breaking news
RTC workers protest
-
మెదక్ డీఎం వైఖరికి నిరసనగా ఆర్టీసీ కార్మికుల ధర్నా
సాక్షి, మెదక్: కొన్ని రోజులుగా మెదక్ ఆర్టీసీ డీఎంకు కార్మికులకు మధ్య నివురుగప్పిన నిప్పులా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరి మధ్య విభేదాలు గురువారం తారా స్థాయికి చేరటంతో కార్మికులు ఏకంగా డీఎం కార్యాలయం ఎదుట గంటపాటు ధర్నా చేసి డీఎం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. బస్సులు ఎక్కడికక్కడా ఆగిపోవటంతో విషయం తెలుసుకున్న పోలీసులు డీఎంకు కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహించడంతో నాలుగు గంటల పాటు కొనసాగిన చర్చలు చివరకు విఫలమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆగస్టు 28న, ఆర్టీసీ టీఎంయూ రాష్ట్రకమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్ఎం కార్యాలయాల ఎదుట ధర్నాలు చేశారు. ఇందులో భాగంగా మెదక్ డిపోకు చెందిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లతో పాటు ఇతర సిబ్బంది సుమారు 70 మంది సంగారెడ్డి ఆర్ఎం కార్యాలయానికి ధర్నాకు వెళ్లారు. దీంతో ఆ మరుసటి రోజు నుంచి డిపో మేనేజర్ జాకీర్ హుస్సేన్ కార్మికులపై కక్షకట్టి 65 మంది కార్మికులకు చార్జిమెమో ఇచ్చారని, దీనికి నిరసనగా గురువారం డిపో ఎదుట ధర్నాకు దిగారు. కార్యక్రమంలో కార్మికులనుద్ధేశించి టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి ఎంఆర్‌కె రావు, డిపో కార్యదర్శి శాకయ్యలు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాకు వెళ్తే మాపై కావాలనే డీఎం కక్షగట్టి చార్జిమెమో ఇచ్చారని మండిపడ్డారు. అంతే కాకుండా నాటి నుంచి నేటివరకు జ్వరమొచ్చినా, మరేమైన అత్యవసర మొచ్చి సెలవు అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు. సరిపడా సిబ్బంది లేకపోయినా అదనపు భారం పైన వేసుకుని బస్సులను నడుపుతూ అనేక ఇబ్బందులు పడుతూ డిపో అభివృద్ధికోసం అహర్నిశలు కష్టపడుతున్నా మాపై డీఎం కావాలనే ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చే చాలీచాలని జీతాలు ఆలస్యంగా ఇస్తున్నా పనిచేస్తున్నామన్నారు. ముఖ్యంగా టీమ్ డ్రైవర్లను డీఎం మరింత వేధిస్తున్నారన్నారు. కండక్టర్ లేకుండా డ్రైవరే బస్సు నడుపుతూ టికెట్లు ఇస్తూ సకాలంలో ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుస్తున్నా ఎవరైనా చిన్నపాటి ఫిర్యాదులు చేసినా డ్రైవర్లను అనేక ఇబ్బందులు పడుతూ మెమోలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు మండిపడ్డారు. మెదక్ డిపో రాష్ట్రంలో 5వ, స్థానంలో ఉందని రాత్రింబవళ్లు కార్మికులు కష్టపడంతోనే ఆ స్థానంలో నిలిచిందని ఇటీవలే ఉన్నతాధికారుల చేతుల మీదుగా డీఎం అవార్డును సైతం అందుకున్నాడని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు బోస్, మొగులయ్య, అశ్వక్హైమద్, ఆర్కె రెడ్డి, యాదయ్య, సంగమేశ్వర్, సత్యం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విఫలమైన చర్చలు? పోలీసుల మధ్యవర్తిత్వంతో టీఎంయూ నాయకులు, డీఎం మధ్య సుమారు 4 గంటల పాటు చర్చలు జరిగాయి. కార్మికుల డీఎం ముందు పెట్టిన పలు సమస్యలకు డీఎం సమాధానమిస్తూ ఇవి నా పరిధిలోనివి కావని ఉన్నతాధికారుల పరిధిలోనివని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు వచ్చేవరకు మా ఆందోళన ఆగదని టీఎంయూ నాయకులు స్పష్టం చేశారు. ఉన్నతాధికారులు శుక్రవారం మెదక్ డిపోకు వచ్చి కార్మికులతో మరోమారు చర్చలు జరుపుతారని విశ్వసనీయ సమాచారం. సహాయ నిరాకరణే అకారణంగా 65 మంది కార్మికులకు ఇచ్చిన చార్జిమెమోలను వెంటనే ఉప సంహరించుకోవాలి. అదేవిధంగా టీమ్ డ్రైవర్లపై వేధింపులు బేషరతుగా మానుకోవాలి. కార్మికుల్లో ఎవరికి ఆపద వచ్చినా ఆరోగ్యం బాగలేకపోయిన సెలవులు మంజూరు చేయాలి. వాటితో పాటు మరికొన్ని న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తేనే విధుల్లో చేరుతాం లేకుంటే డీఎం మొండి వైఖరికి నిరసనగా సహాయ నిరాకరణ చేయక తప్పదు. – టీఎంయూ డిపో సెక్రెటరి శాఖయ్య -
సమ్మెసెగ
