‘ఫీజు’ ఇచ్చేదెప్పుడు?
* రెండేళ్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కావాల్సింది రూ.4,800 కోట్లు
* ఈ ఏడాది ఇప్పటిదాకా ఇచ్చింది రూ.వెయ్యికోట్లే
* రెండున్నర నెలల్లో మరో రూ. 3,800 కోట్లు అవసరం
* ఈ మార్చికల్లా గతేడాది ఫీజు బకాయిలు మాత్రమే చెల్లించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం (2015-16) ముగియబోతున్నా.. బడుగు, బలహీన, అణగారిన వర్గాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మాత్రం నిధులు విడుదల కావడం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద గత ఏడాది (2014-15) బకాయిలే సుమారు రూ.2,400 కోట్లు ఉండగా... ఈ ఏడాది (2015-16) చెల్లించాల్సినవి మరో దాదాపు రూ.2,400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
అంటే మొత్తంగా రూ. 4,800 కోట్ల వరకూ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు విడుదలైన నిధులు సుమారు రూ. వెయ్యి కోట్లే కావడం గమనార్హం. మిగతా సుమారు 3,800 కోట్లను వచ్చే రెండు నెలల్లో చెల్లించడం సాధ్యమయ్యేనా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
బకాయిలే చెల్లించలేదు..
గత ఏడాది మొత్తం 13,76,026 మంది విద్యార్థులకు సంబంధించి కాలేజీలకు ట్యూషన్ ఫీజు (ఆర్టీఎఫ్) కింద రూ. 1,900 కోట్లు, విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు (ఎంటీఎఫ్)కింద రూ. 500 కోట్లు అవసరమని ఈ పథకానికి నోడ ల్ ఏజెన్సీగా ఉన్న ఎస్సీ అభివృద్ధిశాఖ అంచనాలను రూపొందించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం(2015-16)లో మొత్తం 13,69,564 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. వీరికి పూర్తిస్థాయిలో ఫీజులను చెల్లించేందుకు దాదాపుగా రూ. 2,400 కోట్ల మేర నిధులు అవసరం. మరో రెండు నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుండగా... గత ఏడాది బకాయిలే సగం వరకు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాదికి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులే మొదలుపెట్టలేదు.
విడుదలైనవి రూ. 1,070 కోట్లే..
ఈ నెల 11వ తేదీ వరకు అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలిస్తే... 2014-15 ‘ఫీజు’ బకాయిల కోసం రూ.1,070 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. అంటే గతేడాది బకాయిలను పూర్తిగా చెల్లించడానికే ఇంకా రూ. 1,400 కోట్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. ఇక 2015-16కు సంబంధించి ఇంకా కాలేజీలకు ట్యూషన్ ఫీజులు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల చెల్లింపే మొదలుకాలేదు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే మార్చి చివరికల్లా గతేడాది బకాయిలను విడుదల చేయడమే కష్టంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ఏడాది నిధుల విడుదల వచ్చే ఏడాదికే వాయిదా పడే అవకాశం కనిపిస్తోందనే అభిప్రాయాలు వస్తున్నాయి.