breaking news
River board
-
నోటిఫికేషన్ ఏపీ హక్కులను కాపాడుతుంది: శ్యామలరావు
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ హక్కులను కాపాడుతుందన్నారు ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు. అయితే నోటిఫికేషన్లో కొన్ని తప్పిదాలున్నాయని.. వాటిని సరిచేయమని కేంద్రాన్ని కోరతామన్నారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని ఏపీలోనే ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని శ్యామలరావు గుర్తు చేశారు. ఏపీలోని కొన్ని ప్రాజెక్ట్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావడం అనవసరం అన్నారు శ్యామలరావు. ప్రాజెక్ట్‌ల నుంచి నీటిని విడుదల చేశాక.. ఎలా వినియోగించుకోవాలనేది దిగువ రాష్ట్రంగా ఏపీకున్న హక్కన్నారు శ్యామలరావు. దిగువనున్న ఏపీలో ప్రాజెక్ట్‌లు, కాల్వలు బోర్డు పర్యవేక్షణలో ఉంటే పంటలు దెబ్బతింటాయని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల అంశం చాలా సున్నితమైనదని.. దాన్ని నోటిఫై చేస్తే ఒక లాభం.. చేయకుంటే మరో లాభం అన్నారు శ్యామలరావు. -
ముగిసిన గోదావరి రివర్ బోర్డ్ మీటింగ్
హైదరాబాద్: గోదావరి రివర్ బోర్డ్ సమావేశం గురువారం జలసౌధలో జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. అయితే పట్టిసీమ ప్రాజెక్టు పోలవరంలో అంతర్భాగమని ఏపీ ఇరిగేషన్ అధికారులు తెలిపారు. అలాగే తెలంగాణలో గోదావరి నదిపై చేపడుతున్న కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఇవ్వాలని ఏపీ అధికారులు కోరగా అందుకు డీపీఆర్‌లు ఇంకా తయారు కాలేదని తెలంగాణ అధికారులు సమాధానం ఇచ్చారు. -
లెక్క తేలింది
కృష్ణా జలాల్లో తెలంగాణకు 20, ఆంధ్రప్రదేశ్‌కు 10 టీఎంసీలు * లభ్యతగా ఉన్న 30 టీఎంసీల పంపకంపై బోర్డు సమక్షంలో కుదిరిన అవగాహన * వాస్తవ వినియోగ లెక్కలు సరిచూసుకున్నాక తుది నిర్ణయం * ఇప్పటివరకు వినియోగించిన జలాలు సుమారు 152 టీఎంసీలు * అందులో తెలంగాణ 47, ఏపీ 105 టీఎంసీల వాడకం * వినియోగించిన, ప్రస్తుత లభ్యత జలాలు కలిపి ‘36.8 : 63.2’ నిష్పత్తిన పంపకం... కృష్ణా డెల్టాకు విడుదల చేయనున్న 4 టీఎంసీలు * ఏపీ వాటాలోంచి..తెలంగాణ కేటాయింపుల్లోంచి హైదరాబాద్‌కు 1.2 టీఎంసీలు * బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తేవడంపై చర్చ వాయిదా సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల్లో నీటి పంపకాల లెక్కతేలింది. ఇప్పటివరకూ ఏ రాష్ట్రం ఎంత వినియోగించుకున్నదీ, ఇంకా ఎంత నీటి వాటా ఉన్నదీ కృష్ణా బోర్డు భేటీలో ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ప్రస్తుతం కృష్ణా ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న 30 టీఎంసీల్లో 20 టీఎంసీలు తెలంగాణకు, 10 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు అందేలా ప్రాథమికంగా అవగాహన కుదిరింది. తుంగభద్ర జలాలతో సహా ఇప్పటివరకూ కృష్ణా పరీవాహకంలో ఏపీ ఎక్కువగా నీటిని వాడుకోగా... ప్రస్తుత లభ్యత జలాల్లో తెలంగాణకు ఎక్కువగా నీటి వాటా వస్తోంది. ఇప్పటివరకు జరిగిన నీటి వినియోగంపై ఇరు రాష్ట్రాలు వాస్తవ లెక్కలను బోర్డుకు సమర్పించిన తర్వాత... లభ్యత జలాల పంపిణీపై బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు తెలిపారు. నాలుగు గంటల పాటు చర్చ కృష్ణా జలాల వినియోగం, లభ్యత జలాల పంపిణీ, బోర్డు పరిధి, పరిపాలనాపరమైన అంశాలపై చర్చించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బుధవారం హైదరాబాద్‌లోని కేంద్ర జల సంఘం కార్యాలయంలో భేటీ అయింది. ఈ భేటీకి బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ కార్యదర్శులు ఎస్కే జోషి, ఆదిత్యనాథ్‌దాస్, ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావులతో పాటు తెలంగాణ తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణా నదిలో నీటి లభ్యత, వాటాల మేరకు వినియోగం, అవసరాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ చెబుతున్న లెక్కల కంటే అదనంగా మరో 7 