే నెరవేర్చుకుంటూ వెళ్తోంది. ఈ వెబ్‌సైట్‌ని రోజుకు రెండువేల మంది విజిట్ చేస్తున్నారు. నెల కిందట ఫేస్‌బుక్‌లోనూ పేజ్ తెరిచారు. ముప్పై రోజుల్లోనే వెయ్యిమంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ఈ వెబ్సైట్లో వచ్చే యాడ్సే వీళ్లకు ప్రధాన ఆదాయం. రూపాయి కూడా వృథా పోవడానికి వీల్లేదంటాడు సాహిర్. ఆ డబ్బుని సమాజంలోని అన్నార్థులకు, ఇతర అవసరార్థులకే ఖర్చు చేస్తున్నాం అని చెప్తాడు. మొదటి నెల.. వచ్చిన ఆదాయాన్ని ఫుట్‌పాత్‌ల మీదున్న వారి ఆకలి తీర్చడానికి ఖర్చుపెట్టారు. ఈ సేవనుహైదరాబాద్లోని ఒక్క వీధికో.. ఒక మెయిన్ రోడ్ మీది ఫుట్పాత్కో పరిమితం చేయలేదు. హైదరాబాద్ ఊరంతా తిరిగి ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తికి అన్నం, పప్పు, కూర వడ్డించి కడుపు నింపారు. రెండో నెల ఆదాయంతో స్వచ్ఛభారత్‌లో భాగమై ఐదు వందల డస్ట్‌బిన్స్ కొననున్నారు. ‘స్వచ్ఛభారత్ అని చెప్పి ఏ నెక్లెస్ రోడ్డునో.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లనో ఊడ్వటం కాదు.. ఎవరి వీధులను వాళ్లు ముందు శుభ్రం చేసుకోవాలి. ఇది ఒక్క రోజుతోనో, ఒక్క వారంతోనో అయిపోయేది కాదు.. స్వచ్ఛత నిరంతర ప్రక్రియ. కాబట్టి మన వాకిళ్లలోని చెత్తంతా వీధి చివర మూల మలుపులో ముడుపుగా ఉండొద్దు కదా.. చెత్తబుట్టలో సర్దుకోవాలి. ఆ శుభ్రత కోసమే ముందుగా ఐదువందల డస్ట్‌బిన్స్ కొంటున్నాం’ అని ఆ క్యాంపేన్ని వివరించాడు సాహిర్. దీనిలో తమతో భాగస్వామ్యం పంచుకోవడానికి ప్రియ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఫర్దిఛేంజ్ డాట్ కామ్‌ను సంప్రదించిందట. ఆ తర్వాత.. నిధుల్లేక ఆగిపోయిన వృద్ధాశ్రమాలనూ తిరిగి నిర్వహించాలనుకుంటోంది ఫర్‌దిచేంజ్ డాట్ కామ్. భూమికలాంటి సంస్థల సహకారంతో. ‘ఇలా వివిధ రంగాల్లో సేవ చేస్తున్న ఎవరైనా మాతో కలిస్తే కలుపుకొంటాం.. లక్ష్యసాధనలో తోడుగా ఉంటాం. మా వింగ్స్‌ని ఎంత వీలైతే అంత స్ప్రెడ్ చేస్తాం. మా వల్ల కనీసం ఒక్క మనిషి మారినా చాలు. అతనే వందల మందికి స్ఫూర్తినివ్వొచ్చు కదా’ అంటాడు సాహిర్. అసలు ఫర్ ది చేంజ్ డాట్ కామ్ పుట్టడానికి కారణం? 2012లో సాహిర్ రోడ్డు ప్రమాదంలో గాయపడటం. పదమూడు గంటల బ్రెయిన్ సర్జరీ.. అతని బతుకుమీద ఆశను ఎంత వదిలేసిందో.. ఆత్మవిశ్వాసాన్నీ అంతే నింపింది. ఏడాదిన్నర మంచానికి అతుక్కుపోయినా పోరాటం ఆపలేదు. అప్పుడే నారాయణన్ కృష్ణన్ అనే ఓ తమిళ యువకుడు గుర్తొచ్చాడు సాహిర్‌కి. యువ ఇంజనీర్‌గా మంచి ఉద్యోగం, ఉజ్వల భవిష్యత్తు ఉన్న అతను అనాథల సేవ కోసం అన్నిటినీ వదులుకున్నాడు. అతని మీద తను రాసిన కవితా మదిలో మెదిలింది. ఓ ఉత్సాహం మనసులో నిండింది. ‘అంత ప్రమాదంలోనూ నా ఊపిరి పోలేదంటే.. నా జన్మకు ఏదో అర్థం ఉండే ఉండాలి. యాక్సిడెంట్ జీవితం విలువను చెప్పింది. నేను చేయగల పనులేంటో చూపింది. డిప్రెషన్.. కొత్త దారినిచ్చింది. నడవాలి.. పదిమందిని నడిపించాలి. నారాయణన్‌లా కొత్త మార్పునకు తనే నాంది ఎందుకు కాకూడదు అనుకున్నాడు.. ఫర్‌దిచేంజ్ డాట్ కామ్‌ను కన్నాడు. నడిపిస్తున్నాడు తన బృందంతో కలిసి. ఆల్ ది బెస్ట్ ఫర్ ది గుడ్ చేంజ్! -