- బస్టాండ్‌లో ఉద్రిక్తత - బస్సు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తులు - ఆర్టీసీ కార్మికుల పనేనని పోలీసుల జులుం - గౌతంరెడ్డి సహా పలువురు నేతల అరెస్టు, విడుదల - పలు ప్రాంతాల్లో పోలీసుల ఫైర్ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, నినాదాలు, అరెస్టులతో నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ శనివారం రణరంగాన్ని తలపించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసన ప్రదర్శనలోకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి ఎక్స్‌ప్రెస్ బస్సు అద్దాలు పగలగొట్టడంతో రెచ్చిపోయిన పోలీసులు ఆందోళనకారులపై తమ ప్రతాపాన్ని చూపించారు. ఈడ్చుకెళ్లి వాహనాల్లో పడేసి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు తిప్పారు. 56మందిపై కేసులు నమోదుచేసి సాయంత్రం విడుదల చేశారు. బస్‌స్టేషన్ : ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా నాల్గోరోజు శనివారం నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ డిపో నుంచి మెయిన్ గేటు వరకు నిరసన ర్యాలీ జరి పారు. ఈ క్రమంలో కార్మిక సంఘాల నేతలు మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. దీనికి వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మద్దతు తెలిపి కార్మికులతో పాటే బైఠాయించారు. ఇదిలావుంటే.. బస్టాండ్‌లో ప్లాట్‌ఫాంపై ఉన్న గుంటూరు-రాజమండ్రి బస్సు అద్దాలను రాధాకృష్ణ, రమేష్, రాజు, సుబ్బారావు అనే వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనిపై బస్సు యజమాని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బస్టాండ్ ప్రధాన గేటు వద్ద నిరసన జరుపుతున్న కార్మికులకు సంబంధం లేని వ్యక్తులు అద్దాలు పగలకొట్టడంతో పోలీసులు నిరసనకారులపై జులం ప్రదర్శించారు. ఆర్టీసీ కార్మికులు, వారికి మద్దతు ప్రకటించడానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీస్ వాహనాల్లో పడేశారు. అరెస్ట్, విడుదల బస్టాండ్‌లో నిరసన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. తొలుత నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాచవరం, సత్యనారాయణపురం, ఉయ్యూరు, పమిడిముక్కల పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 56 మందిపై 151 సీఆర్సీ కేసు నమోదు చేశారు. అనంతరం సాయంత్రం ఆరు గంటల సమయంలో విడుదల చేశారు. స్టేషన్ల నుంచి వచ్చిన వారంతా పాత బస్టాండ్‌లో కార్మికులతో సమావేశమయ్యారు. పోలీసుల తీరు దారుణం : గౌతంరెడ్డి కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటంలో పోలీసులు చూపిన తీరు దారుణమని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి విమర్శించారు. ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు. నగరంలో ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని ఆయనను కలుస్తారని, ఆందోళన చేస్తారని స్టేషన్లకు తరలించారని చెప్పారు. అరెస్టులతో భయపెట్టి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. అంతకుముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో గౌతంరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి కార్మికుల వల్లే నష్టం వచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేకపోవడం మంచిదికాదన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను, ప్రజల ఇబ్బందులను గుర్తించి ప్రభుత్వం త్వరగా స్పందించాలని కోరారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వైవీ రావు మాట్లాడుతూ గతంలో జరిపిన చర్చల్లో కార్మికులను మోసం చేసిన యాజమాన్యం, ఇకపై మోసగించేందుకు అవకాశం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు విశ్వనాథ రవి, సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్, సీఐటీయూ నాయకులు ముజఫర్ అహ్మద్, ఆర్టీసీ యూనియన్ నేతలు ఎన్‌హెచ్‌ఎన్ చక్రవర్తి, యార్లగడ్డ రమేష్, టీవీ భవాని, నారాయణ, మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.