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు తెలంగాణ పేర్కొంది. కృష్ణాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని.. లభ్యత నీటిని ‘36.8 : 63.2’ నిష్పత్తిన పంచుకోవాల్సి ఉందని తెలిపింది. ‘‘ఇప్పటివరకు మొత్తంగా ఇరు రాష్ట్రాలు కలిపి 152 టీఎంసీలు వినియోగించుకోగా.. తెలంగాణ 47, ఏపీ 105 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. ఏపీ కేవలం శ్రీశైలం, సాగర్ల కింది నీటి వినియోగ లెక్కలను మాత్రమే చెబుతోంది. బేసిన్లోనే ఉన్న తుంగభద్ర నీటి వినియోగాన్ని ఇందులో కలపడం లేదు. అది కూడా కలిపితే ఏపీ అదనంగా మరో 7 టీఎంసీలు వాడుకున్నట్లు తేలుతోంది. ఈ దృష్ట్యా ప్రస్తుతం లభ్యతగా ఉన్న 30 టీఎంసీల్లో 7 టీఎంసీలను తెలంగాణకు ఇవ్వాలి. ఇవి తీసేయగా మిగిలిన 23 టీఎంసీలను పంచాలి. తొలుత వాడుకున్న అదనపు జలాలతో సహా మొత్తం నీటిని ‘36.8 : 63.2’ వాటా నిష్పత్తి మేరకు లెక్కిస్తే... ప్రస్తుత లభ్యత నీటిలో తెలంగాణకు 20 టీఎంసీలు (అదనపు 7 టీఎంసీలు+వాటా 13 టీఎంసీలు), ఏపీకి 10 టీఎంసీలు దక్కుతాయి. ఈ విధంగానే పంపకం జరగాలి..’’ అని వివరించింది. ప్రస్తుతం కృష్ణా డెల్టాకు కేటాయించిన 4 టీఎంసీలను ఏపీ వాటాగా వచ్చే 10 టీఎంసీల్లోంచే తీసుకోవాలని... హైదరాబాద్ అవసరాలకు 1.2 టీఎంసీలను తమ వాటాలోంచే తీసుకుంటామని స్పష్టం చేసింది. తెలంగాణ వాదనలపై సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన ఏపీ... వాస్తవ వినియోగ లెక్కలను సరిచూసుకున్నాక తుది నిర్ణయం చెబుతామని తెలిపింది. నికరంగా దక్కేది 17 టీఎంసీలే.. తెలంగాణకు దక్కే 20 టీఎంసీల్లో 3 టీఎంసీల మేర ఆవిరి నష్టాలుంటాయని... అవి తీసేస్తే నికరంగా దక్కేవి 17 టీఎంసీలు మాత్రమేనని సమావేశం అనంతరం నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ 17 టీఎంసీల నీటిని జూలై దాకా హైదరాబాద్‌కు 9 టీఎంసీలు, ఏఎంఆర్పీకి 3 టీఎంసీలు, సాగర్ ఎడమ కాల్వకు 5 టీఎంసీల చొప్పున వినియోగించుకుంటామని పేర్కొన్నారు. శ్రీశైలం భద్రతపై కమిటీ శ్రీశైలం డ్యామ్ భద్రతపై ఈ సమావేశంలో చర్చించారు. గతంలో కృష్ణాకు వరదలు వచ్చిన సందర్భంగా డ్యామ్ దిగువన ఉన్న కొండ చరియలు కొట్టుకుపోయాయి. దానివల్ల డ్యామ్ కొద్దిమేర బలహీనపడిందని... ప్లంజ్‌పూల్, కాపర్ డ్యామ్ దెబ్బతిన్నాయని నిపుణులు తేల్చిన దృష్ట్యా బలోపేతం చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. గేట్ల నిర్వహణ, పూడికతీత కూడా భద్రతా చర్యల్లో భాగంగా ఉండాలని.. వరద ఉధృతికి తగినట్లుగా కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించారు. దీనిపై తక్షణమే స్పందించిన బోర్డు... భద్రతా చర్యలపై ఒకట్రెండు రోజుల్లో కేంద్ర జల సంఘానికి లేఖ రాస్తామని స్పష్టం చేసింది. దీంతోపాటు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) అధికారులతో కమిటీ వేయాలని, వారి సూచనల ప్రకారం తక్షణ చర్యలు చేపట్టాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. నియంత్రణపై జరగని చర్చ.. పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను కృష్ణా బోర్డు నియంత్రణలోకి తెచ్చే అంశం ప్రస్తావనకు వచ్చినా చర్చ మాత్రం జరగలేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరపనందున.. నియంత్రణ అవసరం లేదని తెలంగాణ నోటిమాటగా తెలిపింది. ఏపీ అభ్యంతరం చెబుతున్న పాలమూరు, డిండి ప్రాజెక్టులు కొత్తవి కావని, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టినవేనని వివరించింది. అయితే ఈ అంశాలపై తదుపరి సమావేశంలో చర్చిద్దామని బోర్డు అధికారులు పేర్కొనగా... దానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. ఇక బోర్డు నిర్వహణ నిమిత్తం రూ.11.4 కోట్లు కేటాయించాలని బోర్డు ఇరు రాష్ట్రాలను కోరింది. అధికారుల జీతాలకే రూ. 5.70 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. నిర్వహణ ఖర్చును ఇరు రాష్ట్రాలు చెరిసగం భరించాలని సూచించగా... ఇరు రాష్ట్రాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.