breaking news
restoration of roads
-
నత్తకు నడక..
⇒ ముందుకెళ్లని ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ ⇒ రెండేళ్లు గడుస్తున్నా పూర్తికాని వైనం ⇒ పైపులైన్ లీకేజీలతో పరేషాన్ కరీంనగర్ కార్పొరేషన్ : జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నా.. మంజూరు చేసిన పనులను పూర్తిచేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. కోర్టు నుంచి వర్క్‌షాప్ వరకు పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన జగిత్యాల రోడ్డు పను లు ఇంకా పూర్తికావడం లేదు. మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల మధ్య లోపించిన సమన్వయం ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వ లక్ష్యానికి అడ్డంకులు తెచ్చిపెడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక సెంటిమెంట్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 ఆగస్టు 5న కరీంనగర్లో తొలిసారి పర్యటించారు. ఆయన పర్యటనలో ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణకు రూ.46 కోట్లు మంజూరు చేశారు. ఆగస్టు 12న నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. ఆ తర్వాత నిధులు సరిపోవని మరో రూ.29 కోట్లు కేటాయించారు. మొత్తం రూ.70 కోట్ల నిధులతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా అధికారులు, ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీచేశారు. అయితే.. పనులు చేపట్టిన నాటి నుంచి అన్నీ అడ్డంకులే. మొదట రోడ్డు వైండింగ్ పనుల్లో తీవ్ర జాప్యం జరగగా, ఆ తర్వాత మంచినీటి పైపులైన్ పనులు రోడ్డు పనులను ముందుకు సాగకుండా చేశాయి. దీంతో ఆర్అండ్బీ రోడ్ల పునరుద్ధరణ నత్తకు నడకనేర్పినట్లు జరుగుతోంది. రెండేళ్లుగా తీవ్ర జాప్యం.. నగరంలోని 14.5 కిలోమీటర్ల ఆర్అండ్బీ రోడ్ల పనులు రెండేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. రోడ్డు విస్తరణకు మార్కింగ్, కూల్చివేత పను లు సుమారు ఆరు నెలలపాటు జరిగాయి. ఆ తర్వాత రోడ్డు పనులు ప్రారంభించారు. కోర్టు నుంచి జగిత్యాల రోడ్డు, సివిల్ ఆసుపత్రి నుం చి అపోలో రీచ్రోడ్డు, రాంనగర్ రోడ్డు పనుల ను మొదటి దశలో చేపట్టగా, అప్పటికే ఆ రో డ్లలో ఉన్న పాత కాలంనాటి మంచినీటి పైపులైన్లు పగిలిపోవడం, నెలల తరబడి ప్రజలకు తాగునీటి సరఫరా లేకపోవడంతో వ్యతిరేకత వచ్చింది. మరమ్మతులతో పని జరగకపోవడంతో ఆ తర్వాత కొత్తపైపులైన్లు వేసేందుకు కార్పొరేషన్ టెండర్లు నిర్వహించింది. హెచ్డీపీఈ పైపులైన్లు వేసి శాశ్వత పరిష్కారం చేపట్టాలని భావించారు. కానీ.. అది కూడా బెడిసికొట్టింది. పైపులైన్లు పూర్తయ్యాయని ఆర్అండ్బీ రోడ్ల కాంట్రాక్టర్ రోడ్డు పనులు మొద లు పెట్టారు. అయితే.. కొత్తగా వేసిన హెచ్డీపీఈ పైపులైన్లు కూడా నాసిరకం పనులతో లీకేజీలు బయటపడుతుండడంతో మళ్లీ మొదటికొచ్చింది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ లీకేజీలు అవుతుండడంతో పనులు పడకేశాయి. సర్వసాధారణం.. ఆర్అండ్బీ రోడ్ల పనులు పూర్తిచేసేందుకు మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులతో నెలకోసారి మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్‌సింగ్ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ.. పనులు ముందుకు కదలడం లేదు. మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎక్కడో ఒక చోట తాగునీటి పైపులైన్ లీకేజీ జరగడం సర్వసాధారణంగా మారింది. అయితే.. పైపులైన్ పనులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపడుతున్నామని, ఫిబ్రవరి మొదటి వారంలోనే పైపులైన్ పనులు పూర్తిచేసి అప్పగిస్తామని కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. పాత లీకేజీలను అరికడుతుంటే కొత్త లీకేజీలు కొంప ముంచుతున్నాయి. దీనంతటికీ నాసిరకం పనులే కారణంగా తెలుస్తోంది. లీకేజీలు ఏర్పడుతుంటే పనులు చేయడం సాధ్యం కాదని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. ఈ నెల 4న మంత్రి కేటీఆర్, 5న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా కోర్టు రోడ్డును పరిశీలించి పనులపై పర్యవేక్షించారు. అయినప్పటికీ ముందుకు కదలడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి రెండు శాఖల మధ్య సమన్వయంతో పనులు వేగంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కష్టాల్లో కార్పొరేషన్
సాక్షి, నెల్లూరు ప్రతినిధి: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా నెల్లూరు కార్పొరేషన్ పరిస్థితి తయారైంది. అభివృద్ధి ఊసే లేకుండా పోయింది. టీడీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా రాబట్టలేకపోయారు. దీంతో కార్పొరేషన్లో రోజురోజుకూ అప్పులు పేరుకుపోతున్నాయి. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక కార్పొరేషన్ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కార్పొరేషన్ చెల్లించాల్సిన అప్పులు సుమారు రూ.41 కోట్లకు పైమాటే. వివిధ రకాల పన్నుల రూపంలో వస్తున్న ఆదాయాన్ని అధికారులు అటూ ఇటూ మారుస్తూ నెట్టుకొస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే రిలయన్స్ సంస్థ ఓఎఫ్సీ కేబుల్ ఏర్పాటులో భాగంగా రోడ్ల పునరుద్ధరణకు విడుదల చేసిన నిధులను బకాయిపడ్డ కాంట్రాక్టర్లకు చెల్లింపే ఇందుకు నిదర్శనం. మొత్తంగా ఆరునెలలుగా నెల్లూరు నగరం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. కాంగ్రెస్ హయాంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారు. రెవెన్యూ మంత్రి నెల్లూరు వారే కావటంతో నిధులకు ఢోకాలేదని భావించారు. నిధులైతే మంజూరు చేయించుకున్నారు కానీ.. పనులు పూర్తి చేయలేకపోయారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే అభివృద్ధి పనులు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని విమర్శిస్తున్నారు.