మౌనప్రేమ
పాతకథ ప్రసిద్ధ రచయిత్రి అమృతాప్రీతమ్, సుప్రసిద్ధ కవి సాహిర్ లుధియాన్వీల మధ్య గాఢమైన ప్రేమ ఉండేదని అంటారు. అమృతా ప్రీతమ్‌కు సాహిర్ వల్ల ఒక కొడుకు కూడా ఉన్నాడని మరో పుకారు. సాహిత్యలోకంలో విస్తృతంగా చక్కర్లు కొట్టే ఈ గాసిప్ వెనుక ఉన్న అసలు సంగతిని అమృతా ప్రీతమ్ మాటల్లోనే చదవండి. 1960లో నేను బొంబైలో వున్నప్పుడు నాకూ రాజేందర్‌సింగ్ బేడీకి (ప్రసిద్ధ ఉర్దూ కవి) స్నేహమేర్పడింది. తరచూ కలిసే వాళ్లం. ఒకనాడు అతడు అకస్మాత్తుగా ‘నీ కుమారుడు నవరాజ్కు తండ్రి సాహిర్ అని అందరూ అంటున్నారే’ అని పలికాడు. ‘ఊహామాత్రంగా ఆ మాట కరెట్టే; నిజానికైతే అది కరెట్టు కాదు’ అన్నాను. 13 ఏళ్ల వయసున్న నవరాజ్ కూడా ఒకసారి నాతో ‘మమ్మీ. నిన్నో ప్రశ్న అడుగుతాను నిజం చెప్తావా?’ అన్నాడు. ‘తప్పక చెప్తాను’ ‘నేను అంకుల్ సాహిర్ కొడుకునా?’ ‘కాదు’ ‘అయివుంటే చెప్పమ్మా. అంకుల్ అంటే నాకిష్టమే’ ‘నాకూ అంతే బాబూ. కానీ నువ్వనుకుంటున్నది నిజమయి వుంటే నీకు ‘నిజమే’నని చెప్పివుండేదాన్ని’ తాను సాహిర్ సంతానం కాదని నా పిల్లవాడికి నమ్మకం కుదిరింది. కానీ ఊహాజనితమైన నిజం, అసలు నిజానికేమీ తీసిపోదని అనుకుంటాను. సాహిర్ ఎప్పుడు లాహోర్ వచ్చినా నా మౌనముద్రకు సమ్మోహితుడయ్యేవాడనుకుంటాను. ఆ మౌనంలో అతడెంత భాగం పంచుకునేవాడంటే కుర్చీలో అలాగే మౌనంగా కూచునేవాడు. తాను కుర్చీలో నుంచి లేచి వెళ్లిపోయే వరకూ మాటామంతీ లేకుండా అలాగే వుండి పోయేవాడు. సిగరెట్టు వెంబడి సిగరెట్టు కాలుస్తూ వుండేవాడు. సిగరెట్టులో సగం కాల్చి, దాన్ని నొక్కి ఆర్పేసి, మళ్లీ మరొకటి వెలిగించుకునేవాడు. అతడు లేచి వెళ్లిపోయింతర్వాత, అతడు కూచున్న చుట్టుపట్టంతా సిగరెట్టు పీకలు పడి ఉండేవి. ఒక్కోసారి అతణ్ణి ముట్టుకోవాలని నాలో తీవ్రంగా అనిపించేది. కానీ నా పరిమితులు నాకు ఉండేవి; వాటిని అతిక్రమించలేకపోయేదాన్ని. ఆ కాలంలో నేను అధికంగా నా ఊహాలోకంలో జీవిస్తుండేదాన్ని. అతడు వెళ్లిపోయిన తర్వాత అక్కడ పడివున్న సిగరెట్టు పీకల్ని పోగుచేసి రహస్యంగా ఒక అల్మరాలో దాచేదాన్ని. అటు తర్వాత అడపా దడపా వాటిని ముట్టుకునేదాన్ని. ఆ సిగరెట్టు తుంపును చేత్తో పట్టుకుని, అంతకుమునుపు అతడి వేళ్లు ఆ సిగరెట్టును ముట్టుకున్నై అనేది గుర్తుంచుకొని, దానిని నేనూ ఇప్పుడు వేళ్లమధ్య ఉంచుకున్నాను కాబట్టి అతడి వేళ్లను నేను ముట్టుకున్నట్లు ఫీలయ్యేదాన్ని. సిగరెట్టు కాల్చడమనేది నాకా విధంగా అలవాటయింది. ఆ సిగరెట్టు సువాసనలో అతడు నా ముందు ఉన్నట్లు భావించుకునేదాన్ని. వెలిగించిన సిగరెట్టు నుండి ఉంగరాలు ఉంగరాలుగా పొగపైకి లేస్తుంటే, ఆ పొగలో నుండి అతడి ఆకారం తొంగి చూస్తున్నట్లుండేది. ఈ ఊహాలోకం ఎవరైతే సృష్టించుకుంటారో అది కేవలం వారికే చెందుతుంది. కానీ ఈ లోకంలోని వ్యక్తులు ఓ వింత శక్తిని సంతరించుకుంటారు. - నీలంరాజు లక్ష్మీప్రసాద్