breaking news
Russian space shuttle
-
శాటిలైట్లను పేల్చేసే ఉపగ్రహం ప్రయోగించిన రష్యా
వాషింగ్టన్: శత్రుదేశాలైన అమెరికా, రష్యా అంతరిక్ష యుద్ధానికి తెరతీస్తున్నాయా? ఇప్పటి పరిణామాలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. రష్యా అంతరిక్ష సంస్థ ఈ నెల 16న భూదిగువ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రయోగించిందని అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ మంగళవారం చెప్పారు. ఇది అంతరిక్షంలోని ఉపగ్రహాలను పేల్చేసే సామర్థ్యం కలదని వెల్లడించారు. ఇప్పటికే అదే కక్ష్యలో ఉన్న తమ ప్రభుత్వ ఉపగ్రహం ’యూఎస్ఏ 314’ను దెబ్బతీయడానికే రష్యా ఈ చర్యకు పూనుకుందని ఆరోపించారు. దీనిపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా స్పందించారు. ఈ నెల 17న సోయుజ్–2.1బీ వాహక నౌక ద్వారా ‘కాస్మోస్ 2576’ ప్రయోగించిన మాట నిజమేనని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోగం తమ రక్షణ శాఖ ప్రయోజనాలకే తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా ఉపగ్రహం, రష్యా తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం ఒకే కక్ష్యలో ఉన్నాయని అంతరిక్ష నిపుణులు చెప్పారు. ఉక్రెయిన్ సైన్యానికి సహకరించే అమెరికా శాటిలైట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని రష్యా ఇటీవలే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
మే 8న మండిపోనున్న రష్యా వ్యోమనౌక
మాస్కో: భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోని వ్యోమగాములకు సరుకులు తీసుకెళ్లి దారితప్పిన రష్యా ‘ప్రోగ్రెస్’ వ్యోమనౌక శుక్రవారం భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం 1:23 నుంచి రాత్రి 9:55 గంటల మధ్య ఈ వ్యోమనౌక కూలిపోనుందని బుధవారం రష్యా అంతరిక్ష సంస్థ ‘రాస్కాస్మోస్’ వెల్లడించింది. వ్యోమనౌక పూర్తిగా నింగిలోనే మండిపోనుందని, దానికి చెందిన కొన్ని శకలాలు మాత్రమే భూమిపై పడే అవకాశముందని తెలిపింది. ఐఎస్ఎస్కు ఏప్రిల్ 28న రాకెట్ ద్వారా పంపిన మానవ రహిత ప్రోగ్రెస్ వ్యోమనౌక సరైన కక్ష్యకు చేరకపోవడంతో పాటు నియంత్రణ కోల్పోవడం, భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా నేలవైపు ప్రయాణిస్తుండటం తెలిసిందే. 2011లో కూడా రష్యాకు చెందిన ఓ ప్రోగ్రెస్ వ్యోమనౌక ప్రయోగించిన వెంటనే సైబీరియాలో కూలిపోయింది.