‘ది 100’ విజయం ఆరంభం మాత్రమే : రాఘవ్ ఓంకార్ శశిధర్
"ది 100" చిత్రంతో తొలి దర్శకుడిగా అడుగుపెట్టి, బాధ్యతాయుతమైన పోలీస్ డ్రామాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు రాఘవ్ ఓంకార్ శశిధర్. జూలై 11న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు వచ్చిన స్పందనపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ, "ఈ చిత్రం కేవలం పోలీస్ కథ కాదు, భావోద్వేగం, బాధ్యత, నీతితో కూడిన కథాంశం. నిజాయితీ గల ఐపిఎస్ అధికారి విక్రాంత్‌గా ఆర్కే సాగర్, అలాగే మిషా నారంగ్, ధన్య బాలకృష్ణ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా ఈ చిత్రంలోని ఎమోషన్స్‌తో బాగా కనెక్ట్ అయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నాగబాబు, అంజనా దేవి, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. థియేటర్లలో సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, మీడియాకు, నిర్మాతలు రమేష్ కరుటూరి, వెంకీ పూషడపు, జే తారక్ రామ్, హీరో ఆర్కే సాగర్లకు కృతజ్ఞతలు. ఈ విజయం నా జర్నీలో మొదటి అడుగు మాత్రమే. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నాను," అని అన్నారు.