breaking news
Rey movie
-
అతనిలో యంగ్ మెగాస్టార్ లుక్స్ కనిపించాయి! - వైవీయస్ చౌదరి
‘‘సాయిధరమ్‌ని నేను తొలిసారి చూసినప్పుడు తనలో ‘యంగ్ మెగాస్టార్ లుక్స్’ కనిపించాయి.అతన్ని హీరోగా పరిచయం చేయాలనుకున్నాను. అదే మాట సాయిధరమ్‌తో అంటే, మామయ్యలు పరిచయం చేస్తారని అన్నాడు. ఆ తర్వాత చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్‌లతో మాట్లాడితే, వాళ్లు ఒప్పుకున్నారు. ఈ చిత్రం ప్రతి దశలోనూ వాళ్లు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు’’ అని దర్శక, నిర్మాత వైవీయస్ చౌదరి చెప్పారు. యలమంచిలి గీత సమర్పణలో బొమ్మరిల్లువారి పతాకంపై సాయిధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ‘రేయ్’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా వైవీయస్ చౌదరి మాట్లాడుతూ -‘‘ఈ సినిమా విడుదలలో జాప్యం జరగడానికి ఎవరూ కారణం కాదు. ఎందుకు ఆలస్యం అయ్యిందనే విషయాల సమాహారంతో ఓ పుస్తకమే రాయొచ్చు. ఏదేమైనా సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే, ‘మీ విలువైన సమయం వృథా కాదు. హండ్రడ్ పర్సంట్ శాటిస్ఫేక్షన్ ఖాయం’ అనే మాటలతో ఈ చిత్రం ప్రచారాన్ని మొదలుపెట్టాం’’ అన్నారు. సాయిధరమ్ మాట్లాడుతూ -‘‘నా తొలి ఫొటోషూట్ జరిగింది 2011 మార్చి 27న. 2012లో ఇదే తేదీన ‘రేయ్’ ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు 2015లో ఇదే తేదీన సినిమా విడుదలవుతోంది కాబట్టి, మార్చి 27 అంటే నాకో సెంటిమెంట్. భవిష్యత్తులో చౌదరిగారితో మళ్లీ సినిమా చేస్తా’’ అన్నారు. వైవీయస్ చౌదరి కుమార్తె యుక్త మాట్లాడుతూ - ‘‘ఇందులో నేను హీరోకి చెల్లెలిగా నటించాను. ఈ చిత్రం నిర్మాణంలో మా నాన్న చాలా అవాంతరాలు ఎదుర్కొన్నారు. అన్నింటినీ అధిగమించారు’’ అని చెప్పింది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు. -
కరీబియన్ భాషలో రేయ్
బ్రిటీష్‌వారి కాలంలో చెరుకుతోటల పెంపకం కోసం కొంతమంది భారతీయుల్ని వెస్టిండీస్ తరలించారు. అలా వెళ్లి అక్కడే స్థిరపడ్డ ఓ భారతీయ కుటుంబానికి చెందిన కుర్రాడి కథతో తెరకెక్కిన చిత్రం ‘రేయ్’. సాయిధరమ్‌తేజ్‌ని కథానాయకునిగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. మరో విశేషం ఏంటంటే... వెస్టిండీస్‌కి చెందిన కరీబియన్ భాషలో డబ్ చేసి అదే రోజున అక్కడ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఒక తెలుగు సినిమా వెస్టిండీస్ భాషలో అనువాదమవ్వడం ఇదే ప్రథమం. ఈ చిత్రం యూనిట్ అమెరికా, వెస్టిండీస్‌లలో ప్రదర్శించే ప్రీమియర్ షోలలో కూడా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ- ‘‘వెస్టిండీస్‌లో పుట్టి, పెరిగిన తెలుగు కుర్రాడి కథ ఇది. కథానుగుణంగా ప్రథమార్ధం అంతా వెస్టిండీస్‌లో, ద్వితీ యార్ధమంతా అమెరికాలో నడుస్తుంది’’ అని తెలిపారు. సయామీ ఖేర్, శ్రద్ధాదాస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: యలమంచిలి గీత.